ఎలక్షన్స్​కు అంతా రెడీ..1,609 పోలింగ్ కేంద్రాలు : కలెక్టర్​ శరత్

ఎలక్షన్స్​కు అంతా రెడీ..1,609 పోలింగ్ కేంద్రాలు : కలెక్టర్​ శరత్
  • 1,039 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్
  • జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ శరత్

సంగారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలోని ఐదు నియోజకవర్గ పరిధిలో 13 లక్షల 93 వేల 711 మంది ఓటర్లున్నారని, వీరందరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి 1609 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​శరత్ వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్​లో ఎస్పీ రూపేశ్, డీఆర్​ఓ నగేశ్​తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. ప్రచారం ముగిసిన వెంటనే జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతుందన్నారు. ప్రజలు గుంపులు గుంపులుగా తిరగొద్దని సూచించారు. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాకు కేంద్ర, రాష్ట్ర బలగాలు వచ్చాయని వీటితో పాటు టాస్క్ ఫోర్ బృందాలు పనిచేస్తున్నాయన్నారు. పొలిటికల్ అభ్యర్థులు, లీడర్లు తాయిలాలతో ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకంటామని హెచ్చరించారు.  జిల్లాలో వెబ్ కాస్టింగ్ 1039 కేంద్రాల్లో, సీసీటీవీ కవరేజ్ 689 కేంద్రాల్లో , వీడియో కవరేజ్ 352 కేంద్రాల్లో ఏర్పాటు చేశామన్నారు.ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నట్టు వెల్లడించారు.

ఎలక్షన్​ కమిషన్​నిబంధనల మేరకు పొలిటికల్​ పార్టీలు నడుచు కోవాలన్నారు. ఎపిక్ కార్డు లేని పక్షంలో ఓటర్లు 12 రకాల ఇతర గుర్తింపు కార్డులను తీసుకువచ్చి ఓటు వేయవచ్చన్నారు. ఎస్పీ రూపేశ్ మాట్లాడుతూ ప్రజలు ప్రలోభాలకు గురికాకుండా పూర్తి స్థాయిలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

30న వేతన సెలవు

ఈ నెల30 న  రాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించిందని కలెక్టర్​శరత్ తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు, పరిశ్రమలకు సెలవు దినంగా ప్రకటించారని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈ నెల 29న కూడా సెలవు దినంగా ప్రకటిస్తూ స్థానికంగా ఉత్తర్వులు జారీ చేశామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్​, కాలేజ్ లకు ​నవంబర్ 29 , 30 సెలవు దినమని పేర్కొన్నారు.

పోలింగ్ కు అంతా సిద్దం

ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. మంగళవారం కలెక్టర్​ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 9 లక్షల 48 వేల 664 మంది ఓటర్లు ఉన్నారని, వీరందరూ ఓటు వేసేందుకు1,151 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలక్షన్ కమిషన్​ రూల్స్​ ప్రకారంపోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందన్నారు.

ఎన్నికల నిర్వహణ కోసం 1,151 మంది ప్రిసైడింగ్, 1,151 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారని, అదనంగా 817 మంది  రిజర్వు సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1,400 మంది పోలీస్ సిబ్బంది, 10 కంపెనీలకు చెందిన 1,000 మంది  పారా మిలటరీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. 1 డిసెంబర్ ఉదయం 5 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఎవరైనా మందు, మనీ పంపిణీ చేస్తే C-Vigil యాప్ ద్వారా కానీ 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫో న్​చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. 30వ తేదీ పోలింగ్ పూర్తయ్యే వరకు జిల్లాలో మద్యం దుకాణాలు మూసి ఉంటాయన్నారు.  ఇప్పటివరకు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రూ. 2 కోట్ల 50 లక్షల నగదు, 3.7 కోట్ల విలువైన లిక్కర్, 13 కిలోల వెండి, 300 కేజీల గంజాయిని సీజ్ చేశామని తెలిపారు.