హింస పరిష్కారం చూపదు..సీఏఏపై అజయ్‌‌‌‌దేవ్‌‌‌‌గన్‌‌‌‌

హింస పరిష్కారం చూపదు..సీఏఏపై అజయ్‌‌‌‌దేవ్‌‌‌‌గన్‌‌‌‌

ముంబై: ఏ సమస్యకైనా హింస పరిష్కారం కాదని, చర్చలు, అభిప్రాయాలు పంచుకోవడంతోనే పరిష్కారం దొరుకుతుందని బాలీవుడ్‌‌‌‌ హీరో అజయ్‌‌‌‌ దేవ్‌‌‌‌గన్‌‌‌‌ అన్నారు. ఆదివారం ఓ ఇంటర్వ్యూలో సీఏఏపై ఆయన స్పందించారు. సీఏఏకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారంతా శాంతియుతంగా అభిప్రాయాలు తెలిపితే బాగుంటుందన్నారు. ‘ఇది ప్రజాస్వామ్యం. రాజ్యాంగం ఉంది. అది తన పరిధిలో సమాజాన్ని నడిపిస్తుంది. అధికారంలో ఉన్న వాళ్లు కొన్ని మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. దానికి ప్రభావితమయ్యే వాళ్లు స్పందించడం సహజం. మార్పును తిరస్కరించే హక్కు వాళ్లకుంది. రెండు వైపులనుంచి అభిప్రాయాలను గౌరవించుకోవాలి. హింస అనే దానికి చోటుండొద్దు’ అని అన్నారు. చాలా మంది బాలీవుడ్‌‌‌‌ హీరోలు తమ అభిప్రాయాల్ని పంచుకునేందుకు వెనుకాడుతున్నారని విమర్శించారు. అనేక మంది ప్రభావితమయ్యే అంశంపై అభిప్రాయం పంచుకోవడమే మంచిదన్నారు. సెలబ్రెటీల అభిప్రాయం వేల మందిపై ప్రభావం చూపుతుందని, స్పందించే ముందు విషయంపై పూర్తి అవగాహన తెచ్చుకోవాలన్నారు. ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రెటీస్‌‌‌‌ ఫర్హాన్ అక్తర్, పరిణితి చోప్రా, షబానా అజ్మీ, జావేద్ అక్తర్, సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, స్వర భాస్కర్, రిచాచాదా, అనురాగ్ కశ్యప్ తదితరులు సీఏఏపై స్పందించారు.