దేశాన్ని విభజించే కుట్రలు జరుగుతున్నయ్ : అక్బరుద్దీన్​ ఒవైసీ

దేశాన్ని విభజించే కుట్రలు జరుగుతున్నయ్ : అక్బరుద్దీన్​ ఒవైసీ
  • వాట్సాప్​ యూనివర్సిటీలో తప్పుడు సమాచారం, ద్వేషం: అక్బరుద్దీన్​ ఒవైసీ
  • హిందూ బీసీలకు నష్టం జరగకుండా ముస్లింలకు రిజర్వేషన్లు పెంచాలి
  • డీలిమిటేషన్​పై అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: ఈ దేశాన్ని కొందరు మతం ప్రాతిపదికన విభజించే కుట్రలు చేస్తున్నారని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్​ ఒవైసీ విమర్శించారు. ప్రజల మెదళ్లు, హృదయాలను కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. మతం పేరిట చిచ్చు పెడుతూ  అసలు పనే చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆసుపత్రి పేరు మార్చాలంటూ మాట్లాడుతున్నారని, విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. నిజాం షుగర్​ ఫ్యాక్టరీ, సిర్పూర్​ కాగజ్​నగర్​ పేపర్​ ఫ్యాక్టరీలను తెచ్చింది నిజాం నవాబులేనని అన్నారు. అలాగే, నిజాంసాగర్​, నాగార్జునసాగర్​ వంటి ప్రాజెక్టులకు సర్వే చేయించింది నిజాం అని పేర్కొన్నారు. చైనా యుద్ధం సమయంలో బండ్లపై బంగారాన్ని పంపింది నిజామేనని చెప్పారు. 

కానీ, ఇప్పుడు నిజాం నవాబులపై విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, ఇలాంటి వాళ్లను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లులపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్​ ఒవైసీ మాట్లాడారు. బీజేపీ వాళ్లకు ఓ ఫేమస్​ యూనివర్సిటీ ఉందని, అది వాట్సాప్​ యూనివర్సిటీ అని ఎద్దేవా చేశారు. ఆ వర్సిటీలో తప్పుడు సమాచారం, ద్వేషం వంటి వాటినే ప్రమోట్​ చేస్తున్నారని విమర్శించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని, అంటే దేశాన్ని బలహీనపరచడమేనని అన్నారు. 

రాష్ట్ర సర్కారుది మంచి ప్రయత్నం

ముస్లింలకు రిజర్వేషన్లు ఒక శాతం పెంచేందుకు రాష్ట్ర సర్కారు​ మంచి ప్రయత్నం చేస్తున్నదని, అయితే, బీసీల రిజర్వేషన్లలో కోత విధించి ముస్లింలకు ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని అక్బరుద్దీన్​ ఒవైసీ అన్నారు. హిందువుల్లోని బీసీలకు అన్యాయం జరగకుండా ముస్లింలలో వెనుకబడిన వారికి న్యాయం చేస్తే బాగుంటుందని సూచించారు. ఎస్సీల రిజర్వేషన్లను 15 నుంచి 18 శాతానికి, ఎస్టీల రిజర్వేషన్లను 10 నుంచి 12 శాతానికి పెంచాలని కోరారు. బీజేపీ వాళ్లు డీలిమిటేషన్​ పేరుతో దక్షిణాదిని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. డీలిమిటేషన్​కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని డిమాండ్​ చేశారు. కేంద్రంలో మన రాజకీయ వాటా, పార్లమెంట్​ సీట్లను తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.