యాదగిరిగుట్టకు బయల్దేరిన బండి సంజయ్

యాదగిరిగుట్టకు బయల్దేరిన బండి సంజయ్

బీజేపీ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు అంతా సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి మూడో విడత పాదయాత్ర చేపట్టనున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. నాగుల పంచమి సందర్భంగా ఖైరతాబాద్ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. యాదగిరిగుట్టకు బయల్దేరారు సంజయ్.  కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి.. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేయనున్నారు. ఆ తర్వాత స్థానిక వంగపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఈ సభకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.  సభ తర్వాత  జెండా ఊపి పాదయాత్రను పారంభిస్తారు. 

తొలిరోజు యాదగిరిగుట్ట నుంచి ప్రారంభించి.. గంగసానిపల్లి, ముత్తిరెడ్డి గూడెం, బస్వాపూర్ వరకు యాత్ర సాగనుంది. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో.. మొదటి రోజు 10.5 కిలోమీటర్ల మేర యాత్ర ఉంటుంది. బస్వాపూర్ సమీపంలో మొదటిరోజు రాత్రి సంజయ్ బస చేస్తారు. రేపు హుస్సేన్ బాద్ రూరల్, భువనగిరి టౌన్, టీచర్స్ కాలనీల్లో... ఆగస్ట్ 4న గొల్లగూడెం, మగ్దూంపల్లి, పెద్దపలుగు తండా, చిన్న రావుల్పల్లి, గుర్రాలదండిలో 11.7కి.మీ. మేర యాత్ర ఉంటుంది. ఆగస్ట్ 7వ తేదీ వరకు మొత్తం భువనగిరి నియోజకవర్గంలోనే పాదయాత్ర సాగనుంది. ఆ తర్వాత మునుగోడు నియోజకవర్గంలోకి పాదయాత్ర ఎంటర్ అవుతుంది. 

మొత్తం 24రోజుల పాటు 328 కిలోమీటర్లు.. మూడో విడత ప్రజా సంగ్రామయాత్ర సాగనుంది. 5జిల్లాలు, 12 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ నెల 26న హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో బహిరంగ సభతో మూడో విడత యాత్ర ముగుస్తుంది. ముగింపు సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, లేదా జాతీయ కీలక నేతను ముఖ్య అతిథిగా తీసుకువచ్చే ఏర్పాట్లలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఉంది.