ఇంటర్ ఎగ్జామ్స్​కు ఏర్పాట్లు పూర్తి

ఇంటర్ ఎగ్జామ్స్​కు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్/ఎల్​బీనగర్/వికారాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్​కు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహణపై సోమవారం విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కోసం జిల్లాలో 233 సెంటర్లు ఏర్పాటు చేశామని, మొత్తం లక్షా71వేల923 మంది స్టూడెంట్లు ఎగ్జామ్స్ రాయనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల లోపే ఎగ్జామ్ సెంటర్​కు చేరుకోవాలని సూచించారు. హాల్​టికెట్లు డౌన్​లోడ్ చేసుకోని వారు www.tsbie.cgg.gov.in వెబ్​సైట్ ద్వారా డౌన్​లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

ఎగ్జామ్స్​కు సంబంధించి అనుమానాలుంటే 040–24601020, 040–24655021 కంట్రోల్ రూమ్ నంబర్లకు కాల్​ చేసి డౌట్లు క్లియర్​చేసుకోవచ్చన్నారు. ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలు అందుబాటులో ఉండనున్నట్లు కలెక్టర్ తెలిపారు.  కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఒడ్డెన్న, డీఈవో రోహిణి తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలో 182 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హరీశ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 71 వేల 773 మంది ఫస్టియర్ స్టూడెంట్లు, 55 వేల 883 మంది సెకండియర్ స్టూడెంట్లు ఎగ్జామ్స్​కు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ ఉంటుందన్నారు. వికారాబాద్ జిల్లాలో 30 ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. 9,231 మంది ఫస్టియర్ స్టూడెంట్లు, 8,657 మంది సెకండియర్ స్టూడెంట్లు ఎగ్జామ్ రాయనున్నట్లు చెప్పారు.