రాష్ట్రంలో 20 శాతం బడ్జెట్ స్కూళ్లు రోడ్డున పడ్డయ్..

రాష్ట్రంలో 20 శాతం  బడ్జెట్ స్కూళ్లు రోడ్డున పడ్డయ్..
  • ఏడాదిన్నరగా ఫీజులు లేవు.. 
  • ప్రభుత్వం నుంచి సాయం లేదు
  • భారమవుతున్న బిల్డింగ్​ రెంట్లు, కరెంటు బిల్లులు, ప్రాపర్టీ ట్యాక్స్​లు
  • బిల్డింగులను ఖాళీ చేసి చిన్న ఇండ్లకు స్కూళ్ల షిఫ్టింగ్​
  • రాష్ట్రంలో ఇప్పటికే 20% బడులు మూత 
  • తీవ్ర ఇబ్బందుల్లో మేనేజ్​మెంట్లు 

హైదరాబాద్​ ఓల్డ్​ అల్వాల్​లోని ఓ బిల్డింగ్​లో కొన్నేండ్లు ప్రైవేట్ స్కూల్  నడిచింది. ఆ ప్రాంతంలోని వారికి ఆ స్కూల్​ ఒక ల్యాండ్  మార్క్. చుట్టుపక్కల పిల్లలందరూ దాంట్లోనే చదివేవారు. పేరెంట్స్ కూడా ఇంటికి దగ్గర్లో ఉన్న స్కూల్ అని తమ పిల్లలను జాయిన్ చేసేవారు. ఇప్పుడు ఆ బిల్డింగ్​లో స్కూల్​ లేదు. ‘టులెట్’ బోర్డు వెలిసింది. ఎక్కడో  గల్లీలో ఓ నాలుగు రూమ్​ల ఇంట్లోకి స్కూల్​ షిఫ్ట్​ అయింది.  బెంచీలు, ఇతర సామాన్లు ఒక రూమ్ లో స్టోర్​ చేసి.. స్టాఫ్​ కోసం ఒక రూమ్ సెట్​ చేశారు. స్కూల్​కు ఉండాల్సిన రూపురేఖలే లేకుండా పోయాయి. .. కరోనా కారణంగా ఏడాదిన్నరగా రాష్ట్రంలో చితికిపోతున్న చిన్న స్కూళ్ల పరిస్థితి ఇది. అటు ఫీజులు రాక.. ఇటు బిల్డింగ్​లకు రెంట్లు కట్టలేక.. చాలా బడ్జెట్​ స్కూళ్లు మూతపడ్డాయి. కొందరు అతికష్టమ్మీద స్కూళ్లను నెట్టుకొస్తున్నా.. మెయింటెనెన్స్​ భారం భరించలేక చిన్న చిన్న గదులున్న ఇండ్లల్లోకి వాటిని తరలిస్తున్నారు. 

హైదరాబాద్, వెలుగు: ఒకప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్ లలో నాలుగైదు ఫ్లోర్లలో స్టూడెంట్లతో, స్టాఫ్​తో కళకళలాడిన బడ్జెట్ ప్రైవేట్​ స్కూళ్లన్నీ ఇప్పుడు రోడ్డునపడ్డాయి. నిరుడు మార్చిలో కరోనా మొదలైనప్పటి నుంచి  ఈ స్కూళ్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడా ఇక్కడా అప్పులు చేసి స్కూళ్లు పెట్టినవాళ్లు.. ఆ అప్పులు తీర్చే దారి లేక ఆగమవుతున్నారు. ఎప్పుడు కరోనా పోతుందో.. ఎప్పుడు స్కూళ్లు పిల్లలతో కళకళలాడుతాయో తెలియక దిక్కులు చూస్తున్నారు. స్కూల్​ బిల్డింగ్​ రెంట్లు, కరెంటు బిల్లులు, వాటర్​ బిల్లులు, ప్రాపర్టీ ట్యాక్స్​లు కట్టలేక తిప్పలు పడుతున్నారు. మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురై కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. నిర్వహణ భారం భరించలేక దాదాపు 20 శాతం స్కూళ్లు శాశ్వతంగా మూతపడ్డాయి. 50 శాతం స్కూళ్లు బిల్డింగ్స్​ను ఖాళీ చేసి రెండు మూడు రూము​లున్న ఇండ్లల్లోకి షిఫ్టయ్యాయి. 

రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిదివేల బడ్జెట్ ప్రైవేట్​స్కూళ్లు ఉన్నాయి. కరోనా ఎఫెక్ట్​తో క్లాసులు ఆన్​లైన్ కు షిఫ్ట్ అయినప్పటి నుంచి ఈ స్కూళ్లను కష్టాలు వెంటాడుతున్నాయి. 2019--–20 అకడమిక్ ఇయర్ ఫీజులే ఇప్పటికీ వసూలు కాక అష్టకష్టాలు పడుతున్నాయి.  ఒక్కో స్కూల్​కు రావాల్సిన ఫీజులు లక్షల్లో ఉన్నాయి. కట్టాల్సిన అప్పులు అంతకు మించి ఉన్నాయి. మొత్తం స్కూళ్లలో 85 శాతం అంటే దాదాపు 7,600కి పైగా స్కూళ్లు అద్దె బిల్డింగ్స్​లోనే నడుస్తున్నాయి. వాటిలో ప్రస్తుతం 50 శాతం అంటే 3,800కి పైగా స్కూళ్ల యాజమాన్యాలు బిల్డింగ్ ఖాళీ చేసి చిన్న చిన్న గదులున్న ఇండ్లకు షిఫ్ట్ అయ్యాయి. రూరల్​ ఏరియాల్లో  బిల్డింగ్ ల అద్దెలు నెలకు  రూ. 25 వేల నుంచి 30వేల వరకు ఉంటున్నాయి. సిటీలో ఏరియాని బట్టి రూ. 30 వేల నుంచి లక్ష రూపాయలు దాకా ఉంటోంది. ఆన్​లైన్​ క్లాసులు నడుస్తున్నా బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లలో 70 శాతం మంది స్టూడెంట్స్​ ఆ  క్లాసులకు అటెండ్ అవడం లేదు. ఒక్కో స్కూల్​కు నెలకు దాదాపు రూ. 2 లక్షల వరకు మెయింటెనెన్స్ భారం పడుతోంది. అద్దె, కరెంట్ బిల్లు, వాటర్, ప్రాపర్టీ టాక్స్  వంటి ఖర్చులు అదనం. వీటిని కట్టేందుకు డబ్బులు లేక స్కూళ్ల నిర్వాహకులు అప్పులు చేయాల్సి వస్తోంది. కిరాయిలు కట్టనందుకు బిల్డింగ్ ఓనర్లు మేనేజ్మెంట్లకు నోటీసులు పంపిస్తున్నారు. దీంతో బిల్డింగ్ లను మేనేజ్మెంట్లు ఖాళీ చేస్తున్నాయి. నాలుగైదు వేల నుంచి పదివేల రెంటు ఉండే చిన్న రూమ్​లకు స్కూళ్లను మారుస్తున్నాయి. 

రెంటు, కరెంటు బిల్లులు వేలకు వేలు

జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగువేల బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లు ఉండగా.. ఇందులో చాలా స్కూళ్లు అద్దె బిల్డింగ్స్​లోనే  నడుస్తున్నాయి. ఉదాహరణకు 500 మంది స్టూడెంట్లతో నడిచే చిన్న బడ్జెట్ స్కూల్​ను తీసుకుంటే ఆ స్కూల్ బిల్డింగ్ రెంటు రూ. 80 వేలు ఉంటుంది. కరెంట్ బిల్లు రూ. 10 వేలు, వాటర్  బిల్లు రూ. 2 వేలు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు జీతాలు రూ. లక్ష వరకు ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఇలాంటి ఒక్క చిన్న స్కూల్​కే నెలకు రూ. రెండు లక్షలపైనే ఖర్చు వస్తుంది. ఏడాదిన్నర నుంచి ఈ అద్దె బిల్డింగ్ లలో స్కూళ్లు నడిపిస్తున్న మేనేజ్మెంట్లు మెయింటెనెన్స్ భారం భరించలేకపోతున్నామని అంటున్నాయి. ఒకప్పుడు స్కూల్ ఉన్న బిల్డింగ్  గేట్లకు ఇప్పుడు టులెట్ బోర్డులు వేలాడుతున్నాయి. 

