తెలుగు రాష్ట్రాలోళ్లే మస్తుగ తాగుతున్నారు

V6 Velugu Posted on Jun 15, 2019

  • లిక్కర్ వినియోగంలో ఏపీ ఫస్ట్,తెలంగాణ సెకండ్
  • బీరు, బ్రాందీ కన్నా విస్కీకే మందు బాబుల జిందాబాద్
  • హైదరాబాద్ లో మహిళలు కూడా తెగ తాగేస్తున్నరట
  • ప్రపంచంలో మందు వినియోగంలో ఫస్ట్​ ప్లేస్ లో ఇండియా
  • ‘వైజ్ గాయ్ రిపోర్ట్స్’ సర్వేలో వెల్లడి

గల్లీ గల్లీకి మందు షాపులు. పొద్దు మాపు మస్తు గిరాకీ..బీరు, బ్రాందీ, విస్కి, వోడ్కా.. మందు ఏదైతేంది.. రేటు ఎంతైతేంది..తాగినోళ్లకు తాగినంత. రెండు తెలుగు రాష్ట్రాల్లో మందు బాబుల సంఖ్య పెరిగిపోతున్నది. తాగెటోళ్లు.. తాగి ఊగెటోళ్లు మస్తుగ మోపైతున్నరు. మందు తాగుట్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జనం ‘నువ్వా.. నేనా’ అన్నట్లు పోటీ పడుతున్నరట. ప్రపంచంలో లిక్కర్ వినియోగంలో ఇండియా ఫస్ట్ ప్లేస్ ల ఉంటే.. దేశంల ఏపీ ఫస్ట్ , తెలంగాణ సెకండ్ ప్లేస్ ల ఉన్నయట. ఈ మందు నిజాలు ఓ సర్వేలో వెల్లడైనయి.

హైదరాబాద్‌, వెలుగు: దేశంలో మందు బాబులు ఏటేటా పెరిగిపోతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల్లో వాళ్ల సంఖ్య రెట్టింపవుతోంది. పోరగాళ్ల నుంచి ముసలోళ్ల దాకా చాలా మందికి మందు లేనిదే పొద్దు గడవటం లేదు. మన రాష్ట్రంలో18 ఏళ్ల పైబడినవాళ్లలో 60 శాతం మందికి తాగుడు అలవాటు ఉంది. మందు తాగెటోళ్లలో సగటున ఒక్కో వ్యక్తి ఏటా రూ.13 వేలు ఖర్చు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలతో పోలిస్తే లిక్కర్​ వినియోగంలో ఇండియా మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రాల విషయానికొస్తే రెండు తెలుగు రాష్ట్రాలే ముందు వరుసలో ఉన్నాయి. ‘ఇండియన్‌ ఆల్కాహాల్‌ కన్జంప్షన్‌ – ది చేంజింగ్‌ బిహేవియర్‌’ పేరిట  వైజ్‌గాయ్‌ రిపోర్ట్స్‌ అనే సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో, మద్యం అమ్మకాల డేటాలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2005లో దేశంలో తలసరి  సగటు మద్యం వినియోగం 2.4 లీటర్లుగా ఉండగా.. 2016 నాటికి అది రెండు రెట్లు(5.7 లీటర్లు) పెరిగింది. ఇది 2010లో 4.3 లీటర్లుగా నమోదైంది. 2022 నాటికి మన దేశంలో లిక్కర్‌ మార్కెట్‌ వార్షిక వృద్ధి రేటు 8.8 శాతంతో 1,680 కోట్ల లీటర్లకు చేరుకుంటుందని వైజ్​గాయ్​ రిపోర్ట్స్ సంస్థ​ అంచనా వేసింది. అలాగే వైన్‌ వార్షిక వృద్ధి రేటు 21.8 శాతం, వోడ్కా వృద్ధిరేటు 22.8 శాతంగా ఉండొచ్చని పేర్కొంది.

మన తర్వాతే ఎవరైనా..!

దేశంలో అత్యధికంగా మద్యం తాగే వారున్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని, దాని తర్వాత రెండో స్థానంలో తెలంగాణ ఉందని వైజ్​గాయ్​ రిపోర్ట్స్​ సంస్థ పేర్కొంది. అటు తర్వాత వరుసగా కేరళ, కర్నాటక, సిక్కిం, హర్యానా, హిమాచల్​ప్రదేశ్ నిలిచాయి. ఆల్కాహాల్ వినియోగం అధికంగా ఉన్న హైదరాబాద్‌, ఢిల్లీ, చండీగఢ్, ముంబై, పుణె, కోల్‌కత్తా, బెంగళూరు నగరాల్లో వెయ్యి మందిని సర్వే చేయగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఈ నగరాల్లో మద్యం తాగే వారిలో మహిళల సంఖ్య కూడా  పెరుగుతోందని తేలింది. అయితే వీరు ఎక్కువగా వైన్ లేదా ఖరీదైన మద్యాన్ని తాగడానికి ఇష్టపడుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. అదేవిధంగా ఓవరాల్​గా మద్యం తాగే ప్రతి వంద మందిలో ముగ్గురు తమ ఆరోగ్యం కోసం తాగుతున్నామని చెప్పినట్లు వైజ్​గాయ్​ తన నివేదికలో పేర్కొంది.

