
- సింగరేణిలో ఎగిరిన ఎర్రజెండా .. గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ
- అత్యధిక ఏరియాల్లో గెలిచినా మెజార్టీ ఓట్లు పొందలేకపోయిన ఐఎన్‌టీయూసీ
- ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు.. 94.20 శాతం పోలింగ్
హోరాహోరీగా సాగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ యూనియన్ విజయం సాధించింది. 11 డివిజన్లలో అత్యధికంగా ఆరు డివిజన్లను కాంగ్రెస్అనుబంధ ఐఎన్‌టీయూసీ, ఐదు డివిజన్లను ఏఐటీయూసీ గెలిచినప్పటికీ... ఓవరాల్ఓట్ల పరంగా ఐఎన్‌టీయూసీపై ఏఐటీయూసీ 2,007 ఓట్ల మెజారిటీ సాధించి గుర్తింపు సంఘంగా అవతరించింది. బుధవారం అర్ధరాత్రి వరకు ప్రకటించిన ఫలితాల్లో బెల్లంపల్లి, రామగుండం–1, రామగుండం– 2, మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్లలో ఏఐటీయూసీ (ది సింగరేణి కోల్మైన్వర్కర్స్యూనియన్) విజయం సాధించింది.
కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ (సింగరేణి కోల్మైన్లేబర్యూనియన్) ఇల్లందు, కొత్తగూడెం, కొత్తగూడెం కార్పొరేట్, మణుగూరు, రామగుండం– 3, భూపాపల్లి డివిజన్లలో గెలిచింది. కాగా, గత ఎన్నికల్లో ఒక్క డివిజన్‌లో కూడా గెలవని ఐఎన్‌టీయూసీ యూనియన్ ఈసారి అత్యధికంగా ఆరు డివిజన్లలో గెలిచి విజయ ఢంకా మోగించడం విశేషం. గత ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా గెలిచిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) ఈసారి ఏ ఒక్క చోటా ప్రభావం చూపలేకపోయింది. ఆ యూనియన్ చాలా చోట్ల జీరో, సింగిల్ డిజిట్ఓట్లకే పరిమితమైంది. ఏఐటీయూసీ గెలుపు ఖాయం కావడంతో చాలాచోట్ల ఆ యూనియన్ నాయకులు సంబరాల్లో మునిగితేలారు. మరోవైపు మణుగూరులో ఏఐటీయూసీపై ఐఎన్‌టీయూసీ కేవలం 2 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఇక్కడ రీ కౌంటింగ్‌కు ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేయగా, ఆఫీసర్లు అంగీకరించలేదు. కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నాలుగు ఏరియాల్లో ఐఎన్‌టీయూసీ గెలుపొందడం విశేషం.
ప్రశాంతంగా ఎన్నికలు..
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు 84 సెంటర్లలో ఎన్నికలు జరగ్గా, 94.2% పోలింగ్ నమోదైంది. పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలోని 11 డివిజన్లలో 39,773 మంది కార్మికులకు గాను 37,468 మంది ఓటు వేశారు. కొత్తగూడెం కార్పొరేట్‌లో 1,191 మందికి గాను 1,146 మంది, కొత్తగూడెం ఏరియాలో 2,326 మందికి గాను 2,207 మంది, ఇల్లందులో 614 మందికి గాను 604 మంది, మణుగూర్‌లో 2,450 మందికి గాను 2,378 మంది, రామగుండం1లో 5,384 మందికి గాను 5,064 మంది, రామగుండం 2 ఏరియాలో 3,556 మందికి గాను 3,369 మంది, రామగుండం3లో 3,884 మందికి గాను 3,612 మంది, భూపాలపల్లిలో 5,410 మందికి గాను 5,123 మంది, బెల్లంపల్లిలో 996 మందికి గాను 959 మంది, మందమర్రిలో 4,835 మందికి గాను 4,515 మంది, శ్రీరాంపూర్‌లో 9,127 మందికి గాను 8,491 మంది ఓటేశారు.