ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

రామకృష్ణాపూర్​,వెలుగు: మందమర్రి ఏరియా ఆర్కే-1ఏ గనిలో మరో పదేండ్ల పాటు వెలికితీసేందుకు అవసరమైన బొగ్గు నిల్వలున్నాయని, ఆ గనిని మూసేయొద్దని ఏఐటీయూసీ లీడర్లు సింగరేణి డైరెక్టర్​ ఎన్.బలరాంనాయక్​కు ఆదివారం వినతి పత్రం ఇచ్చారు. గనిని మూసివేస్తే అందులో పనిచేసే కార్మికులను, ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడం వల్ల ఇబ్బందులు పడుతారని, ఆర్కేపీ టౌన్​లో స్థిరపడిన కార్మిక కుటుంబాలు మరో ప్రాంతానికి వెళ్లడం కష్టమవుతుందన్నారు. డైరెక్టర్​ను కలిసిన వారిలో ఏఐటీయూసీ జనరల్​ సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య, ఆర్కేపీ, మందమర్రి బ్రాంచీల సెక్రటరీలు ఎండి.అక్బర్​అలీ, సలెంద్ర సత్యనారాయణ పాల్గొన్నారు.

మెగా వైద్య శిబిరానికి స్పందన

నిర్మల్, వెలుగు: ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ( ఆవోపా) ఆధ్వర్యంలో ఆదివారం జుమ్మేరాత్ పేట్ హైస్కూల్లో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. 2వేల మందికి పైగా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 24 మంది డాక్టర్లు స్క్రీనింగ్ టెస్ట్ చేశారు. ప్రోగ్రాం చైర్మన్ డాక్టర్ చిటికేసి వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం చేపట్టగా.. జడ్పీ చైర్ పర్సన్ కోరిపల్లి విజయలక్ష్మి, డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ధనరాజ్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆవోపా బాధ్యులు విలాస్, అయిత వెంకటరమణ, మంత్రి శ్రీనివాస్ గుప్తా, దయానంద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. తప్పిన ప్రమాదం

బెల్లంపల్లి రూరల్​, వెలుగు: మంచిర్యాల - చంద్రాపూర్​ జాతీయ రహదారిపై బోయపల్లి బోర్డు వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల డిపోకు చెందిన బస్సు ఆసిఫాబాద్​ నుంచి మంచిర్యాల వెళ్తోంది. దానికి ఎదురుగా లోడ్​తో వస్తున్న లారీ అతివేగంగా ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఘటనలో లారీ డ్రైవర్​ క్యాబిన్​లోనే ఇరుక్కుపోగా స్థానికులు ఆయనను కాపాడారు. బస్సులో ఉన్న సుమారు 10 మందికి గాయాలపాలయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న తాండూర్​ పోలీసులు గాయపడ్డవారిని బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

సద్దుల బతుకమ్మ తెచ్చిన గిరాకీ

నేడు సద్దుల బతుకమ్మ  కావడంతో  ఆదివారం  పట్టణంలోని కాంటా ఏరియాలో పూల అమ్మకాలు జోరుగా సాగాయి.  తంగెడు , బంతి, చామంతి, గునుగు, తామారపువ్వులను స్థానికులు కొన్నారు.  కాసీపేట, నెన్నెల, వేమనపల్లి, తాండూర్ ప్రాంతాలనుంచి  బెల్లంపల్లి వచ్చారు. దీంతో మార్కెట్ ఎటు చూసిన పూల కొనుగోళ్ళ దారులతో కిటకిటలాడింది. కిందటేడాది రేట్లతో పోలిస్తే  ఈ ఏడాది ఎక్కువగానే ఉన్నాయని ప్రజలు పేర్కొన్నారు.  

