థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో కరీంగనర్ జిల్లాలో అలర్ట్

థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో కరీంగనర్ జిల్లాలో అలర్ట్

కరీంనగర్: కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని.. థర్డ్ వేవ్ ఉప్పెనలా విరుచుకుపడుతుందంటూ.. వైద్య నిపుణులు చేస్తున్న హెచ్చరికల నేపధ్యంలో కరీంనగర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయింది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సత్యనారాయణ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి యంత్రాంగంతోపాటు.. ప్రజలకు సూచనలు చేశారు. ప్రస్తుతం కరోనా అదుపులో ఉన్నప్పటికీ తీవ్రత పెరగకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వివరించారు. 
ఇప్పటి వరకు జిల్లాలో 8.35 లక్షల ర్యాపిడ్ టెస్టులు చేయగా.. 60 వేల 108 మందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని, జిల్లాలో ప్రస్తుతం 2400 యాక్టివ్ కేసులున్నాయని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. వారం రోజులుగా టెస్టుల సంఖ్య పెంచామని,  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు, గ్రామాల్లో కూడా టెస్టులు జరుగుతున్నాయన్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నందున కొంత ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయని, మన జిల్లాలో గత నెల రోజులుగా 1.7 శాతం పాజిటివిటీ రేటు నమోదవుతోందన్నారు. 
ఒకరికి పాజిటివ్ వస్తే.. 20మంది ప్రైమరీ కాంటాక్టు కింద టెస్టులు చేస్తున్నాం
కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యాక కాంటాక్టులను కూడా ట్రేస్ చేస్తున్నామని, ఒకరికి పాజిటివ్ వస్తే 20 మందిని ప్రైమరీ కాంటాక్టుగా గుర్తించి అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ కర్ణన్ తెలిపారు. సెకండ్ వేవ్ సమయంలో చాలా మంది ఇబ్బంది పడ్డారని గుర్తు చేస్తూ.. మరోసారి కరోనా పెరగకుండా ప్రజలంతా మాస్కలు ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు. జిల్లాలో 40 శాతం మందికి ఇప్పటికే వాక్సినేషన్ పూర్తైందని, వాక్సినేషన్ కొరత తీరగానే మొదటి డోస్ ప్రారంభిస్తామన్నారు. మాస్కులు ధరించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 
కారులో వెళ్లే వారు గ్లాస్ దించకుండా వెళ్లేవారు: సీపీ సత్యనారాయణ 
అగ్రికల్చర్ స్టూడెంట్ కావడం వల్ల వైరస్ పవర్ ఏంటో నాకు తెలుసని.. వూహాన్ తర్వాత కరీంనగర్ కు ఇండోనేషియా వాళ్లు వచ్చినప్పుడు ప్రజలంతా ఎంతో భయపడ్డారని సీపీ సత్యనారాయణ గుర్తుచేశారు. ఆ సమయంలో కరీంనగర్ మీదుగా వెళ్తున్నవారు కారులో గ్లాస్ కూడా కిందకు దింపేవారు కాదని, అంత భయం ఉండేదన్నారు. అయితే రెండో వేవ్ సమయంలో నిర్లక్ష్యం వల్ల ఒక్క నాలుగైదు రోజుల వ్యవధిలోనే కరీంనగర్ లోనే 542 మంది చనిపోయారని, కనీసం చనిపోయిన వ్యక్తి దగ్గరకు కూడా వెళ్లలేని భయానక వాతావరణం చూశామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 
ఆస్పత్రుల్లో పడకలు.. ఆక్సిజన్, వ్యాక్సిన్ దొరక్క ఇబ్బందులు
కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న సమయంలో ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ , వెంటిలేటర్, వ్యాక్సిన్ వంటివి దొరకక చాలా మంది ఇబ్బందులు పడ్డారని సీపీ సత్యనారాయణ గుర్తు చేశారు. అలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ప్రమాదం లేకున్నా.. చాలా దేశాల్లో థర్డ్ వేవ్ భయపెడుతోందని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించే విషయంలో, సోషల్ డిస్టెన్స్ విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని సీపీ సత్యనారాయణ హెచ్చరించారు.