ఐశ్వర్య రాయ్ పేరు, ఫొటోలు వాడటానికి వీల్లేదు.. ఢిల్లీ హైకోర్టులో నటికి బిగ్ రిలీఫ్

ఐశ్వర్య రాయ్ పేరు, ఫొటోలు వాడటానికి వీల్లేదు.. ఢిల్లీ హైకోర్టులో నటికి బిగ్ రిలీఫ్

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్‎కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. ఐశ్వర్య రాయ్ అనుమతి లేకుండా ఆమె పేరు, ఫోటో లేదా ఆమె వ్యక్తిత్వానికి సంబంధించిన వస్తువులను ఏ విధంగానూ ఉపయోగించరాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఏ వ్యక్తికి అయినా గుర్తింపు, గౌరవం వారి జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని కోర్టు పేర్కొంది. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు,  వీడియోలను వాణిజ్య ప్రకటనలు, అశ్లీల కంటెంట్ కోసం ఉపయోగిస్తున్నారంటూ ఐశ్వర్య రాయ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వెంటనే వాటిని నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టుకు విజ్ఞప్తి చేశారు.    

ఐశ్వర్య రాయ్ తరపు న్యాయవాది సందీప్ సేథి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో అనేక వెబ్‌సైట్‌లు ఆమె పేరు, చిత్రాలను దుర్వినియోగం చేస్తున్నాయని పేర్కొన్నారు.  aishwaryaworld.com వంటి వెబ్‌సైట్‌లు "ఐశ్వర్య రాయ్ అధికారిక వెబ్‌సైట్" అని చెప్పుకుంటూ ఎలాంటి అనుమతి లేకుండా ఆమె చిత్రాలతో వస్తువులను విక్రయిస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) జనరేటెడ్ ఫోటోలు, మార్ఫింగ్ చేసిన వీడియోలను కూడా సృష్టిస్తున్నారని తెలిపారు. వాటిని కొన్ని అశ్లీల వెబ్‌సైట్‌లలో సైతం ఉపయోగిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

ఈ పిటిషన్‎పై జస్టిస్ తేజస్ కరియా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం (సెప్టెంబర్ 11) ఐశ్వర్య రాయ్‎కు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. ఐశ్వర్య రాయ్ అనుమతి లేకుండా ఆమె పేరు, ఫోటో లేదా ఆమె వ్యక్తిత్వానికి సంబంధించిన వస్తువులను ఏ విధంగానూ ఉపయోగించరాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా సంస్థ లేదా వ్యక్తి ఐశ్వర్య రాయ్ గుర్తింపును దుర్వినియోగం చేస్తే అది ఆమె పేరు, కీర్తిని దెబ్బతీస్తుందని కోర్టు అభిప్రాయ పడింది. 

ఏ వ్యక్తికి అయినా గుర్తింపు, గౌరవం వారి జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని కోర్టు పేర్కొంది. అనుమతి లేకుండా ఒక వ్యక్తి పేరు, ఫొటో ఉపయోగించడం వారి జీవించే హక్కు, గౌరవాన్ని ఉల్లంఘించడమే అవుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఆమె వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించే వెబ్‌సైట్‌లకు ఇంజక్షన్ ఆర్డర్లు జారీ చేస్తామని తెలిపింది. ఈ అనధికారిక కంటెంట్‌ను తొలగించడానికి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించనున్నట్లు కోర్టు వెల్లడించింది.