- బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
యాదగిరిగుట్ట, వెలుగు: తన సొంత జిల్లా అయిన మహబూబ్‌నగర్ అభివృద్ధిని పట్టించుకోని సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తారని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. యాదగిరిగుట్టలో బీజేపీ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ 2026’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు పలు డిక్లరేషన్ల పేరుతో అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను మోసం చేసిందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలతో ప్రజలను బురిడీ కొట్టించిన కాంగ్రెస్ సర్కార్‌ను ప్రజా క్షేత్రంలో నిలదీస్తామని, ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీజేపీ అలుపెరుగని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నా వారు ప్రజా సమస్యలను గాలికొదిలేసి స్వప్రయోజనాల కోసం, ఆస్తులు కూడగట్టుకోవడానికే పాటుపడుతున్నారని ఆరోపించారు.
