ఐశ్వర్యా రజనీకాంత్ ఇంట్లో దొంగతనం...లాకర్ లోని నగలు మాయం

ఐశ్వర్యా రజనీకాంత్ ఇంట్లో  దొంగతనం...లాకర్ లోని నగలు మాయం

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. చెన్నైలోని ఆమె నివాసం నుంచి 48 తులాల వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు ఐశ్వర్య రజనీకాంత్ తెయాన్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాకర్ లో పెట్టిన ఆభరణాలు కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2019లో  తన సోదరి సౌందర్య వివాహ వేడుకలో ఈ ఆభరణాలు ధరించినట్టు తెలిపారు. ఆ తర్వాత నుంచి బయటకు తీయలేదని చెప్పారు. తన లాకర్ లో ఆభరణాలు ఉన్నట్లు కొంతమంది పనివారికి మాత్రమే తెలుసని తెలిపారు. ఐశ్వర్య రజనీకాంత్ ఫిర్యాదుతో సెక్షన్ 381 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.

ఐశ్వర్య రజనీకాంత్  ప్రస్తుతం లాల్ సలామ్ సినిమాతో బీజిగా ఉన్నారు.  ఇందులో రజినీకాంత్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కోసం తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఆమె ఇంట్లో లేకపోవడంతో ఈ చోరీ జరిగినట్టు తెలుస్తోంది. ఈ లాకర్ ను ఆమె పలు సందర్భాల్లో వేర్వేరు ఇళ్లకు తరలించినట్టు వివరించారు.  2021 ఆగస్టు వరకు ఆ లాకర్ సేయింట్ మేరీస్ రోడ్డు లోని తన అపార్ట్ మెంట్ లో ఉంచానని చెప్పారు.  హీరో ధనుష్ తో కలిసి ఉన్న సమయంలో వాటిని అక్కడికి మార్చినట్లు పేర్కొన్నారు. 2022 లో తన తండ్రి రజినీకాంత్ పోస్ గార్డెన్ ఇంటికి షిఫ్ట్ చేసినట్లు ఐశ్వర్య తెలిపారు. ఆ లాకర్ కి సంబంధించిన తాళాలు అపార్ట్ మెంట్ లోని ఉంటాయని.. వాటి గురించి తన ఇంట్లో పనిచేసే ముగ్గురికి తెలుసునని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

అయితే ఫిబ్రవరి 18న ఆమె లాకర్ ను తెరిచి చూడగా, తనకు వివాహమైన తర్వాత నుంచి గత 18 ఏళ్లలో సమకూర్చుకున్న ఆభరణాల్లో కొన్ని లేవని గుర్తించారు. డైమంట్ సెట్స్, పురాతన బంగారం పీసులు, నవరత్న సెట్స్, గాజులు చోరీకి గురయ్యాయని చెప్పారు.  తన దగ్గర పనిచేసే ఈశ్వరీ, లక్ష్మీ, డ్రైవర్ వెంకట్ పై ఐశ్వర్య రజనీకాంత్ అనుమానం వ్యక్తం చేశారు.