అక్షర ప్రపంచం: సముద్రమంత ఘోష

అక్షర ప్రపంచం: సముద్రమంత ఘోష

నేటి హైటెక్ యుగంలోనూ అర్థంలేని ఆచారాలు, కాలం చెల్లిన కట్టుబాట్లను కొనసాగిస్తున్నారు. ‘మనమంతా బానిసలం.. గానుగలం.. పీనుగులం’ అని శ్రీశ్రీ అన్నట్లు  మన మధ్య బానిసలకు లెక్కలేదు. ఈ దేవుడమ్మ పుస్తకంలో చెప్పిన కథల్లో చాలామటుకు ఎవరికీ పట్టని ఇలాంటి  బానిసల కథలే కనిపిస్తాయి. అందులో కొన్ని మానసిక, శారీరక హత్యాచారాలకు బలవుతున్న అతివల కథలైతే ఇంకొన్ని తరతరాల వివక్షకు, వెలివేతకు గురవుతున్న అణగారిన వర్గాల కథలు. 

ఇలాంటి నగ్న సత్యాలను  కథలుగా చెప్పడం కవులు, రచయితలకు అంత ఈజీ కాదు. బయటి గాయం గురించి కాకుండా, లోపలి తూటా గురించి మాట్లాడగలగాలి. దానిని దింపినవారిని గుర్తించి, నిలదీయగలిగే తెగువ ఉండాలి. అలాంటి తెగువ రచయిత్రి ఝాన్సీ పాపుదేశికి  ఉండడం వల్లే బాధితుల పక్షాన నిలబడి నిజాయితీగా ఈ కథలు చెప్పగలిగారు. 

పూనకం రావడం మానసిక రుగ్మత. చాలామందికి ఇంతవరకే తెలుసు. మొదటి కథ ‘దేవుడమ్మ’ ఈ అభిప్రాయాన్ని మార్చేస్తుంది. దేవుడు పూనడం, దెయ్యం పట్టడం తక్కువ కులాల్లో, అందులోనూ ఆడవాళ్లలోనే చూస్తుంటాం. తరతరాల అణచివేత, వెట్టి చాకిరి, పురుషాధిక్యత లాంటి కారణాలతో మన చుట్టూ ఎందరో దేవుడమ్మలు పుడుతుంటారు. కానీ, ఈ కథలోని దేవుడమ్మ వెనుక.. గడప లోపలి వ్యథ ఉన్నది. 

పీడనం పెరిగినప్పుడు కనీసం ‘ఈల’ంత గాలైనా బయటపడే దారి ఉండాలి. ఆ స్వేచ్ఛ లేనప్పుడు కుక్కర్ పేలినట్టే మనసులు పేలిపోతాయి. మనుషులూ కూలిపోతారు. అలా పేలకుండా, కూలకుండా నిలబడేందుకు ఒక ఆడమనిషి ఏం చేసిందన్నదే ఈ కథ. రచయిత్రి.. దేవుడమ్మ పాత్రలోకి దూరి ఆమెతోనే చెప్పించిన ఈ స్వగతంలోని చిత్తూరు సౌందర్యం కట్టిపడేస్తుంది. 

సాటి మనిషిని మనిషిగా చూడలేని మోడర్న్​ లైఫ్​లో రక్తసంబంధీకుల మధ్య మొలకెత్తుతున్న ఇనుప కంచెలకు ‘నీరుగట్టోడు’ కథ అద్దంపడుతుంది. చుట్టూ ఇసుకేస్తే రాలనంత  జనం ఉన్నా నీరుగట్టోడు ఎందుకు? ఎలా? ఒంటరయ్యాడో ఈ కథలో మనం అనుభవిస్తాం. తరచి చూడాలేగానీ సిటీలో కార్లకు గేట్లు తీసే వాచ్​మన్​లలో ఎందరో నీరుగట్టోళ్లు ఉంటారు. ఈ ఒక్క కథ ద్వారా కొడిగడుతున్న మానవ సంబంధాలను, పల్లెల్లో నిరాటంకంగా సాగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని, నగర జీవనంలోని పరాయీకరణను రచయిత్రి కళ్లకు గట్టారు. 

కెరీర్, స్టేటస్, మనీ రేసులో పడి గడ్డకట్టుకుపోతున్న మనసులను కరిగించే ప్రయత్నమే ‘ఊర్ధ్వతలం’ కథ! ఫక్తు అవార్సియస్​గా, కాస్త మెటీరియలిస్ట్​గా నెత్తిన కల్లోలకడలిని మోసుకు తిరిగే కథానాయకురాలు తన ప్రశాంతతను ఎక్కడ? ఎలా? వెతుక్కుందో ఈ కథలో చదవచ్చు. మహిళ మనసునూ, సముద్రపు లోతునూ అంచనా వేయలేమంటారు. కానీ, ఆమె ఒక్కసారి మనసు పడిందా అతడి కోసం తుదిశ్వాస వరకు అంకితమై ఉంటుంది. స్త్రీ ప్రేమ.. స్థల, కాలాదులకు అతీతమైందని 

