బెల్టుషాపు.. నీతి కథ..

బెల్టుషాపు.. నీతి కథ..

రామేశం చనిపోయి అప్పటికి పదిహేను రోజులవుతుంది. ఇంటిల్లిపాదీ ఇంకా దుఃఖం నుండి బయట పడలేదు. మధ్యమధ్యలో పరామర్శించేవారు వచ్చిపోతూనే ఉన్నారు. విద్యార్థుల నుండి రాజకీయ ప్రముఖుల వరకు ఎవరెవరో పరామర్శించి వెళ్తున్నారు.భార్య, ఇద్దరు పిల్లలు, ముసలి తల్లిదండ్రులు మాత్రమే ఉన్న రామేశం నిజానికి ఏ రాజకీయ ప్రముఖుడో, ప్రజా నాయకుడో కాదు.

తెలంగాణ పల్లెల్లో ఓ సగటు మనిషి! నిరుద్యోగి. పైపెచ్చు ఓ తాగుబోతు. ఒక తాగుబోతు మరణిస్తే ఊళ్లో ఇంత ప్రాధాన్యత ఉంటుందా? అంటే... అతని చావు వెనుక ఉన్న దయనీయ గాథ అట్లాంటిది. అతడు తాగుబోతు కావడం వెనుక నేపథ్యం అట్లాంటిది. అందుకే తాగుబోతుగా మరణించినా సానుభూతికి అర్హుడయ్యాడు రామేశం.
*   *   *

సరిగ్గా పదేళ్ల క్రితం...

ఉస్మానియాలో ఎం.ఫిల్ చేసి, అక్కడే బి.ఇడి పూర్తి చేసిన రామేశం ఉద్యోగం లేక సతమతమవుతున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా ఉద్యోగాలు మాకొస్తాయనే భరోసాతో ఉద్యమంలో ఉధృతంగా పాల్గొన్నాడు. విద్యార్ధి, యువజన నాయకులతో కలిసి ర్యాలీలు, నిరసనలు, రైల్ రోకోలు చేశాడు. పోలీస్ దెబ్బలు తిన్నాడు. జైళ్లలో మగ్గాడు. చివరకు పదిహేను వందల మంది విద్యార్థుల బలిదానం అనంతరం తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. రామేశం ఆనందానికి అవధులు లేకుండా పోయింది. స్వరాష్ట్రంలో నీళ్లు, నిధులతో పాటు ఉద్యోగాలు కూడా పొంగి పొర్లుతాయని భావించాడు. తను చదివిన చదువులకు ఏ గ్రూప్ వన్ అధికారో కావాలనుకున్నాడు. అయితే.. రోజులు గడుస్తున్నకొద్దీ గ్రూప్ వన్ అధికారి కాదుగదా గ్రూప్ ఫోర్​ ఉద్యోగం కూడా రాలేదు. బి.ఇడి చేశాడు. కానీ, చివరకు టీచరైనా కాలేకపోయాడు. ఒకయేడు.. రెండోయేడు... మూడోయేడు.. ఐదేళ్ల కాలం పూర్తయింది. రామేశం వయసు పెరిగిపోతుంది కానీ ఉద్యోగం మాత్రం రాలేదు. కారణం.. అసలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లే రాకపోవడం.