- బెల్లంపల్లి ,  వెలుగు 

ఘనంగా గంగనీళ్ల జాతర

లోకేశ్వరం, వెలుగు : దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా మండలంలోని బిలోలి గ్రామంలో  గంగనీళ్ల జాతర ఆదివారం ఘనంగా జరిగింది. ఆలయాల్లోని విగ్రహాల ఆభరణలను గోదావరికి తీసుకెళ్లి శుభ్రం చేసి అనంతరం గ్రామానికి తీసుకువచ్చారు.ఈ  సందర్భంగా గ్రామంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రజిత, గ్రామభివృద్ధి కమిటీ సభ్యులు , గ్రామస్తులున్నారు. 
నిర్మల్ : అడెల్లి మహా పోచమ్మ గంగనీళ్ల జాతర ఆదివారం వైభవంగా సాగింది. శనివారం అమ్మవారి ఆభరణాల దిలావర్​పూర్​ మండలంలోని సాంగ్వి  గోదావరి నదిలో శుద్ధి చేసేందుకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఆదివారం వేకువ జామున అమ్మవారి ఆభరణాలు గోదావరి నది వద్దకు చేరుకున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. ఇక్కడి నుంచి ఆభరణాలు మల్లాపూర్, కంజర, బన్సపల్లి గ్రామాల మీదుగా దిలావర్పూర్ కు చేరుకున్నాయి. అటునుంచి మాడేగాం మీదుగా అమ్మవారి ఆభరణాలను అడెల్లి పోచమ్మ ఆలయానికి తీసుకువచ్చారు. కాగా  అడెల్లి పోచమ్మకు పద్మశాలీలు పట్టు వస్త్రాలను సమర్పించారు. నిర్మల్ రూరల్ సీఐ వెంకటేశ్​, సోన్ సీఐ రామ నరసింహారెడ్డి జాతర బందోబస్తు చర్యలు చేపట్టారు.

పురాతన కట్టడాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం

ఖానాపూర్,వెలుగు: మండలంలోని బాదన్ కుర్తి లో  పురాతన కట్టడాలు, బురుజులను అభివృద్ధికి కృషి చేస్తానని  ఎంపీ సోయం బాపురావు అన్నారు. అదివారం అయన బాదన్​ కుర్తీ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బురుజులు కనుమరుగు కాకుండా కాపాడుకుందామన్నారు.  భావితరాలకు బురుజుల చరిత్ర ను చూపించేలా కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనంతరం కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పార్శపు శ్రీనివాస్ ,  అసెంబ్లీ బీజేపీ కన్వీనర్,కో కన్వీనర్ పడాల రాజశేఖర్, నంది రెడ్డి, పెంబి జడ్పీటీసీ జాను భాయ్, బీజేపీ అసెంబ్లీ సీనియర్ నాయకుడు అజ్మీరా హరి నాయక్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ పాల్గొన్నారు. 

బీజేపీ ఆధ్వర్యంలో లాల్​ బహదూర్​  శాస్త్రి జయంతి

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు:  జిల్లా కేంద్రంలో ఆదివారం బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో  దివంగత  మాజీ ప్రధాని లాల్​ బహదూర్​ శాస్త్రి జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.  బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్​ శంకర్​, నాయకులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులూ వేద వ్యాస్, రత్నాకర్ రెడ్డి, సేకవత్, ముకుంద్ రావు, సతీష్ యదవ్, జ్యోతి  పాల్గొన్నారు.

ఘనంగా  వన్యప్రాణుల వారోత్సవాలు

జన్నారం,వెలుగు: 68వ వన్యప్రాణుల వారోత్సవాల సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో ఫారెస్ట్ ఆఫీసర్లు ర్యాలీ నిర్వహించారు. డివిజన్ ఆఫీస్ నుంచి మొయిన్ రోడ్డు ద్వారా వన్యప్రాణులను కాపాడుకోవలని నినాదాలు చేశారు.  గొండుగూడ గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఇందన్ పెల్లి,తాళ్లపేట రేంజ్ ఆఫీసర్లు హఫిజోద్దిన్,రత్నకర్,ఎఫ్​ఎస్ వో,ఎఫ్​బీవోలతో పాటు డివిజన్ ఆఫీస్ లోని సిబ్బంది పాల్గొన్నారు.

మహాత్మా గాంధీ ఆశయాలే దేశానికి రక్ష

నిర్మల్, వెలుగు: మహాత్మా గాంధీ ఆశయాలే దేశానికి రక్ష అని  మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం   గాంధీ జయంతి సందర్భంగా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ తో కలిసి స్థానిక గాంధీ పార్కులోని    గాంధీ విగ్రహానికి  నివాళులర్పించారు. గాంధీ ఆశయాలు దేశాన్ని కాపాడుతాయని, ప్రతి ఒక్కరు ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్ కడే, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు.

