కనౌజ్‌ నుంచి అఖిలేశ్ యాదవ్‌ నామినేషన్‌

కనౌజ్‌ నుంచి అఖిలేశ్ యాదవ్‌ నామినేషన్‌

కనౌజ్‌: సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ గురువారం కనౌజ్‌ లోక్ సభ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. రామ్ గోపాల్ యాదవ్ సహా ఇతర పార్టీ నేతలతో కలిసి రిటర్నింగ్​ అధికారికి ఆయన నామినేషన్ పేపర్స్ అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను ఇక్కడి నుంచి ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేయాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలు కోరుకున్నారు. 

ప్రజల ఆశీస్సులు నాకు లభిస్తాయని ఆశిస్తున్నాను. నాన్న (ములాయం సింగ్ యాదవ్) నన్ను పోటీ చేయమని కోరిన తర్వాత తొలిసారిగా ఇక్కడికి వచ్చినప్పుడు.. జనేశ్వర్ మిశ్రా, అమర్ సింగ్, ఆజం ఖాన్, నేతాజీ సహా అగ్రనేతలు ఇక్కడ ఉన్నారు. ఈ ఎన్నికతో బీజేపీ ప్రతికూల రాజకీయాలకు తెరపడుతుంది. బీజేపీ పని తీరును ప్రజలు ఇష్టపడరు. నేను గెలిచాక కనౌజ్‌​లో సోదరభావం, ప్రేమ వ్యాప్తి చెందుతాయి. కన్నౌజ్‌ పరిమళం మళ్లీ వెదజల్లుతుంది” అని అఖిలేశ్​ పేర్కొన్నారు. ఎస్పీ ప్రారంభించిన పనులను బీజేపీ ప్రభుత్వం నిలిపివేసిందని, తాను గెలిచిన తర్వాత సిటీని అభివృద్ధి చేస్తానని అఖిలేశ్ ​హామీ ఇచ్చారు.