కేసీఆర్ ప్రధాని అయితే.. అన్నీ ఫ్రీ

కేసీఆర్ ప్రధాని అయితే.. అన్నీ ఫ్రీ
  • ట్యాక్సులు కట్టే పనే ఉండదు: మల్లారెడ్డి
  • కేంద్రంలో రాబోయేది కేసీఆర్ సారథ్యంలోని కొత్త పార్టీ ప్రభుత్వమే

హనుమకొండ, వెలుగు: కేసీఆర్ ప్రధాని అయితే చార్జీలన్ని తగ్గించుకోవచ్చని, ఎవరికీ ట్యాక్సులు కట్టే పనే ఉండదని, అవసరమైతే అన్నీ ఫ్రీ చేసుకోవచ్చని మంత్రి మల్లారెడ్డి అన్నారు. విజయదశమి నాడు కేసీఆర్​ ఓరుగల్లు భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి బయలుదేరతాడని చెప్పారు. చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మికుల సదస్సుకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దివాళా తీసిందని, బీజేపీదీ అదే పరిస్థితి అని అన్నారు. కేంద్రంలో కేసీఆర్ సారథ్యంలోని కొత్త పార్టీ అధికారంలోకి రాబోతోందన్నారు. బీజేపీ నుంచి దేశానికి విముక్తి కల్పించాలని, కేసీఆర్ ను దేశానికి ప్రధానిని చేయాలని అమ్మవారిని మొక్కుకున్నానని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు అమలు చేస్తే తన మంత్రి పదవి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని అన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ కొత్త బిచ్చగాడని, ఆయనో దొంగ అని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే వరికి రూ.2500 మద్దతు ధర ఇస్తామంటున్నాడని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదన్నారు. 

కార్మికులకు లక్ష బైకులు ​ఇస్తం: ఎర్రబెల్లి 

కాంగ్రెస్​, బీజేపీ పార్టీలు కార్మికులను ఇబ్బందులకు గురి చేయడమే పనిగా పెట్టుకున్నాయని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలబడుతోందని, భవన నిర్మాణ, ఇతర రంగాల్లో ఉన్న కార్మికులకు త్వరలోనే లక్ష మోటార్​ సైకిళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, గెల్లు శ్రీనివాస్, కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.