సామాన్లకు ఒక గది.. స్టాఫ్ కు మరో గది..

నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రతి క్లాస్​కు ఒక గది, స్టాఫ్ కి సపరేట్ గది, ప్రిన్సిపాల్ కి ఇంకో గది.. ఇలా ఒక స్కూల్ ఎంతో స్పేస్​ ఉంటుంది. కానీ ఇప్పుడు బెంచీలు, ఇతర సామాను ఒక రూమ్​లో కుక్కి దాన్ని స్టోర్​ రూమ్​గా మార్చి, స్టాఫ్ అందరికీ కలిపి ఒక రూమ్ ఉంచి ఆన్​లైన్​ క్లాసులు నడిపించాల్సి వస్తోంది. 12, 13 గదుల స్కూల్ కాస్తా 2, 3 గదులకు మారిపోయింది. తరగతి గది ఆన్​లైన్​కు మారడంతో ఏడాదిన్నర నుంచి  బడ్జెట్ స్కూళ్లకు బిల్డింగ్​ రెంట్లు, ప్రాపర్టీ టాక్స్, కరెంట్ బిల్లు, నిర్వహణ భారం లక్షల్లోకి వెళ్లిపోయింది. మెయింటెనెన్స్ భారంతో చాలా మేనేజ్మెంట్లు టీచర్లను తొలగించాయి. మిగిలిన టీచర్లకు కూడా జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాయి. చాలా మేనేజ్మెంట్లు ఖర్చు తట్టుకోలేక స్కూల్​నే  తీసేశాయి. ఏడాదిన్నరగా బడ్జెట్​ స్కూళ్లు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా సాయం లేదు. తమ పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, ఏ ఒక్కరూ స్పందించడం లేదని స్కూళ్ల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్, కరెంట్​ బిల్లులు, వాటర్​ ట్యాక్స్​ అయినా మాఫీ చేస్తే కొంత ఇబ్బందుల నుంచి గట్టెక్కుతామని కోరుతున్నారు. ​ 

అగమ్యగోచరంగా ఉంది

కార్పొరేట్ స్కూళ్లను దృష్టిలో పెట్టుకొనే గవర్నమెంట్ గైడ్ లైన్స్  ఇస్తుంది. ఎగ్జామ్స్ లేకుండానే నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ చేస్తుండటంతో పేరెంట్స్ ఫీజులు కట్టడంలేదు. గతేడాది ఐదుశాతం మంది మాత్రమే ఫీజులు కట్టారు. తల్లిదండ్రులు పిల్లలను ఆన్​లైన్​  క్లాసులకు కూడా పంపడంలేదు. ఒక్కో స్కూల్ కు ఏడాదికి సుమారు రూ. 24 లక్షల వరకు ఖర్చు వస్తుంది. స్కూలే నడవకపోతే ఆ భారాన్ని, ఖర్చులను నిర్వాహకులు ఎలా తట్టుకుంటారు.  బడ్జెట్ స్కూళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ప్రభుత్వం ఆన్​లైన్​ అటెండెన్స్ సిస్టం పెట్టాలి. ఎగ్జామ్స్ బేస్డ్ ప్రమోషన్ చేయాలి. చాలామంది పేరెంట్స్ తమ పిల్లలను ప్రైవేట్​  స్కూళ్ల నుంచి తీసేసి గవర్నమెంట్ స్కూళ్లలో జాయిన్ చేస్తున్నారు. దీంతో బడ్జెట్ స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ కూడా అధికమవుతున్నాయి. ఇలాగే ఉంటే బడ్జెట్ ప్రైవేట్​ స్కూళ్లు  కనుమరుగైపోతాయి.
– ఉమామహేశ్వర్ , ట్రెస్మా  ప్రెసిడెంట్

