
- ఖమ్మం మార్కెట్లో మిర్చి వ్యాపారుల దందా
- జీరో వ్యాపారం, ఆర్డీకి మంత్రి తుమ్మల చెక్
- ఎక్స్ పోర్ట్ ఆర్డర్లు లేవంటూ కొనుగోలు చేయని వ్యాపారులు
- ముందస్తు సమాచారం లేకపోవడంతో రైతుల ఇబ్బంది
- క్వింటా రూ.8500కి పడిపోయిన తేజా రకం రేటు
ఖమ్మం/ ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో వ్యాపారులు సోమవారం మిర్చి కొనుగోళ్లను నిలిపివేశారు. ఉదయం జెండా పాట నిర్వహించిన తర్వాత, రైతులు తీసుకువచ్చిన ఇతర మిర్చి బస్తాలను కొనుగోలు చేయలేదు. దీంతో రెండ్రోజుల సెలవు తర్వాత పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా కొనుగోళ్లు నిలిపి వేయడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో మార్కెట్ లో కొనుగోళ్లు నిలిపివేయడంతో మిర్చి అధ్యక్ష, కార్యదర్శులతో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ హనుమంతరావు సమావేశం నిర్వహించారు. మిర్చి కొనుగోళ్లు జరపాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వ్యాపారులు మాత్రం తమకు విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి అర్దర్లు లేవని తేల్చి చెప్పారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో మాట్లాడి తమ నిర్ణయాన్ని చెబుతామని మీటింగ్ నుంచి బయటకు వెళ్లిపోయారు. వ్యాపారుల తీరు కారణంగా మార్కెట్ కు పంట తెచ్చిన రైతులు ఇబ్బందిపడ్డారు. అసలే మిర్చికి రేటు లేక బాధపడుతుంటే, తిరిగి తమ సరుకును ఇంటికి తీసుకెళ్లడం ఖర్చుతో కూడుకున్నదని వాపోయారు.
జరిగింది ఇదీ..!
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో బిల్లుల్లేకుండా అమ్మకాలు (జీరో దందా), ఎక్కువ రేటుకు కొనుగోలు చేసిన పంటను కూడా తక్కువ రేటుగా చూపించి రికార్డుల్లోకి ఎక్కించడం (రేట్ డిఫరెన్స్, ఆర్డీ దందా) లాంటి అక్రమాలు జరిగేవి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన సొంత నియోజకవర్గంలో ఇలాంటి అక్రమాలకు అవకాశం ఇవ్వవద్దంటూ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో గత మూడు నెలల వ్యవధిలో ఐదారు సార్లు మార్కెట్ ను విజిట్ చేసిన ఉన్నతాధికారులు, మిర్చి కొనుగోళ్లలో వ్యాపారుల అవకతవకలను అరికట్టారు.
ఖమ్మం, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ పరిధిలోని అన్ని కోల్డ్ స్టోరేజీల దగ్గర ఇన్చార్జి ఆఫీసర్లను నియమించి, అక్కడ జరిగే అక్రమ వ్యాపారానికి చెక్ పెట్టారు. గత సీజన్ లో వ్యాపారులు క్వాలిటీ మిర్చిని కూడా తాలుగా చూపి ఆర్డీ ద్వారా కొనుగోలు చేసిన మిర్చి, జీరో ద్వారా చేసిన సరుకును 30 కోల్డ్ స్టోరేజ్ ల్లో దాచారు. తమకు అనుకూలంగా ఉండే రైతుల పేర్లతోనే కోల్డ్ స్టోరేజీల్లో దాచిన మిర్చిని ఇప్పుడు అమ్ముకుందామంటే, ఆఫీసర్లు పెట్టిన ఆంక్షలతో వీలు కావడం లేదు. మంత్రి తుమ్మల ఆదేశాలతో జీరో, ఆర్డీకి తావు లేకుండా చేయడంతో, వ్యాపారులు తమ సరుకును అదే ధరతో ఎగుమతి చేసుకోవడం ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది.
కొనుగోళ్లు నిలిపివేయడం ద్వారా మార్కెట్ పాలకవర్గంతో పాటు, మంత్రిపై ఒత్తిడి తేవడం కోసం వ్యాపారులు ప్లాన్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖమ్మం, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ ల పరిధిలో 30 కోల్డ్ స్టోరేజ్ లు ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కో కోల్డ్ స్టోరేజ్ లో 60 వేల నుంచి 80 వేల బస్తాలు నిల్వ ఉన్నట్టు సమాచారం. సుమారు 18 లక్షల బస్తాలు ఎలాగైతే జీరో, ఆర్డీ ద్వారా గతంలో కొనుగోలు చేశారో, అదే రీతిలో తమ సరుకును కోల్డ్ స్టోరేజ్ ల నుంచి బయటకు తెచ్చుకునేందుకు ఎత్తుగడలో భాగమే మిర్చి కొనుగోళ్లు నిలిపివేసినట్టు తెలుస్తోంది.
మంత్రి ఆదేశాలను తుంగలో తొక్కే ప్రయత్నం !
మంత్రి తుమ్మల మాత్రం తన ఇలాఖాలో జీరో, ఆర్డీ కట్టడి చేసి రైతుకు గిట్టుబాటు ధరతో పాటు వ్యవసాయ మార్కెట్ కు ఆదాయం పెంచేందుకు కృషి చేస్తుండగా, మిర్చి వ్యాపారులంతా సిండికేట్ గా మారి మంత్రి ఆదేశాలను తుంగలో తొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు మిర్చి వ్యాపారులతో ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ ఎరగర్ల హన్మంతరావు ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ సమస్యలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు వారం రోజులు గడువు కావాలని కోరినట్టు సమాచారం. ఈ లోపు యథావిధిగా మిర్చి క్రయ, విక్రయాలు జరపాలని కోరినట్లు తెలిసింది. మరోవైపు సోమవారం ఏసీ మిర్చి జెండా పాట రూ.13,100 పలుకగా, నాన్ ఏసీ మిర్చి ధర రూ.8500 పలికింది.
వ్యాపారుల తీరుతో నష్టపోయా..
మార్కెట్ కు సోమవారం 69 బస్తాల మిర్చిని తీసుకువచ్చాను. ఆటో కిరాయి రవాణా ఖర్చు రూ.7 వేలు అయింది. అసలే రేటు క్వింటా రూ.8వేలు కూడా రావడం లేదు. ముందుగా చెప్పకుండా మార్కెట్ కు పంట తెచ్చిన తర్వాత కొనుగోలు చేయకపోవడంతో ఇక్కడే రోజు అదనంగా ఉండాల్సి వస్తోంది.
భూక్య సురేశ్, దొండపాడు