నువ్వో బచ్చా .. దళిత ఎమ్మెల్యే కవ్వంపల్లిపై నోరుపారేసుకున్న అక్బరుద్దీన్

నువ్వో బచ్చా ..  దళిత ఎమ్మెల్యే కవ్వంపల్లిపై నోరుపారేసుకున్న అక్బరుద్దీన్

హైదరాబాద్, వెలుగు:  దళిత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో నోరుపారేసుకున్నారు. ‘బచ్చా, తెలివి ఉండాలె’ అంటూ సత్యనారాయణపై కామెంట్లు చేశారు. అక్బర్ చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం రేపాయి. ఎంఐఎం, ప్రభుత్వానికి నడుమ వాగ్వాదానికి దారితీశాయి. అసెంబ్లీకి మొదటిసారి ఎన్నికైన ఓ దళిత ఎమ్మెల్యేపై అక్బర్‌‌‌‌ చేసిన వ్యాఖ్యలు సరికాదని సీఎం రేవంత్‌‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు అన్నారు. 

 ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అక్బర్‌‌‌‌ను శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు కోరారు. ఒకవేళ ఆయన వెనక్కి తీసుకోకపోతే, ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌‌‌‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని స్పీకర్‌‌ ప్రకటించారు. 

ముస్లింల గొంతుక ఎంఐఎం: అక్బర్ 

అసెంబ్లీలో గురువారం విద్యుత్ శాఖపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా పాతబస్తీలోని సమస్యలను అక్బరుద్దీన్ ప్రస్తావించారు. ఈ క్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ కలగజేసుకుని.. పదేండ్లు ఇదే అసెంబ్లీలో ఉండి, ఓల్డ్ సిటీ అభివృద్ధి గురించి, నిధుల గురించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఇప్పుడు లెక్చర్లు ఇస్తున్న అక్బరుద్దీన్.. పదేండ్లుగా ఓల్డ్ సిటీ సమస్యలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. అక్బర్ మాట్లాడుతూ.. సత్యనారాయణపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘పిలగాండ్లు (బచ్చె) పెద్దవాళ్ల మాటల మధ్యలో దూరకూడదు. పిలగాండ్లు ఎంత మాట్లాడినా, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అసెంబ్లీ రికార్డులు తీసి చూస్తే మేము ఎన్నిసార్లు ఏమేం అడిగామో అందుబాటులో ఉంటుంది. ఓల్డ్‌‌ సిటీకి పదేండ్లలో రూ.14,500 కోట్ల పనులు సాధించినం” అని చెప్పారు. ‘‘20 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా మీ నియోజకవర్గానికి ఇన్ని పనులు, ఫండ్స్ సాధించలేరు. మీ నియోజకవర్గానికి ఐదేండ్లలో మీ ప్రభుత్వం ఎన్ని ఫండ్స్ ఇస్తుందో నేను చూస్తా. నేను గత ప్రభుత్వాన్ని అడగలేదని మీరు అంటున్నరు. అలా అనడానికి మీకు కొంచెం తెలివి ఉండాలి (ఐసే బోలెనా కా ఆప్‌‌కో జర అఖల్ హోనా చాహియే). ఇవ్వడం, ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్ణయం. నేను అడుగుతూనే ఉంటాను” అని అన్నారు. ముస్లింల గొంతుకగా ఉన్న ఎంఐఎంను అణచివేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని.. ఎవరెన్ని కుట్రలు చేసినా ఎంఐఎం ముస్లింల గొంతుక ఉంటుందని అన్నారు.

