
- పార్టీ ఉమ్మడి జిల్లా నాయకులతో కేటీఆర్ భేటీ
హైదరాబాద్, వెలుగు: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ(ఉప ఎన్నిక) టికెట్‌ను దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. గతంలో ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్‌లో చేరి కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నెల 11వ తేదీ నాటికి నామినేషన్లకు చివరి తేదీ కావడంతో.. అభ్యర్థి ఎంపికపై మహబూబ్‌నగర్‌కు చెందిన పార్టీ నాయకులతో సోమవారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని, అందరూ సహకరించాలని ఈ సమావేశంలో కేటీఆర్ వారికి సూచించినట్టుగా తెలిసింది.
మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ సీట్లపై కూడా సమావేశంలో చర్చించినట్టు నాయకులు తెలిపారు. త్వరలోనే రెండు పార్లమెంట్ నియోజకవర్గాలపైన కేసీఆర్ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కేటీఆర్ తెలిపారు. సమావేశంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, శానంపూడి సైదిరెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.