రాష్ట్ర  ఎక్సైజ్‌ ఆదాయం రూ. 20 వేల కోట్లు

తెలంగాణలో మద్యం అమ్మకాల వల్ల సర్కార్‌ ఖజానా నిండుతుండగా.. ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయి. 2018 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు ఒక్క ఎక్సైజ్‌ శాఖ నుంచే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.20 వేల కోట్ల ఆదాయం సమకూరింది. 2017తో  పోలిస్తే 2018లో  రూ. 3,404 కోట్ల మేర అదనంగా మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్‌ అధికారులు గతంలో ప్రకటించారు. రాష్ట్రంలో 18 ఏళ్ల వయస్సు పైబడినవారు 2.61 కోట్ల మంది ఉండగా వారిలో 60 శాతం మందికి మద్యం తాగే అలవాటు ఉన్నట్లు అంచనా. రాష్ట్రంలో జరిగిన మద్యం విక్రయాలను బట్టి చూస్తే ఒక్కో వ్యక్తి ఏటా సగటున రూ.13 వేలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు సరదా కోసం తాగుతుంటే.. మరికొందరు మద్యానికి బానిసలై ఎక్కువగా తాగేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఖజానాకు 2015––16లో మద్యం విక్రయాల ద్వారా ఎక్సైజ్ శాఖ నుంచి రూ.12,474 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం(2018–-19)లో రూ.17,340 కోట్ల రాబడి వచ్చింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికంగా పన్ను చెల్లిస్తున్నది మందు బాబులే.

మరణాలూ ఎక్కువే..

వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌(డబ్ల్యూహెచ్ఓ) గతంలో విడుదల చేసిన ఆల్కాహాల్ అండ్ హెల్త్ ఆన్ గ్లోబల్ స్టేట్ రిపోర్టు ప్రకారం మన దేశంలో 2016లో తాగుడు అలవాటుతో అనారోగ్యం, ప్రమాదాలకు గురై 30 లక్షల మంది చనిపోయినట్లు తేలింది. వీరిలో 23 లక్షల మందికిపైగా పురుషులు ఉన్నారు. తాగి వాహనాలు నడుపడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి, తాగినప్పుడు ఇతరులతో లొల్లులకు దిగడంతో హింస చెలరేగి 28 శాతం మంది మరణించినట్లు వెల్లడైంది. తాగుడు వల్ల లివర్‌ సంబంధ వ్యాధులు సోకి 21 శాతం మంది, గుండె సంబంధవ్యాధులు సోకి  19 శాతం మంది చనిపోయినట్లు డబ్ల్యూహెచ్​వో పేర్కొంది.

ఐదు రాష్ట్రాల్లో మద్య నిషేధం

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో మద్య నిషేధం అమలులో ఉంది. మిజోరం, కేరళ, గుజరాత్‌, బిహార్‌, నాగాలాండ్‌లో ఆయా ప్రభుత్వాలు మద్యం విక్రయాలపై నిషేధం విధించాయి. మిజోరాం అసెంబ్లీలో ఇటీవల ప్రవేశపెట్టిన మద్యపాన నిషేధం బిల్లు–2019 ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఇళ్లలో మద్యాన్ని తయారు చేస్తే మరణశిక్షను విధించే అంతటి కఠినమైన చట్టాన్ని గుజరాత్‌ ప్రభుత్వం 2009లో రూపొందించగా, 2015 నుంచి బిహార్‌లో మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నారు. అలాగే మద్య నిషేధం అమలవుతున్న ఏకైక కేంద్ర పాలిత ప్రాంతంగా లక్షద్వీప్‌ నిలిచింది. దశలవారీగా మద్యం నిషేధం అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన నేపథ్యంలో.. ఇక్కడ తొలుత బెల్ట్‌షాపులను ఎత్తివేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో మద్యం వినియోగంలో ఏపీ స్థానం భవిష్యత్‌లో దిగువకు వెళ్లే అవకాశముంది.

Tagged AP, India, Telugu states, first place, Telangna, alcohol consumption

Latest Videos

Subscribe Now

More News