ముస్లింలు ఓట్లేస్తేనే నువ్వు గెలిచినవా?: రేవంత్ 

అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై రేవంత్ సీరియస్ అయ్యారు. ‘‘గత ప్రభుత్వాన్ని ఓల్డ్ సిటీ అభివృద్ధి గురించి ఎందుకు అడగలేదని ఒక కొత్త సభ్యుడు ప్రశ్నిస్తే.. ఆయనను కించ పరిచేలా‌‌ మాట్లాడడం సరికాదు. సహచర సభ్యున్ని గౌరవించాలి. సీనియర్లకైనా, జూనియర్లకైనా ఒకే రకమైన హక్కులు ఉంటాయి. అక్బరుద్దీన్‌‌ను గెలిపించినట్టే, సత్యానారాయణను ప్రజలు గెలిపించారు. ఆయనను కించపర్చినట్టు మాట్లాడితే, అది పెద్దరికం అనిపించుకోదు” అని అన్నారు. ‘‘అక్బరుద్దీన్‌‌ను మేం ప్రొటెం స్పీకర్‌‌ను చేశాం. మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించేందుకు ప్రయత్నించాం. కానీ ముస్లింల గొంతుకగా చెప్పుకుంటున్న ఎంఐఎం.. జూబ్లీహిల్స్‌‌లో మైనార్టీ నేత అజారుద్దీన్‌‌ను ఓడించేందుకు అక్కడ అభ్యర్థిని నిలబెట్టింది. అక్బరుద్దీన్ దోస్తు కేసీఆర్‌‌‌‌.. కామారెడ్డిలో షబ్బీర్‌‌‌‌ అలీని ఓడించడానికి పోటీకి దిగిండు. బీఆర్‌‌‌‌ఎస్‌‌, ఎంఐఎం ఒక్కటేనని ఇదే సభలో కేసీఆర్ అనేకసార్లు చెప్పారు. ఎంఐఎం, బీఆర్‌‌‌‌ఎస్ కలిసే పదేండ్లు ప్రభుత్వాన్ని నడిపాయి. పదేండ్లు సర్కార్ లో ఉన్న తర్వాత కూడా ఓల్డ్ సిటీ అభివృద్ధి జరగలేదని ఆయన చెబుతున్నారు. మాకు పాత, కొత్త సిటీలు వేర్వేరు కాదు. మొత్తం సిటీని అభివృద్ది చేసి, సిటీ పరపతిని మరింత పెంచే బాధ్యత మాది. అక్బరుద్దీన్‌‌ ను చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యేగానే మేము చూస్తున్నాం. ఆయనేమీ ముస్లింలు అందరికీ నాయకుడు కాదు. ముస్లింలు మాత్రమే ఓట్లు వేస్తే ఆయన గెలిచిండా? ఓల్డ్‌‌ సిటీ హిందువులు ఎంఐఎంకు ఓట్లు వేయలేదా? హిందూ ముస్లింలు అందరూ ఓటు వేస్తేనే.. ఎంఐఎం నేతలు గెలిచి ఇక్కడి వరకు వచ్చారు” అని రేవంత్ అన్నారు. 

సిద్దిపేటలోనే విద్యుత్ బకాయిలు ఎక్కువ..

విద్యుత్ బకాయిలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సిద్దిపేట తొలి స్థానంలో, గజ్వేల్ రెండో స్థానంలో, హైదరాబాద్‌‌ సౌత్ మూడో స్థానంలో ఉన్నాయని రేవంత్‌‌ సభలో ప్రకటించారు. ఆయా ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్‌‌‌‌, హరీశ్‌‌రావు, అక్బరుద్దీన్.. బకాయిల వసూలుకు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. “బీఆర్ఎస్​హయాంలో కరెంట్​కోతలు లేవనడం శుద్ధ అబద్ధం. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో విద్యుత్ కోతలే లేవన్నట్లు జగదీశ్​రెడ్డి మాట్లాడారు. రైతులు రోడ్డెక్కారా? అని ఆయన అడిగారు. రైతుల ధర్నాలకు సంబంధించి పేపర్లలో వచ్చిన వార్తలను సభ ముందు ఉంచుతున్నాను. కామారెడ్డిలో సెప్టెంబర్15న సబ్ స్టేషన్లను ముట్టడించి రైతులు నిరసన తెలిపిన సంగతి జగదీశ్​రెడ్డికి గుర్తుచేస్తున్నా. బీఆర్ఎస్ పాలనలోనే సూర్యాపేట జిల్లా నెరేడుచర్లలో రైతులు రోడ్డెక్కారు. కరెంటు సరిగా లేక పంటలు దక్కక కొమురయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నది బీఆర్ఎస్ పాలనలోనే. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆనాడు శ్రీశైలం పవర్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం జరిగి 9 మంది మరణించారు. ఈ ప్రమాదంలో ఫాతిమా అనే అమ్మాయి చనిపోతే కాంగ్రెస్ ఆదుకుంది. కానీ నాటి సీఎం, విద్యుత్ మంత్రి కనీసం ఆ కుటుంబాలను పరామర్శించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గాలను సభలో ఎంఐఎం కనీసం ప్రస్తావించలేదు. పాత స్నేహితుడిని రక్షించుకునేందుకు అక్బర్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్ హయాం నుంచి కేసీఆర్ హయాం వరకు ఎవరు ఎవరితో దోస్తీ చేశారో అందరికీ తెలుసు. ఆ అంశంపై మరోసారి చర్చిద్దాం.. ఇప్పుడు విద్యుత్ రంగంపై చర్చిద్దాం’’ అంటూ రేవంత్‌‌ చురకలంటించారు.

రేవంత్ పైనా అక్బర్ కామెంట్లు  

సీఎం రేవంత్‌‌ రెడ్డిపైనా అక్బరుద్దీన్ నోరుజారారు. అజారుద్దీన్‌‌ను ఓడించడానికి ఎంఐఎం ప్రయత్నించిందని రేవంత్ అనడాన్ని ఖండించారు. ఈ విషయంలో సీఎం రేవంత్ ఇమ్మెచ్యూర్‌‌‌‌గా మాట్లాడుతున్నారని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి స్పందించారు. ‘‘సభ నాయకుడి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు. సభలో హుందాగా వ్యవహరించాలి. జూనియర్ సభ్యుల విషయంలోనూ వారికి ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలి తప్పితే, కించపరిచేలా ప్రవర్తించకూడదు” అని సూచించారు.