క్యాట్‌‌లో కాదని..ఇప్పుడు అవునంటే ఎట్ల?

క్యాట్‌‌లో కాదని..ఇప్పుడు అవునంటే ఎట్ల?
  • ఏఐఎస్​ ఆఫీసర్ల కేటాయింపులపై రాష్ట్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు
  •  విచారణ ఈనెల 18కి వాయిదా

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీలకు అఖిల భారత సర్వీస్‌‌(ఏఐఎస్‌‌) కేడర్‌‌ అధికారులు (ఐఏఎస్‌‌/ఐపీఎస్‌‌) కేటాయింపులపై రాజకీయ వైరుద్ధ్యాలకు హైకోర్టును వేదిక చేయవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ లాయర్లకు హైకోర్టు హితవు చెప్పింది. 110 మంది కేంద్ర సర్వీస్‌‌ అధికారులకు చెందిన వ్యవహారాన్ని రాజకీయ అంశం కోణంలో వాడుకోవద్దని సలహా ఇచ్చింది. కేసు విచారణ ఈ నెల18కి వాయిదా వేసింది. తెలంగాణ, ఏపీ ఏర్పాటు నేపథ్యంలో కేంద్రం నియమించిన ప్రత్యూష్‌‌ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్, ఇతర కేంద్ర సర్వీస్‌‌ అధికారుల విభజన జరిగింది. ఈక్రమంలో ఏపీకి కేటాయించడాన్ని పలువురు అధికారులు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌‌ (క్యాట్‌‌)లో సవాల్‌‌ చేసి స్టే ఉత్తర్వులతో తెలంగాణలో కొనసాగుతున్నారు. 

క్యాట్‌‌ ఉత్తర్వుల్ని రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను సోమవారం న్యాయమూర్తులు జస్టిస్‌‌ అభినంద్‌‌కుమార్‌‌ షావిలీ, జస్టిస్‌‌ జె.శ్రీనివాస్‌‌రావులతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ విచారించింది. అదనపు ఏజీ జె.రామచంద్రరావు వాదిస్తూ, ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ వాదనలు కూడా వినాలని కోరారు. దీనిపై కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్‌‌ జనరల్‌‌ ప్రవీణ్‌‌కుమార్‌‌ అభ్యంతరం చెప్పడంతో  కేసు విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది.