ప్రభుత్వ డిపార్ట్ మెంట్లలో కొలువులన్నీ కాంట్రాక్టే…

ప్రభుత్వ డిపార్ట్ మెంట్లలో కొలువులన్నీ కాంట్రాక్టే…
  • ప్రభుత్వ డిపార్ట్​మెంట్లలో2.10 లక్షల మంది టెంపరరీనే..
  • రెగ్యులర్​ ఉద్యోగాల మాటే మర్చిపోయిన సర్కారు
  • తెలంగాణ వస్తే కాంట్రాక్టు జాబ్స్​ మాటే ఉండదన్న కేసీఆర్​
  • ఇప్పుడు లక్షలకొద్దీ ఔట్​సోర్సింగ్, కాంట్రాక్టు ఎంప్లాయీసే
  • కొత్త నియామకాల్లో చాలా వరకు టెంపరరీయే..
  • అరకొర శాలరీలు.. ఎప్పుడు ఊడుతుందో తెలియని జాబ్​

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో రెగ్యులర్​ ఉద్యోగాల భర్తీ దాదాపుగా నిలిచిపోయింది. ఉన్న ఉద్యోగాలన్నీ ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్​ సోర్సింగ్​పద్ధతిలో టెంపరరీగానే నింపుతోంది. వివిధ డిపార్ట్​మెంట్లలో లక్షకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నా రిక్రూట్​మెంట్​ఊసే లేదు. ఇచ్చిన నోటిఫికేషన్లను కూడా వాయిదా వేస్తోంది. కొత్తగా చేసే నియమకాలు అన్నింటికీ కాంట్రాక్టు పద్ధతిని లింక్​ పెడుతోంది. తాజాగా పోలీస్‌ డిపార్ట్‌ మెంట్‌లో 2,092 పోస్టులను కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో రిక్రూట్​ చేయాలని నిర్ణయించింది. ఇదే డిపార్ట్​మెంట్లో నిరుడు భర్తీ చేసిన 190 పోస్టుల కాంట్రాక్టును ఇంకో ఏడాది పొడిగించింది. ఈ లెక్కన ఇక రెగ్యులర్​ రిక్రూట్​మెంట్​జాడ లేనట్టేనని మరోసారి స్పష్టమైంది. ఉద్యమ సమయంలో కేసీఆర్​ ఇచ్చిన హామీ మేరకు… తెలంగాణలో కాంట్రాక్టు, ఔట్​ సోర్సింగ్​ వ్యవస్థే ఉండదనుకున్న నిరుద్యోగులు రాష్ట్ర సర్కారు తీరుతో ఆవేదనలో మునిగిపోయారు. సర్కారీ జాబ్​లకు ఎప్పుడు నోటిఫికేషన్​ పడుతుందా.. అని ఎదురుచూస్తున్న లక్షల మంది నిరుద్యోగులు.. ఇప్పుడు టెంపరరీ పోస్టుల కోసం పోటీపడే పరిస్థితి నెలకొంది. గత ఏడాది జరిగిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల రిక్రూట్​మెంట్  మూడేళ్ల కాంట్రాక్టు పద్ధతినే చేపట్టింది.త్వరలో మున్సిపాలిటీల్లో భర్తీ చేయనున్న కొత్త వార్డు ఆఫీసర్​ పోస్టులకూ కాంట్రాక్టు విధానం అనుసరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 2,298 పోస్టులకు మూడేళ్ల కాంట్రాక్టుపై రిక్రూట్​మెంట్​ చేపట్టాలని యోచిస్తున్నట్టు తెలిసింది.

కొన్ని డిపార్ట్​మెంట్లలో వాళ్లే

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి 2.10 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 1.45 లక్షల మంది ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌, 65 వేల మందిని కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేశారు. ఎడ్యుకేషన్‌‌‌‌, హెల్త్‌‌‌‌, రెవెన్యూ, మున్సిపల్‌‌‌‌  డిపార్ట్​మెంట్లలోనే ఈ టెంపరరీ ఎంప్లాయీస్​ ఎక్కువ. చాలా మందికి జీతాలు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకే ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులకు ఏజెన్సీ కమిషన్‌‌‌‌, ఇతర కటింగ్​ల రూపంలో మరింతగా కోతలు పెడుతున్నారు. రెగ్యులర్‌‌‌‌ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా వారికి ఎలాంటి బెనిఫిట్స్‌‌‌‌ వర్తించని పరిస్థితి ఉంది.

గురుకులాల్లో..

తెలంగాణ ఏర్పడిన తర్వాత 661 గురుకులాలు ప్రారంభించారు. వాటిలో టీచింగ్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌  రెగ్యులర్‌‌‌‌ పోస్టులు శాంక్షన్‌‌‌‌ చేసినా కొన్ని మాత్రమే రిక్రూట్‌‌‌‌ చేశారు. మిగతా ఖాళీ టీచింగ్‌‌‌‌ పోస్టుల్లో సబ్జెక్ట్‌‌‌‌  అసోసియేట్స్‌‌‌‌ను ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌ పద్ధతిలో రిక్రూట్‌‌‌‌ చేశారు. నాన్‌‌‌‌ టీచింగ్‌‌‌‌ పోస్టులైతే మొత్తంగా ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. ఇలా మూడు వేల మందికిపైనే ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌ లో రిక్రూట్‌‌‌‌ అయ్యారు. సంక్షేమ శాఖల్లో అవసరమైన పోస్టులను కూడా ఇలాగే రిక్రూట్‌‌‌‌ చేసుకున్నారు.

జూనియర్‌‌‌‌ పంచాయతీ సెక్రటరీ పోస్టుల్లో..

కొత్త, పాత గ్రామ పంచాయతీల్లో పాలనా వ్యవహరాలను చూసేందుకు 9,355 జూనియర్‌‌‌‌ పంచాయతీ సెక్రెటరీ పోస్టుల భర్తీకి రాష్ట్ర సర్కారు నోటిఫికేషన్‌‌‌‌ ఇచ్చింది. మూడేళ్ల పాటు కాంట్రాక్టు పద్ధతిలో నెలకు రూ.15 వేల జీతానికే పనిచేయాలని వాళ్లతో అగ్రిమెంట్‌‌‌‌ రాయించుకొని కొలువులు ఇచ్చింది. ఆ ఉద్యోగాలు నచ్చకపోవడం, ఒత్తిళ్లతో చాలామంది వదిలేసి వెళ్లిపోవడంతో.. ఖాళీ అయిన చోట ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌ ఏజెన్సీల ద్వారా రిక్రూట్‌‌‌‌ చేస్తున్నారు. ఇలా ఉద్యోగాల్లో చేరిన వారికి మూడేళ్ల తర్వాత రెగ్యులర్‌‌‌‌ అయ్యే అవకాశాలు లేవని ముందే చెప్తున్నారు.

కరోనా డాక్టర్లు.. హెల్త్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ కూడా..

కరోనా ట్రీట్‌‌‌‌మెంట్‌ కోసం ఏర్పాటు చేసిన టిమ్స్‌‌‌‌ సహా అన్ని గవర్నమెంట్‌‌‌‌ హాస్పిటళ్లలో డాక్టర్లు, ఇతర మెడికల్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ చేపట్టారు. దాదాపు 3,500 మందిని కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్‌‌‌‌ చేయడానికి నోటిఫికేషన్లు ఇచ్చారు. కాంట్రాక్టు విధానంలో పనిచేయడానికి డాక్టర్లు, నర్సులు ముందుకు రాలేదు. దీంతో రెండు, మూడు సార్లు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి వచ్చింది. మొత్తంగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వెయ్యి మంది వరకు డాక్టర్లను రిక్రూట్‌‌‌‌ చేశారు. మిగతా 6 వేల మంది వరకు హెల్త్‌‌‌‌  సిబ్బంది ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌ విధానంలో నియామకమైన వారే.

మరెన్నో డిపార్ట్​మెంట్లలో..

  • అగ్రికల్చర్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌ మెంట్లో 200 మంది ఏఈవోలను ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌ పద్ధతిన రిక్రూట్‌‌‌‌ చేశారు.
  • ఇరిగేషన్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో కంప్యూటర్‌‌‌‌ ఆపరేటర్లు, ఇతర సిబ్బంది 1,500 మందికిపైనే ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌ లో పనిచేస్తున్నారు. 2,500 మందికిపైగా లష్కర్‌‌‌‌లను నియమించాలని సర్కారు నిర్ణయించింది. ఈ నియామకాలు కూడా ఔట్​సోర్సింగ్​విధానంలోనే ఉండనున్నట్టు తెలిసింది.
  • మిషన్‌‌‌‌ భగీరథలో ఇంజనీర్లు, పాత ఆర్‌‌‌‌డబ్ల్యూఎస్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ మినహా అందరూ ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌ ఉద్యోగులే.
  • జిల్లా, మండల పరిషత్​ ఆఫీసుల్లో ఫోర్త్‌‌‌‌ క్లాస్‌‌‌‌ ఎంప్లాయీస్‌‌‌‌, పరిషత్​ స్కూళ్లలో స్వీపర్లు తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్నారు. వీళ్లు 15 వేల మంది వరకు ఉంటారని చెప్తున్నారు

ఇది శ్రమ దోపిడీనే

రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థే ఉండదన్న కేసీఆర్‌‌‌‌‌‌‌‌.. సీఎం అయ్యాక కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌‌‌‌, థర్డ్ పార్టీ కాంట్రాక్ట్‌‌‌‌, డైలీ వేజ్ కాంట్రాక్ట్ అంటూ కొత్త కొత్త విధానాలు తెచ్చారు. ఇవేవీ లేబర్ యాక్ట్‌‌‌‌ లో లేవు. శ్రమ దోపిడీ కోసమే ఇవన్నీ తెచ్చారు. హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ లో 20 వేల మంది దాకా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఎలిజిబిలిటీ ఉన్నవాళ్లను రెగ్యులరైజ్ చేయాలి.

– నర్సింహ, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్‌‌‌‌ ప్రెసిడెంట్

జీతాలు కూడా సరిగా ఇస్తలేరు

లాక్‌‌‌‌ డౌన్‌‌‌‌ టైంలో స్కూళ్లు, హాస్టల్స్‌‌‌‌ మూసేయడంతో ఆశ్రమ స్కూళ్లు, హాస్టళ్ల డైలీ వేజ్‌‌‌‌, ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌ కార్మికులు పూర్తిగా ఉపాధి కోల్పోయారు. లాక్‌‌‌‌ డౌన్‌‌‌‌ టైంలో కార్మికులందరికీ పూర్తి జీతం ఇవ్వాలని సర్కారు జీవో నంబర్‌‌‌‌ 45 జారీ చేసింది. కానీ ఐదు నెలలుగా జీతాలే ఇస్తలేరు.

– మధు, ఎస్టీ ఆశ్రమ స్కూళ్లు, హాస్టల్స్‌‌‌‌ డైలీ వేజ్‌‌‌‌, ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌ వర్కర్స్‌‌‌‌ యూనియన్‌‌‌‌ కార్యదర్శి

20 ఏండ్లుగా చేస్తున్నా..తీసేసిన్రు

పక్క ఫొటోలోని వీరంతా ఉస్మానియా యూనివర్సిటీలోని వివిధ హాస్టళ్లలో
20 ఏళ్లుగా పనిచేస్తున్న  ఔట్​సోర్సింగ్ ఎంప్లాయీస్​. మొత్తం 18 హాస్టళ్లలో 356 మంది వరకు ఉన్నారు. బుధవారం నుంచి మీరెవరూ పనికి రానక్కర్లేదని అధికారులు చెప్పేయడంతో రోడ్డున పడ్డారు. ఇన్నేళ్లుగా ఇదే ఉద్యోగాన్ని నమ్ముకున్న మమ్మల్ని తీసేయడం ఏంటని ఓయూలోని లేడిస్​ హాస్టల్​ఎదుట ఇలా ఆందోళనకు దిగారు. వెంటనే తమను డ్యూటీలో చేర్చుకోవాలని డిమాండ్​ చేశారు. వీరికి స్టూడెంట్స్  మద్దతు పలికారు.

లక్షకుపైగా ఉద్యోగాలు ఖాళీ

రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో లక్షా 51 వేల 116 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సర్కారు గుర్తించగా.. అందులో 58 వేల 240 పోస్టులను గత ఆరేండ్లలో భర్తీ చేశారు. అవిపోగా 92 వేల 876 ఖాళీగా ఉన్నాయి. వీటికితోడు ప్రతినెలా అన్ని డిపార్ట్​మెంట్లలో కలిపి ఆరేడు వందల మంది రిటైర్​ అవుతున్నారు. ఇవి కలిపితే ఖాళీల సంఖ్య లక్షకు పైనే ఉంటుందని అధికారవర్గాలే చెప్తున్నాయి. వీటి రిక్రూట్​మెంట్​కు ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయా అని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో కొత్త జోనల్‌ వ్యవస్థను ప్రకటించారు. కానీ కేడర్‌ విభజన, ఇతర సమస్యలతో రెండేళ్లుగా ఒక్క నోటిఫికేషన్‌ కూడా రాలే.

కాంట్రాక్టు ఉద్యోగి ఉండడుగాక ఉండడు..‑ ఉద్యమం టైమ్​లో

కేసీఆర్​ కేసీఆర్​ మాట నిలబెట్టుకోవాలె

కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ వ్యవస్థలను రద్దు చేస్తామని కేసీఆర్‌ ఎన్నోసార్లు చెప్పారు. కానీ అమలు చేయలేదు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్‌  చేస్తామన్నారు. కనీసం సమాన పనికి సమాన జీతం కూడా ఇవ్వడం లేదు. ఇది శ్రమ దోపిడీనే. ఇంకెన్నాళ్లు ఇలా చేస్తారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.

‑ జె.వెంకటేష్‌, రాష్ట్ర కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్  ప్రెసిడెంట్‌