సర్కారు స్పందించాలి

లాస్ట్​ ఇయర్​ కరోనా, లాక్​డౌన్​ నుంచి బడ్జెట్​ప్రైవేట్​ స్కూళ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇటు ఫీజులు రాక, అటు మెయింటెనెన్స్​కు చేతిలో చిల్లిగవ్వ లేక మేనేజ్​మెంట్లు అప్పులపాలయ్యాయి. బిల్డింగ్స్​కు రెంట్లు కట్టలేక చాలా మంది స్కూళ్లను మూసేస్తున్నారు. కొందరు చిన్న చిన్న ఇండ్లల్లోకి స్కూళ్లను షిఫ్ట్​ చేస్తున్నారు. సొంత బిల్డింగ్స్​ ఉన్నవాళ్లు వేలకు వేలు ప్రాపర్టీ ట్యాక్స్​, కరెంటు బిల్లులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే అప్పులు, పరిస్థితులను తలచుకొని తీవ్ర డిప్రెషన్​లోకి వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. మా స్కూల్​కు ఏడాదికి రూ. 80 వేల దాకా ప్రాపర్టీ ట్యాక్స్​ వస్తోంది. టైమ్​కు ట్యాక్స్​ కట్టాల్సిందేనంటున్నారు. ఏడాదిన్నర నుంచి మేం తిప్పలు పడుతున్నా ప్రభుత్వం చిన్న సాయం కూడా చేయడం లేదు. ఒక్కోసారి అనిపిస్తుంది ఎందుకు ఈ వృత్తిలోకి వచ్చామా అని. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.  

– టి.రాఘవేందర్​రావు, ప్రిన్సిపల్​, లోటస్​ మోడల్​ హైస్కూల్​, రాంనగర్​, హైదరాబాద్​ 

కిరాయిలు కూడా ఎల్తలే

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెయ్యి బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ ఉంటే.. వాటిలో 850 స్కూల్స్​ అద్దె బిల్డింగ్స్​లోనే నడుస్తున్నాయి. ఏడాదిన్నర నుంచి అద్దెలు కట్టేందుకు మేనేజ్​మెంట్లు అష్టకష్టాలు పడుతున్నాయి. బిల్డింగ్​ ఓనర్లు స్కూళ్లకు నోటీసులు పంపి, ఖాళీ చేయిస్తున్నారు. దీంతో స్కూళ్లను ఎలా నడిపించాలో తెలియక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే దాదాపు 15 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 
‑ యాదగిరి శేఖర్ రావు,  కరీంనగర్

భారం భరించలేక ఖాళీ చేశాను

మాకు హైదరాబాద్​లోని ఓల్డ్ అల్వాల్ లో నర్సరీ నుంచి సెవెన్త్ వరకు ఒక చిన్న ప్రైవేట్ స్కూల్ ఉండేది. అలాగే ప్లే స్కూల్ కూడా ఉండేది. ఒక బిల్డింగ్ రెంటు రూ. 20 వేలు, కరెంట్ బిల్లు రూ. 2 వేలు ఉండేది. అవి కాకుండా వాటర్, మెయింటెనెన్స్, ప్రాపర్టీ టాక్స్ అదనంగా ఉండేవి. ఇంకో బిల్డింగ్ రెంటు రూ. 10 వేలు, కరెంట్, వాటర్, ఇతర ఖర్చులూ ఉండేవి. రెండు స్కూళ్లకు కలిపి నెలకు రూ. 50 వేలకు పైనే ఖర్చు వచ్చేది. మాకు 2020 మార్చి వరకు 1,90,000 ఫీజులు రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు రాలేదు. నేను బిల్డింగ్ కట్టే అద్దె లక్షల్లోకి చేరింది. ఆఫ్ లైన్ స్కూల్ లేకపోవడంతో పేరెంట్స్ ఫీజులు కట్టడం మానేశారు. స్కూల్ నడపడం భారంగా మారింది. బిల్డింగ్ ఓనర్లకు బాకీ పడ్డాను. ఇలా అయితే కుదరదని జులై ఒకటిన ఓల్డ్ అల్వాల్ లో బిల్డింగ్ ఖాళీ చేసి సామానంతా లోతుకుంటకు షిఫ్ట్ చేశాను. ఇక్కడ అద్దె నాలుగు రూమ్ లున్న ఇంట్లో స్కూల్ సామానంతా పెట్టాను. దీని అద్దె రూ. పదివేలు. ఫిజికల్ గా స్కూల్స్ స్టార్ట్ అయ్యేవరకు మా పరిస్థితి మారదు. – టి. మధుసూదన్ , ప్రిన్సిపల్, లోతుకుంట