
- పలు జిల్లాల్లో భారీ వర్షాలు అజ్మీర్ సహా పలు సిటీల్లో వరదలు
- ఒడిశాలో నీట మునిగిన 30 గ్రామాలు
- కేరళలోనూ భారీ వానలు
జైపూర్: రాజస్థాన్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం నుంచి భారీ వానలు పడుతున్నాయి. దీంతో పలు నగరాలను వరదలు ముంచెత్తాయి. అజ్మీర్, పుష్కర్, బూందీ, సవాయ్ మాధోపూర్, పాలీ తదితర సిటీల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నదులు, నాలాలు ఉప్పొంగి పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.
గడిచిన 24 గంటల్లో అత్యధికంగా బూందీ జిల్లాలోని నైన్వాలో 23.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు శనివారం తెలిపారు. నాగౌర్‌లోని మెర్టా సిటీలో 23, అజ్మీర్‌లోని మంగ్లియావాస్‌లో 19, నసీరాబాద్‌లో 18, ప్రతాప్‌గఢ్‌లో 16 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయిందని వెల్లడించారు. కాగా, అజ్మీర్‌లో కురిసిన భారీ వర్షానికి దర్గా ఏరియాలో పెద్ద ఎత్తున వరద వచ్చింది.
వరదలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని దుకాణదారులు రక్షించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శుక్రవారం రాత్రి బనాస్ నదిలో చిక్కుకున్న 17 మందిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. అజ్మీర్‌లో శనివారం ఉదయం ఓ పాత ఇల్లు కూలిపోయింది.
కేరళలో రెడ్ అలర్ట్..
కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి వయనాడ్, కోజికోడ్‌లో వానలు దంచికొట్టాయి. వాతావరణ శాఖ శనివారం ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కడ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని హెచ్చరించింది.
ఒడిశాలో వరద నీటిలో మొసళ్లు..
ఒడిశాలోని కేంద్రపడ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. బ్రాహ్మాణి, కణి నదులు ఉప్పొంగి దాదాపు 30 గ్రామాలు నీటమునిగాయి. రాకపోకలు బంద్ అయ్యాయి. కాలనీలు, రోడ్లు, పొలాలను వరద ముంచేసింది. కొన్నిచోట్ల వరదలో మొసళ్లు తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ప్రజలెవరూ బయటకు రావొద్దని, వరదలోకి వెళ్లొద్దని అటవీ శాఖ అధికారు లు హెచ్చరించారు.
వరదలో మొసళ్లు, విష సర్పాలు ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. చాలాచోట్ల ఇండ్లు, స్కూళ్లు, హెల్త్ సెంటర్లలోకి వరద చేరింది. కొన్నిచోట్ల విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. వరద బాధితులకు అధికారులు ఫుడ్, నీళ్లు పంపిణీ చేస్తున్నారు.