
హైదరాబాద్, వెలుగు: వచ్చేనెల 3న పార్టీలకతీతంగా దసరా పండుగ మరుసటిరోజు అలయ్ బలయ్ నిర్వహిస్తున్నట్టు ఆ కార్యక్రమ చైర్మన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. తెలంగాణ సంప్రదాయ, సంస్కృతులకు అద్దం పట్టేలా అలయ్ బలాయ్ ఉంటుందని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే చింతల రాంచందర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు తదితరులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు.
ఈ వేదిక ఎంతో మందిని పద్మ అవార్డులకు పరిచయం చేసిందని గుర్తుచేశారు. ఈ ఏడాది ఆపరేషన్ సింధూర్ థీమ్ తో అలయ్ బలయ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇందులో అమరవీరుల కుటుంబాలను సన్మానిస్తామని చెప్పారు. రాజకీయాలకతీతంగా జరిగే ఈ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మాజీ సీఎం కేసీఆర్ ను కూడా ఆహ్వానించినట్లు చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కూడా ఇన్విటేషన్ అందించినట్లు తెలిపారు. 3న జరిగే అలయ్ బలయ్ కు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇతర రాజకీయ పార్టీల కీలక నేతలు రాబోతున్నారని ఆమె వివరించారు.