మరో టర్మ్ లోనైనా ఉద్యోగాల భర్తీ జరుగుతుందనుకున్నాడు. మళ్లీ అదే ఎదురుచూపు నోటిఫికేషన్ల కోసం. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల దాకా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటున్నా అందులో ఏ పోస్టుపైనా కూర్చునే అదృష్టం దక్కలేదు రామేశానికి. ఆ మాటకొస్తే తెలంగాణలోని దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగుల్లో ఎవరికీ ఆ అదృష్టం దక్కలేదు.స్వరాష్ట్రం సాకారమై పదేళ్లు కావస్తున్నా, ఏ నియామకాల కోసమైతే విద్యార్థులు చదువులు పక్కనబెట్టి రోడ్లనెక్కారో.. సమ్మెల పేరుతో నెలల తరబడి విద్యకు దూరమయ్యారో.. పోలీసుల లాఠీ దెబ్బలను భరించి, జైళ్లను కూడా లెక్కచేయకుండా గ్రామగ్రామాల్లో ఉద్యమించారో.. ఆ నియామకాలు రెండు టర్ముల్లోనూ నీటిమూటలే అయ్యాయి.
పాలకుల ప్రాధాన్యాలు పైకి చెప్పినట్లుగా ఇవికావని ఉద్యమకాలంలో అర్ధం కాలేదు.అయినా... ఉద్యోగాలు భర్తీ చేయాలంటే నిధులు కావాలి. లక్షల కోట్ల నిధులన్నీ అప్రధాన్య అంశాలవైపు మళ్లినపుడు, అవినీతి మర్రి చెట్టు ఊడల్లా పాతుకుపోయినపుడు ఇంక ఉద్యోగాలేమిస్తారు. ఉన్న ఉద్యోగులకు సరిగా జీతం అందితేనే గొప్ప.
*   *   *
తెలంగాణ సాధించేనాటికి ముప్పై దాటిన నిరుద్యోగిగా ఉన్న రామేశానికి ఇప్పుడు ముప్పైతొమ్మిదేళ్లు. కొద్ది నెలల్లో వయసు మీరిపోతుంది కూడా. అయినా ఇప్పటికీ ఏ నోటిఫికేషన్లు లేవు. ఒకట్రెండు వెలువడినా అవి కోర్టు కేసుల్లో ఇరుక్కొని ముందుకు కదల్లేని స్థితి.ఈ పరిస్థితుల్లో గత నాలుగేళ్లుగా రామేశాన్ని ఆకట్టుకుంటున్నది బెల్టుషాపు.సిటీలో చేసేదేమీలేక ఇంటికొస్తే పెండ్లాం పిల్లల గోడు.

ముసలి తండ్రి పక్షవాతంతో పడకమీదుంటే, ఉబ్బసం వ్యాధితో ముక్కుతూ మూలుగుతూ ఉండే తల్లి. కులవృత్తులు అడుగంటి, నిరుద్యోగం పెచ్చుపెరిగిపోయిన దరిమిలా.. ఏ వాడకు పోయినా బెల్టుషాపులు మాత్రం ఆకర్షిస్తున్నాయి. విధిలేక మందుకు బానిసయ్యాడు రామేశం. అతని రోదనలోని వేదన పంచుకోవడానికి మందు సీసాలు తప్ప మరో ఆత్మీయుడు కనిపించలేదు. ఊళ్లో ఎవరితో గోడు వెళ్లబోసుకున్నా రోలు వెళ్లి మద్దెలకు మొరపెట్టుకున్నట్లే ఉంటుంది. రైతుల సమస్య రైతులది. కులవృత్తుల సమస్య కులవృత్తులది. యువకుల సమస్య యువకులది. అందరి సమస్యలకూ ఏరోజుకారోజు తక్షణ ఉపశమనం ఊరూరా వెలసిన మందుషాపులు. ఏ వీధికి వెళ్లినా పలకరించే బెల్టుషాపులు.

అప్పులు సప్పులైనా సరే.. తాగినోడికి తాగినంత.

ఉద్యోగం వచ్చాక తన గూనపెంకల ఇంటిపక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పెద్దిల్లు కట్టుకుందామనుకున్నాడు రామేశం. ఇప్పుడెలాగూ ఉద్యోగం లేదు. ఇంక పెద్దిల్లు ఆలోచన మాని ఆ ఖాళీ స్థలాన్ని అమ్మకానికి పెట్టాడు. కొంత సొమ్ము తల్లిదండ్రుల వైద్య ఖర్చులకు పోగా, మిగతా సొమ్మంతా ఏదో వ్యాపారానికి మళ్లించాలనుకున్న రామేశం ఆ డబ్బును మందుషాపు వైపు మళ్లించడం మొదలుపెట్టాడు. దాదాపు నాలుగేళ్ల నుండీ తాగుతూనే ఉన్నాడు.

ఉద్యోగం సద్యోగం లేదు. పెళ్లీడుకెదుగుతున్న కూతురు, డిగ్రీలో తప్పి, బ్యాక్ లాగ్ పరీక్షలకు వేలకొద్దీ వసూలు చేస్తున్న ఫీజులు కట్టలేక ఆగిపోయిన కొడుకు చదువు. మందులు సరిగా అందక మంచం నేస్తున్న తల్లి. చావు రాదు, బతుకలేడు అన్నట్లు భారంగా బతుకీడుస్తున్న తండ్రి.ఊళ్లో అంగన్ వాడి కార్యకర్తగా అరకొర జీతంతో నెట్టుకొస్తోంది అతని భార్య రాజేశ్వరి. ఆమె సంపాదనతో ఆ పూటకు తిండి దొరకడమే కష్టంగా ఉంది. ఎం.ఫిల్​లో గోల్డ్ మెడల్ సాధించినా ఫీజుల మోత భరించలేక పి.హెచ్ డి మధ్యలోనే ఆపేశాడు రామేశం.ఆ తరువాత ఎందుకూ కొరగాని వాడిగా మారాడు. అతను అలా కావడానికి కేవలం నేతల నమ్మక ద్రోహమే అని  ప్రతి నిరుద్యోగీ బలంగా నమ్ముతున్నాడు.

ఆ రోజు... బెల్టుషాపు దగ్గర ఫుల్లుగా తాగి ఇంటివైపు నడుచుకుంటూ వస్తున్నాడు రామేశం. దార్లో భగీరథ పైపుల లీకేజీని సరిచేసేందుకు తవ్విన గోతిలో బొక్కబోర్లా పడ్డాడు. తిరిగి లేవలేక అట్లాగే చనిపోయాడు. రామేశం మరణం ఆ కుటుంబానికి మరింత గుండెకోత మిగిల్చింది.
*   *   *
రాజేశ్వరి మనసు భారంగా ఉంది. ఒకవైపు భర్తపోయాడన్న బాధ, మరోవైపు కుటుంబాన్ని నెట్టుకురావడం ఎలా అనే ఆలోచన. పెళ్లైన నాటినుండీ రామేశం.. చదువుల యావ, ఉద్యోగాల వేటలో.. ఉన్న కొద్దిపాటి ఆస్తులు కరిగించాడే తప్ప సంపాదించలేదు. ఇంతకాలం తనే నెట్టుకొచ్చింది. ఇప్పుడు కూడా తనే నెట్టుకురావాలి! పై చదువులు చదువుకున్న భర్తే ఉద్యోగాల వేటలో అలసిపోయాడు. చదువుల విషయంలో ఇక పిల్లలేం సాధిస్తారో అర్ధంకాకుండా ఉంది. ఒకటైతే అర్ధమవుతుందామెకు.

నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్​తో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నియామకాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని పూర్తిగా తుంగలో తొక్కిందని. కొత్త ఉద్యోగాలు కల్పించాల్సిందిపోయి ఎక్కడికక్కడ ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. అదనపు భారంతో అధికారులు సతమతమవుతున్నారు తప్ప.. ఆ ఖాళీలను భర్తీ చేసే ఉద్దేశం కనిపించడం లేదు. ప్రభుత్వం ప్రాధాన్యతలే వేరైనపుడు ప్రజలుకూడా తమ ప్రాధాన్యతలు మార్చుకోవాల్సి ఉంటుంది. నిజమైన ప్రజాప్రభుత్వం ఏర్పడితే తప్ప భవిష్యత్ ఉండదన్నది జనం గ్రహిస్తున్నారు. ఇలా రాజేశ్వరి ఆలోచనలు సాగుతుంటే.. సరిగ్గా అదేటైంలో పదిమంది మహిళలు ఆ ఇంట్లోకి అడుగుపెట్టారు. ఇంటివెనుక బాధ పడుతూ కూర్చున్న రాజేశ్వరి వాళ్లను చూసి లేచి నిల్చుంది. ఊళ్లో మహిళామండలి సభ్యులు వాళ్లు. రాజేశ్వరికి సుపరిచితులే! ఆమె బాధకు ఎంతో కొంత ఉపశమనం కలిగించాలని వాళ్లు ఆమె దగ్గరకు వచ్చారు.

‘‘ఎన్ని రోజులు ఇట్లా ఏడుస్తూ కూర్చుంటావు? మీ ఆయన ఎట్లాగూ మీ ఇంటికి రూపాయి తెచ్చింది లేదు. ఇల్లు గడవాలంటే ప్రభుత్వ సాయం కూడా అందాలికదా! మనం విడో ఫించన్​కు అప్లై చేద్దాం. నెలనెలా రెండువేల ఫించన్ వస్తుంది’’ అంది ఆ మండలి అధ్యక్షురాలు. “అవును రాజేశ్వరి.. ఇప్పుడు మన ఊళ్లో  150మందికి పైగా విడో ఫించన్లు తీసుకుంటున్నారు.

నీక్కూడా వస్తుంది. మాతో వస్తే ఎంపీడీవో ఆఫీసులో అప్లై చేద్దాం” అంది ఆమెతో పాటు వచ్చిన ఒకామె. ‘‘మనలాంటి కష్టాల్లో ఉన్నవారికి ప్రభుత్వం ఆసరా ఉండడం చాలా అదృష్టం. ఉన్న అవకాశాన్ని వాడుకోవాలి. పదా..” అంది మరొకామె. వాళ్ల మాటలు వింటుంటే చిరాకేసింది రాజేశ్వరికి. “భర్త చనిపోతే వచ్చే విడో ఫించన్ల గురించి మాత్రమే ఆలోచించే మీ అల్ప జ్ఞానానికి జాలేస్తుందక్కా! అసలు మధ్య వయసులోనే విడోలు ఎందుకవుతున్నారో ఆలోచించారా?” అని అడిగింది వాళ్లను. అందరిలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది.

“మీకు తెలుసా.. ఈ ఒక్క ఊళ్లోనే ఈ ఒక్క సంవత్సరంలో 15 మంది 40 ఏళ్లు నిండకుండానే చనిపోయారు. జస్ట్.. తాగుడుతో..! వాడవాడలా విస్తరించిన బెల్టుషాపులతో తాగుడుకు బానిసలై ఈ నాలుగేళ్లలో వందమంది వరకు యువత బలైపోయింది. మన జిల్లాలో అత్యధికంగా వితంతువులైన గ్రామం మనదే! దాని గురించి ఆలోచించకుండా ప్రభుత్వం భిక్షగా వేసే రెండువేల పింఛన్ కోసం ఆరాటపడుతున్నారు చూడు... అది మన బలహీనత. మీలో నలుగురూ నడివయసులోనే భర్తలు కోల్పోయింది తాగుడుతోనే. దానికి కారణమైన మద్యం షాపులమీద, బెల్టుషాపుల మీద యుద్ధం ప్రకటించాలి” అని రాజేశ్వరి శివంగిలా ప్రశ్నించింది. వాళ్లంతా ఒకరి మొఖాలొకరు చూసుకున్నారు.  ‘‘మన ఊళ్లో ఇంత మంది చావుల వెనక కారణాలు తెలుసుకోకుండా చచ్చాక ఇచ్చే భృతి కోసం ఆలోచిస్తున్నాం. నిజంగా సిగ్గుపడాల్సిందే! ఇప్పుడేం చేద్దాం మరి? పెన్షన్లు తీసుకోవద్దంటావా?’’ అంది మహిళా సంఘం అధ్యక్షురాలు.

“కాదు. బెల్టుషాపుల మీద ఉద్యమిద్దాం! వీలైతే ఊళ్లో మద్యం షాపు ఎత్తేసేదాకా పోరాడుదాం.”
“అంటే ఉద్యమం లేవదీద్దామా?”
‘‘అవునక్కా! మహిళలు ఉద్యమిస్తే సాధ్యం కానిదేమీ లేదు. గతంలో సారాపై సమరం సాగించిన ఎంతో మంది మహిళలే మనకు స్ఫూర్తి. ప్రభుత్వం దిగిరావాలి. ఊరూరా బెల్టుషాపుల్ని తొలగించాలి. మద్యాన్ని కట్టడి చేయాలి. అందుకు మనం ఈ మహిళా ఉద్యమాన్ని ఊరూరా విస్తరించాలి. వచ్చే ఎన్నికల్లో మహిళా శక్తి ఏంటో రుచి చూపించాలి” అంటున్న రాజేశ్వరి తనలోని ఆవేశం అక్కడ ఉన్న అందరిలో నిండింది.
*   *   *
ఇక్కడ మహిళలు రేపటి ఉద్యమానికి ఊపిరిపోస్తుంటే.. అక్కడ ఊళ్లో మరో తాగుబోతు యువకుడు మరణశయ్య ఎక్కాడనే వార్త వచ్చింది. ఉన్నఫళంగా అందరూ అటు కదిలారు.గత మూడేండ్లుగా బెల్టుషాపునే ఇల్లుగా మార్చుకున్న ఆ యువకుడి చావు వీళ్ల ఉద్యమానికి మరింత ఆవేశాన్ని జత చేసింది. మహిళాశక్తి ఆ శవంతో పాటు రోడ్డు మీదికొచ్చింది.“మద్యపానం అరికట్టాలి. ఊరూరా బెల్టుషాపులు తొలగించాలి” అనే మహిళల నినాదాలతో ఆ వీధులు మార్మోగిపోతున్నాయి.