మందమర్రి/రామకృష్ణాపూర్:    మున్సిపాలిటీల్లో గాంధీ జయంతిని  ఘనంగా నిర్వహించారు.  కమిషనర్​ గద్దె రాజు, రామకృష్ణాపూర్​ సింగరేణి ఠాగూర్​ స్టేడియం వద్ద  అఖిలపక్ష రాజకీయ పార్టీల లీడర్లు, కార్యకర్తలు గాంధీజీకి పూలమాల వేసి అనంతరం కేక్​ కట్​ చేశారు.  

బాసర:  బాసర ఆర్ జేయూకేటీ  యూనివర్సిటీ ఇంచార్జి వీసీ వెంకటరమణ, కలెక్టర్ ముషారఫ్ అలీ, డైరెక్టర్ సతీశ్​ కుమార్ ,అదనపు కలెక్టర్ హేమంత్ బొర్కడే శ్రమదానం చేశారు.  విద్యార్థులతో ర్యాలీగా వెళ్లి శాతవాహన ప్లే గ్రౌండ్, మెస్ పరిసరాలు రహదారిపై ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి, ప్లాస్టిక్ చెత్తను తీసేశారు.  ప్రతి నెలలో ఒకరోజు విధిగా ఈ శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని  సూచించారు. 

ఇచ్చోడ :   ఇచ్చోడ మేజర్​పంచాయతీ కేంద్రంలో ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని  సర్పంచ్​ ఛౌహాన్​ సునీత, ఉప సర్పంచ్​ లోక శిరీష్​రెడ్డి మాజీ వైస్​ ఎంపీపీ దేవానంద్​ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా  రోడ్లను ఊడ్చారు.  కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సూర్యప్రకాష్​, వార్డు సభ్యులు పాల్గొన్నారు. 

ఉత్సాహంగా.. వాటర్‌ రాపెల్లింగ్‌ పోటీలు

ఇచ్చోడ, వెలుగు : ఇచ్చోడ మండలం గుండి వాగు పరిధిలోని గాయత్రి జలపాతం వద్ద తెలంగాణ రాష్ట్ర అడ్వెంచర్ క్లబ్ డైరెక్టర్ రంగారావు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రాపెల్లింగ్ పోటీలు ఆకట్టకున్నాయి.  ట్రెక్కింగ్​, రాపెల్లింగ్​, వాటర్​ బోటింగ్​, జుమార్​ పోటీల్లో క్రీడాకారులు పాల్గొన్నారు.  పోటీలను చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో వచ్చారు.  క్రీడల్లో పాల్గొన్న 20మంది క్రీడాకారులకు మేడిగూడ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఐటీడీఏపీ పీఓ వరుణ్ రెడ్డి మాజీ ఎంపీ గోడం నగేష్, స్థానిక ఎంపీపీ నిమ్మల పీతం రెడ్డి, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అడ్వెంచర్ అంబాసిడర్ మడావి కన్నె బాయి ఐటీడీఎస్ స్పోర్ట్స్ అధికారి పార్థసారథి, ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి ఆత్రం భాస్కర్ క్రీడాకారులు పాల్గొన్నారు. 

ఆర్​ఎంపీలకు ట్రైనింగ్​ ఇవ్వాలె

మంచిర్యాల, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో  అత్యవసర పరిస్థితుల్లో రోగులకు అండగా ఉండే  ఆర్ఎంపీ, పీఎంపీలపై అధికారుల తనిఖీలు ఆపాలని అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొద్దుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కరోనా కాలంలో రాష్ట్రం అల్లాడుతుంటే ప్రైవేట్ హాస్పిటల్స్ బంద్ చేసినప్పటికీ గ్రామీణ వైద్యులు మాత్రం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలకు అండగా నిలిచామన్నారు.  ఆర్ఎంపీ , పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి పల్లె దవాఖానాలలో పనిచేసే అవకాశం కల్పించాలని కోరారు.  

ముగిసిన ఆర్​ఎస్​ఎస్​ ప్రాథమిక శిక్ష వర్గ

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: జిల్లా కేంద్రంలోని ఓ  ప్రైవేటు పాఠశాలలో   వారం రోజులుగా జరిగిన ఆర్​ఎస్​ఎస్​ ప్రాథమిక వర్గ శిబిరం ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ఎంపీ సోయం బాపురావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్​ శంకర్​ హాజరై మాట్లాడారు.