దివ్యాంగుడైన ఫ్రెండ్ని కాలేజీకి మోసుకెళ్తున్నారు

దివ్యాంగుడైన ఫ్రెండ్ని కాలేజీకి మోసుకెళ్తున్నారు

కొల్లాం/కేరళ: ‘ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నవారే నిజమైన స్నేహితులు’ అని తెలుగులో ఓ నానుడి ఉంది. దీన్ని అక్షరాల నిజం చేసి చూపిస్తున్నారు కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాలోని డీబీ కాలేజీ విద్యార్థులు. పుట్టుకతోనే కాళ్లు కోల్పోయిన తమ ఫ్రెండ్ కి కాలేజీలో అన్ని విధాలుగా సాయం చేస్తూ... ఫ్రెండ్ షిప్ కు అసలైన నిర్వచనం ఇస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే...

కొల్లాం జిల్లా శాస్తమ్కోట్ట్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అలీఫ్ పుట్టుకతోనే రెండు కాళ్లు కోల్పోయాడు. దీంతో అతడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కష్టపడి చదివి ఎలాగైనా మంచి ఉద్యోగం సంపాదించాలనేది అతడి డ్రీమ్. ఈ క్రమంలోనే అతి కష్టం మీద డిగ్రీ వరకు వచ్చాడు. శాస్తమ్ కోట్ట్ లోని డీబీ కాలేజీలో బీకాం కోర్సులో జాయిన్ అయ్యాడు అలీఫ్. ఇక్కడే అతడికి మంచి ఫ్రెండ్స్ లభించారు. అలీఫ్ వీల్ చైర్ సహాయంతో కాలేజీకి వస్తుంటాడు. కానీ కాలేజీ ప్రాంగణంలో అటూ ఇటూ తిరగడానికి వీల్ చైర్ ద్వారా కష్టంగా మారింది. దీంతో అతడి స్నేహితులే అతడిని మోసుకుంటూ క్లాస్ రూమ్, లైబ్రరీ, క్యాంటీన్ తదితర ప్రదేశాలకు తీసుకెళ్తున్నారు. 

ఇదిలా ఉండగా... మార్చి 24న డీబీ కాలేజీలో యూత్ ఫెస్టివల్ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అలీఫ్ ను ఫ్రెండ్స్ ఆర్య, అర్చన మోసుకెళ్తున్న దృశ్యాన్ని.. ఆ కాలేజీ పూర్వ విద్యార్థి, ఫోటోగ్రాఫర్ జగత్ తులసీధరన్ తన కెమెరాలో బంధించాడు. అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. అలీఫ్ కు అతడి ఫ్రెండ్స్ చేస్తున్న సహాయానికి నెట్టింట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఇకపోతే ఆ వీడియో గురించి అలీఫ్ స్పందించాడు. ‘ వీడియో వైరల్ అవుతుందని నేను ఊహించలేదు. ఉదయం నుంచి చాలా మంది కాల్స్ చేస్తున్నారు. 800 పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయి. ఇక రెండు కాళ్లు లేవనే బాధ ఇప్పుడు పూర్తిగా పోయింది. ఎందుకంటే నాకు సహాయం చేయడానికి నా ఫ్రెండ్స్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు’ అని అలీఫ్ చాలా గర్వంగా చెప్పాడు.

మరిన్ని వార్తల కోసం:

అమ్మో నిమ్మా! భారీగా పెరిగిన ధరలు

కోహ్లీ, కుంబ్లే గొడవపై నోరు విప్పిన వినోద్ రాయ్