
హైదరాబాద్: వస్తువుల కొనుగోళ్లు, అమ్మకాలు (డిమాండ్) మళ్లీ పుంజుకోనున్నాయని, ఫలితంగా మార్కెట్లు పెరుగుతాయని పీఎల్ క్యాపిటల్ తన రిపోర్ట్‌లో చెప్పింది. దీని ప్రకారం.. ఆశించిన స్థాయిలో వర్షాలు, తక్కువ ద్రవ్యోల్బణం, ప్రభుత్వం పన్నులు తగ్గించడం స్టాక్ మార్కెట్లకు మేలు చేస్తుంది.
గత కొన్ని నెలలుగా వస్తువుల కొనుగోళ్లు పెద్దగా లేవు. ఈసారి వర్షాలు బాగా పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. మంచి వర్షాలు పడితే పంటలు బాగా పండుతాయి. రైతుల ఆదాయమూ పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల చేతిలో డబ్బు ఉండేలా చేసి కొనుగోళ్లను పెంచుతాయి. తక్కువ ధరల వల్ల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఆర్‌బీఐ కూడా వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది.
వడ్డీ రేట్లు తగ్గితే అప్పులు తక్కువ వడ్డీకి లభిస్తాయి. దీంతో వస్తువుల కొనుగోళ్లు పెరుగుతాయి. ముఖ్యంగా ట్రావెల్, కన్జూమర్ డ్యూరబుల్, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు, దుస్తులు, ఆటోమొబైల్స్, బిల్డింగ్ మెటీరియల్స్, నగలు వంటి వాటికి డిమాండ్ బాగా పెరుగుతుంది. సాధారణ వర్షాలు, తక్కువ ధరలు, పన్ను తగ్గింపులు అన్నీ కలిసి భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. రాబోయే రోజుల్లో మార్కెట్‌లో కొనుగోళ్లు భారీగా పెరుగుతాయని పీఎల్ క్యాపిటల్ రిపోర్ట్ స్పష్టం చేసింది.