
‘స్పై’ సినిమాలో స్టైలిష్ యాక్షన్‌తో ఆకట్టుకున్న ఐశ్వర్య మీనన్... అందుకు పూర్తి భిన్నంగా ‘భజే వాయు వేగం’లో కనిపించనుంది. కార్తికేయ హీరోగా ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం మే 31న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఐశ్వర్య మీనన్ ఇలా ముచ్చటించింది.
‘‘-ఇందులో ఇందు అనే బ్యుటీషియన్ క్యారెక్టర్ చేశా. హీరో పాత్ర పేరు వెంకట్. కథలో నా పాత్ర కీలకంగా ఉంటుంది. వెంకట్ కోసం ఈ అమ్మాయి ఏదైనా చేస్తుంది. అంతగా అతన్ని ఇష్టపడుతుంది. ఇది రా కంటెంట్ మూవీ. యాక్షన్, ఎమోషన్ ఆకట్టుకుంటాయి. అయితే లవ్, రొమాన్స్ పార్ట్ తక్కువగానే ఉంటుంది. ట్రైలర్‌లో చూపించినట్టు డబ్బు నేపథ్యంగా కథ ఉంటుందా అనేది తెరపైనే చూడాలి. - కార్తికేయ ‘ఆర్ఎక్స్ 100’ చూశా. తనతో సినిమా చేయాలని ఉండేది.
అతను అందరితో ఫ్రెండ్లీగా ఉంటారు. -డైరెక్టర్ ప్రశాంత్ చాలా స్ట్రిక్ట్. సినిమా మీద క్లారిటీ ఉన్న డైరెక్టర్. రథన్ మ్యూజిక్ హైలైట్‌గా ఉంటుంది. యూవీ క్రియేషన్స్ ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించింది. ఇలాంటి పేరున్న సంస్థలో చేయడం గర్వంగా ఉంది. నేను భరతనాట్యం డ్యాన్సర్‌ను. మంచి డ్యాన్స్ నెంబర్స్ చేయాలనే కోరిక ఉంది. కానీ ఇప్పటిదాకా ఆ అవకాశం దక్కలేదు.
ఇక తమిళ, మలయాళ సినిమాలు చేస్తున్నా.. తెలుగు ఇండస్ట్రీ అంటే నాకు ఇష్టం. ఇక్కడే ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నా. అయితే ఇతర పరిశ్రమల్లో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు నో చెప్పలేం కదా. మలయాళంలో మమ్ముట్టి గారితో మూవీ చేసే ఛాన్స్ వచ్చింది. అలాంటి లెజెండ్‌తో కలిసి నటించే అవకాశం ప్రతిసారీ దక్కకపోవచ్చు. తెలుగులో ప్రస్తుతం ఒక సినిమాకు సైన్ చేశా. మరో రెండు డిస్కషన్స్ జరుగుతున్నాయి. తమిళంలో ఓ లవ్ స్టోరీ చేస్తున్నా’’.