ఎయిర్‌‌టెల్‌‌కు రూ.23,045 కోట్ల నష్టం

ఎయిర్‌‌టెల్‌‌కు రూ.23,045 కోట్ల నష్టం
  • ఏజీఆర్‌‌ బకాయిలకే రూ.28,450 కోట్లు
  • 4.79 శాతం పెరిగిన ఆదాయం

న్యూఢిల్లీ: టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌‌టెల్‌‌ ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టరుకు రూ.23,044 కోట్ల నష్టం ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా ప్రభుత్వానికి అడ్జెస్టెడ్‌‌ గ్రాస్‌‌ రెవెన్యూ (ఏజీఆర్‌‌)గా రూ.28,450 కోట్లు చెల్లించాల్సి రావడమే ఇందుకు కారణం. వీటిలో ప్రిన్సిపల్‌‌ మొత్తం రూ.6,164 కోట్లు కాగా, వడ్డీగా రూ.12,219 కోట్లు కట్టాలి. పెనాల్టీకి రూ.3,760 కోట్లు కేటాయించారు. పెనాల్టీపై వడ్డీకి రూ.6,307 కోట్లు ఇవ్వాలి. ఎయిర్‌‌టెల్‌‌ గత ఏడాది సెప్టెంబరు క్వార్టర్‌‌లో రూ.118 కోట్ల లాభం ప్రకటించగా, ఈ ఏడాది రూ.1.425 కోట్ల నష్టం వస్తుందని ఎనలిస్టులు అంచనా వేశారు. అయితే ఇదే కాలానికి రెవెన్యూ 4.90 శాతం పెరిగి రూ.21,131 కోట్లకు చేరుకుంది. కార్పొరేట్‌‌ ట్యాక్స్‌‌ వల్ల రూ.8,932 కోట్ల సమకూరాయి. ఇబిటా రూ.6,343 కోట్ల నుంచి రూ.8,936 కోట్లకు పెరిగింది. పన్నుకు ముందు లాభం (ప్యాట్‌‌) రూ.1,853 కోట్ల నుంచి రూ.623 కోట్లకు తగ్గింది. కన్సాలిడేటెడ్‌‌గా ఇబిటా 40.90 శాతం పెరిగి రూ.8,930 కోట్లకు చేరింది.

ఈ క్వార్టర్‌‌లో నష్టాలు పెరిగినా, కొత్తగా 80 లక్షల మంది కస్టమర్లను సంపాదించుకున్నామని, డేటా ట్రాఫిక్‌‌ వార్షికంగా 81 శాతం పెరిగిందని ఎండీ, సీఈఓ గోపాల్‌‌ విఠల్ అన్నారు. ఏజీఆర్‌‌ గురించి మాట్లాడుతూ దీనిపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని, అన్ని మార్గాలనూ పరిశీలిస్తామని చెప్పారు. టెలికం పరిశ్రమ కష్టాల్లో ఉన్నందున, కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్టు అన్నారు. ఏజీఆర్‌‌ విషయంలో డాట్‌‌ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు, టెల్కోలు ఏజీఆర్‌‌ను చెల్లించాలని గత నెల 24న తీర్పు చెప్పింది.

Airtel reports Rs 23,045 cr Q2 loss on Rs 28,450 cr provisions towards AGR dues