
ఉత్తర ప్రదేశ్ లోని కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి తాను ఎంపీగా కొనసాగుతానని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ నుండి పోటీ చేసి భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. లోక్‌సభలో పార్టీ నాయకుడిగా అఖిలేష్ యాదవ్ వ్యవహరిస్తారించనున్నారు. ప్రజల ప్రయోజనాల కోసం సమాజ్‌వాదీ పార్టీ పోరాటం కొనసాగుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి వెల్లడించారు. సమాజ్‌వాదీ పార్టీ పోరాటం సుదీర్ఘమైనదన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగంగా, సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్‌లోని 80 సీట్లలో 37 స్థానాలను గెలుచుకుని లోక్‌సభలో మూడవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌కు 6 సీట్లు గెలుచుకుంది. ఎస్పీ 62, కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేశాయి. ఇక యూపీ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అఖిలేష్ యాదవ్ స్థానంలో ఎవరిని నియమించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పార్టీలో సీనియర్ నేతల్లో శివపాల్ యాదవ్ ను నియమించే అవకాశం ఉంది.