భారత స్టాక్ మార్కెట్ ఈరోజు భారీ పతనాన్ని చూస్తోంది. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ఆసియా మార్కెట్లో పతనానికి దారితీశాయి. ఈ ప్రభావం భారత స్టాక్ మార్కెట్‌పై కూడా కనిపిస్తోంది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,500 పాయింట్లకు పైగా పడిపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ కూడా 500 పాయింట్లకు పైగా క్షీణించింది. దింతో ఉదయం 10:26 గంటలకు, బీఎస్ఈ సెన్సెక్స్ 1800.42 పాయింట్లు (2.42%) పడిపోయి 72,732.54 వద్ద ఉండగా.... నిఫ్టీ కూడా 574.35 పాయింట్లు (2.48%) పడిపోయి 22,540.15కి జారింది. ఈ పతనం కారణంగా, బీఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ క్యాప్ సుమారు రూ.13 లక్షల కోట్లు తగ్గి రూ.416 లక్షల కోట్లకు పడిపోయింది.
ఇదిలా ఉండగా, ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి డాలర్‌తో పోలిస్తే కనిష్ట స్థాయికి చేరుకుంది . దేశీయ రూపాయి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 0.1% తగ్గి 93.83కి చేరింది. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్‌లో నిన్న రూపాయి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 93.53 వద్ద ముగిసింది. పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ మూలధనం నిరంతరం బయటకు తరలిపోవడం, ముడి చమురు ధరలు భారీగా పెరగడం రూపాయిపై ఒత్తిడిని పెంచాయి.
ఏ స్టాక్‌లు అత్యధికంగా పడిపోయాయంటే
సెన్సెక్స్ స్టాక్‌లలో 28 క్షీణించగా, నిఫ్టీ స్టాక్‌లలో 48 నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. టాటా స్టీల్, హిండాల్కో ఇండస్ట్రీస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ అత్యధికంగా నష్టపోయాయి. మరోవైపు, ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్ టెక్ లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇండియా వోలటిలిటీ ఇండెక్స్ 10 శాతం పెరిగి 25.09కి చేరడం, ఇన్వెస్టర్లలో భయాందోళనలను సూచిస్తోంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 1.90 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 2.18 శాతం పడిపోయాయి. సెక్టర్ల వారీగా చూస్తే, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ దాదాపు 3 శాతంతో అత్యధికంగా నష్టపోయింది. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ మెటల్ కూడా క్షీణించాయి. ఇక ముడి చమురు ధరలు విషయానికి వస్తే బ్రెంట్ క్రూడాయిల్ 77 సెంట్లు పెరిగి బ్యారెల్‌కు $113 వద్ద ట్రేడ్ అవుతోంది. యూఎస్ బెంచ్‌మార్క్ డబ్ల్యూటీఐ క్రూడాయిల్ 1.05 శాతం పెరిగి బ్యారెల్‌కు $99.26కి చేరింది.
స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయిందంటే
48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీంతో ఈరోజు(మార్చ్ 23)న ఆసియా మార్కెట్లు తీవ్రంగా పడిపోయాయి. దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే దాదాపు ఆరు శాతం పడిపోయింది. జపాన్ స్టాక్ మార్కెట్ కూడా నాలుగు శాతానికి పైగా క్షీణించింది.
