ఇండియా వచ్చి ఇండియాలో వన్డే సిరీస్ గెలవడం అంత సామాన్యుమైన కాదు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా లాంటి పటిష్టమైన జట్లు ఇండియాలో సిరీస్ గెలవడానికి తీవ్రంగా శ్రమిస్తాయి. కానీ న్యూజిలాండ్ మాత్రం టీమిండియాకు షాక్ ఇచ్చింది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ లో ఓడిపోయినా చివరి రెండు మ్యాచ్ ల్లో గెలిచి సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఈ రెండు విజయాలను గాలివాటం అని చెప్పలేం. క్రమశిక్షణగా ఆడి ఒక ప్లానింగ్ తో ఇండియాకు కివీస్ ఊహించని షాక్ ఇచ్చింది. స్వదేశంలో ఇండియా వన్డే సిరీస్ ఓటమికి కారణాలేంటో టీమిండియా క్రికెటర్ అజింక్య రహానే చెప్పాడు.
రహానే తన యూ ట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ ఇలా అన్నాడు.. "నిన్నటి (మూడో వన్డేను) మ్యాచ్‌ను ప్రత్యేకంగా పరిశీలిస్తే న్యూజి లాండ్ జట్టు అద్భుతంగా ఫీల్డింగ్ చేసింది. సిరీస్ మొత్తం వారు చక్కటి ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మూడో వన్డేలో 15 నుండి 20 పరుగులు ఆదా చేశారు. గ్లెన్ ఫిలిప్స్ తో పాటు మిగిలిన ఫీల్డర్లు కూడా సమిష్టిగా ఫీల్డింగ్ చేశారు. మీరు ఒక జట్టుగా ఫీల్డింగ్ బాగా చేసినప్పుడు అది ప్రత్యర్థిపై ఒత్తిడిని కలిగిస్తుంది. కివీస్ వ్యూహాలు ఈ మ్యాచ్ లో పని చేశాయి. ప్రణాళికతో ఆడిన వారికే పూర్తి క్రెడిట్ చెందుతుంది". అని రహానే అన్నాడు.
కోహ్లీ సెంచరీ చేసినా ఇండియా కు తప్పని ఓటమి:
న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓడిపోయింది. ఆదివారం (జనవరి 18) ఇండోర్ వేదికగా హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్ లో 41 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఫలితంగా మ్యాచ్ తో పాటు 1-2 తేడాతో సిరీస్ కూడా ఇండియా చేజార్చుకుంది. 338 పరుగుల ఛేజింగ్ లో కోహ్లీ వీరోచిత సెంచరీ (124) చేసి పోరాడినా ఫలితం లేదు. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టిన న్యూజిలాండ్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ఇండియా 46 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది.
►ALSO READ | IND vs NZ: ఇండియాతో తొలి టీ20: కోహ్లీని రెండుసార్లు ఔట్ చేసిన పేసర్‌కు న్యూజిలాండ్ టీ20 జట్టులో స్థానం
