ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ‘ భారతీయుడు

 ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా  ‘ భారతీయుడు

మన భారతీయ సంతతికి చెందిన ‘అజయ్ బంగా’ 189 దేశాలకు చెందిన, సుమారు 78 సంవత్సరాల ఘనమైన చరిత్ర కలిగిన ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా జూన్ 2వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా భారతీయులుగా మనం ప్రశంసించాల్సిన విషయమే. గతంలో మాస్టర్ కార్డు సీఈఓగా పనిచేస్తూ మంచి ట్రాక్ రికార్డ్ సృష్టించాడు. ప్రస్తుతం జనరల్ అట్లాంటిక్ వైస్ చైర్మన్ గా సేవలు అందిస్తున్న తరుణంలో, ఆయన సామర్థ్యం వల్ల ప్రపంచ బ్యాంకు14వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే, ఇప్పటివరకూ ప్రపంచ బ్యాంకుపై పలు విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా కనుసన్నల్లో నడుస్తూ, అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహకారం పేద, మధ్య తరగతి దేశాలకు  అందించడం లేదనే భావన విశ్వవ్యాప్తంగా ఉంది.‌‌‌‌ ఈ భారత సంతతికి చెందిన అజయ్ బంగా తన పదవీ కాలంలో కొన్ని సహేతుకమైన నిర్ణయాలు తీసుకుని, అవసరాల్లో ఉన్న దేశాలకు ప్రాధాన్యతా క్రమంలో సాంకేతిక, ఆర్థిక సహకారం అందించేటట్లు చేస్తారని మనం ఆశించడం తప్పుకాదేమో!ః

పేద దేశాలపై దృష్టిపెట్టాలి

1944లో ప్రపంచ బ్యాంకును కొన్ని లక్ష్యాలతో ఏర్పాటు చేశారు.‌‌‌‌ వీటిలో  ముఖ్యంగా పేద,మధ్య తరగతి దేశాలకు సాంకేతిక, ఆర్థిక సహకారం, ముఖ్యంగా విద్యాభివృద్ధికి పాఠశాలల నిర్మాణం, మంచినీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, వివిధ రోగాల నుంచి ప్రజలను రక్షించడానికి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిలో భాగంగా స్వల్ప, దీర్ఘకాలిక ఋణాలు, కొన్ని సందర్భాల్లో రాయితీలు ప్రోత్సాహకాలు ఇస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలు స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రపంచ బ్యాంకు పాటుపడాలి. కానీ ప్రపంచ బ్యాంకు తోపాటు దాదాపు అంతర్జాతీయ సంస్థలు అయిన ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వంటి వివిధ సంస్థలు అభివృద్ధి చెందిన  ఐదు/ ఆరు దేశాల కనుసన్నల్లో నడుస్తూ  తమ ఉనికిని, ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. ముఖ్యంగా  ఒక దేశ అభివృద్ధి ఆర్థిక వ్యవస్థ మీదే ఆధారపడి ఉంటుంది. అనగా విద్య, వైద్యం నైపుణ్యాలు మౌలిక వసతులు ఆయా దేశాల ప్రజలకు అందుబాటులో ఉండాలి. అయితే నేటికీ నూటికి 90% దేశాలకు ఆయా సామర్థ్యాలు ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక పరిపుష్టి లేదు. అందుచేతనే తరచూ ప్రపంచ బ్యాంకు తలుపులు తట్టుతూ ఉంటారు.‌‌‌‌ ప్రపంచంలో  వలసలు, శరణార్థులు, పెరుగుతూ ఇతర దేశాలకు భారంగా మారుతున్నాయి. అభద్రతాభావం పెరుగుతుంది. ఉగ్రవాదం మతతత్వం వివక్షతలు పెరిగిపోతున్నాయి.‌‌‌‌ పర్యావరణ పరిరక్షణకై కాప్, ఐపీసీసీ, ప్యారిస్ ఒప్పందం వంటి అనేక నిర్ణయాలు నేటికీ అభివృద్ధి చెందిన దేశాల్లో అమలు చేయడం లేదు. 

పనితీరుతో మార్పు తేవాలి

 ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఉగ్రవాదం, మతతత్వం, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, పాక్, శ్రీలంక పాలన, తాజాగా సూడాన్ అంతర్గత యుద్ధం, ఉత్తర కొరియా, అమెరికా, చైనా వంటి దేశాలు తరచూ సైనిక విన్యాసాలు, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం, ఆకలి కేకలు, మత్తు పదార్థాలు, అక్రమ రవాణలు ఉన్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షపీఠంపై కూర్చుంటున్న అజయ్ బంగా తన సామర్థ్యంతో ప్రపంచ బ్యాంకు పనితీరులో మంచి మార్పులతో మంచి ఫలితాలు సాధించాలని ఆశిద్దాం. ముఖ్యంగా పేద, మధ్యతరగతి  దేశాలకు మానవతా దృక్పథంతో ముందుకు రావాలి. తన పదవీ కాలం ఐదు సంవత్సరాల్లో ప్రపంచ బ్యాంకు అంటే కేవలం అప్పులు ఇవ్వడం, అధిక వడ్డీలతో రాబట్టుకోవడం మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక దేశాల్లో కనీస అవసరాలు తీర్చుకోవడానికి, మానవతా విలువలు కలిగిన సమాజాన్ని నిర్మించటానికి తన వంతు కృషి చేయాలని కోరుకుందాం. ‘సర్వే జనా సుఖినోభవంతు’ అనే భావనతో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్​ బంగా పనిచేస్తారని ఆశిద్దాం.
ఐ ప్రసాదరావు