‘ఏకపర్ణిక’ కథ చెప్తుంది. కలలో కనిపించి, కళ్ల ముందు మురిపించి, అంతలోనే మాయమైన తన వాడి కోసం కొండలకేసి, కోనలకేసి, రణరంగానికేసి, శిథిలాల కేసి ఆమె సాగించిన అన్వేషణ ఇది. ఓ జానపద గాథలా మొదలయ్యే ఈ కథ, పాఠకుల్ని ఒక దశలో ట్రాన్స్​లోకి తీసుకెళ్తుంది. క్రమంగా చరిత్రను తొడుక్కొని కల్పితమా? వాస్తవమా? అన్న సందిగ్ధంలో పడేస్తుంది. 
ఊరు ఒక్కటే. కానీ, నడి ఊరు, వెలివాడ వేరువేరు. 

రెండింటి మధ్య అంతులేని అగాధం. పూడ్చలేనిదేం కాదు. కానీ, పూడ్చనివ్వరు. ఈ వైపు నుంచి ఆ వైపు ఏ చిన్న చేయూతనూ పెత్తందారులు భరించలేరు. ఊరావలి మనుషులు తమ కాళ్ల దగ్గర పడి ఉండేందుకు ఎన్ని కుట్రలైనా పన్నుతారు. సొంత ఇండ్లలో తమకు భారమనుకున్న ఆడవాళ్లకూ రంకు అంటగట్టగలరు. అలాంటి కథే ‘తోలు’. దళితులు, మహిళల పట్ల మనువాదుల దాష్టీకాలకు ఈ కథ అద్దం పడుతుంది. 

దేవుని మొక్కువల్ల దేవదాసీగా మారిన ఓ ఆడబిడ్డ కథే ‘మాతమ్మ ప్రశ్న’.  ‘పురాణాల్లో సీతమ్మను ఎత్తుకుపోతే మీకు కోపం వస్తది.. ద్రౌపదమ్మ కోక లాగితే అగ్గిపుడ్తది.. మా బీదోళ్ల, కడజాతోళ్ల మానం ఏమైతే మీకేం మనాది?’ అంటూ ఆమె వేసే ప్రశ్నకు బహుశా ఎలాంటి సమాధానం దొరక్కపోవచ్చు. ‘నేటి నుంచి తల్లి నాభి బహిర్గతము.. తల్లి కటి జన సేవితము.. ఉన్న చోటే శయనము.. దక్కినదే పరమాణ్ణము.. తొలి నెత్తురంటిన దండెమునకు పాప నివారణము.. దోష నివారణము.. రోగ హరణము..’ ఈ కథలో మాతమ్మ కన్నెరికానికి వేలంపెడ్తూ పూజారి అన్న మాటలివి. ఇలాంటివి చదువుతుంటే రచయిత్రి అనుభవ, అధ్యయన క్షేత్రం ఎంత విశాలమో అర్థమవుతుంది. 

చావుకు దగ్గరైన సగటు భర్తకు భార్య మీద ఎలాంటి ఆలోచనలు ఉంటాయో చర్చించే కథ ‘అనుమానం’. ఆమె మానాన్ని తాకితే ఇంకో ప్రాణానికి ప్రమాదమని తెలిసినా పురుషాహంకారం ఆమెను వెంటాడి, వేటాడి పిచ్చిదాన్ని ఎలా చేస్తుందోఈ కథ చెప్తుంది. సమాజం వెలివేసిన ట్రాన్స్​జెండర్స్ జీవితాల్లోని చీకట్లను ‘ద్వైతం’ కథ కళ్లగడుతుంది. ‘పెంపుడు జంతువుల మీద చూపినంత ప్రేమను మా మీద చూపడానికి ఎవరికీ మనసు రాదు..’ అంటూ తార చెప్పే మాటలు తూటాల్లా తాకుతాయి. 

కేవలం సమాజం కోసం పురుష పీడనను తట్టుకోవడం ఇన్నాళ్లూ చెల్లిందేమో, ఇకపై చెల్లదంటూ చెంప ఛెళ్లుమనిపించిన కథే ‘మూవ్ ఆన్’. తరుచూ బ్రేకప్​లు చెప్పే మహిళల పట్ల సహజంగా ఉండే వ్యతిరేక భావం ఈ కథతో పటాపంచలవుతుంది. మొత్తంగా ‘దేవుడమ్మ, మరో పది కథలు’ భిన్నమైన బతుకుచిత్రాలు. ఈ పుస్తకం ద్వారా ఝాన్సీ పాపుదేశి, బాధితుల పక్షాన  గొంతెత్తి , వాళ్ల గోసను సముద్రమంత ఘోషతో వినిపిస్తున్నారు. ఇకనైనా మనం వినాలి. అందుకు ప్రతి ఒక్కరూ ఈ కథలు  చదివితీరాలి.

- చిల్ల మల్లేశం, 9490700060