
- కేటీఆర్ విదేశాలకు వెళ్లి జల్సాలు చేశారు
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో విదేశాలకు వెళ్లి కంపెనీలతో చేసుకున్న ఎంవోయూలన్నీ బోగస్‌వేనని మంత్రి కొండా సురేఖ అన్నారు. అసలు స్థాపించని కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న ఘనత మీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఆ కంపెనీల వివరాల గురించి ఆరా తీస్తే.. వాళ్లు ఇచ్చిన అడ్రస్‌లో అసలు కంపెనీలే లేవన్నారు. బోగస్ కంపెనీలతో ఎంఓయూలు చేసుకొని ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.
ధాత్రి బయో సిలికేట్ కూడా బోగస్ కంపెనీ అని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని, గత పదేండ్లు ప్రజల సొమ్ము దోచుకొని ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నారని విమర్శించారు. అడ్డగోలుగా ప్రజలను నిలువు దోపిడీ చేసి విదేశాలకెళ్లి జల్సాలు చేశారని ఆరోపించారు.
అన్ని స్కీమ్‌లలో స్కామ్‌లు..
దళితబంధు, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇలా ఏ స్కీమ్ తీసుకున్నా అన్నింటిల్లోనూ బీఆర్‌ఎస్ నేతలు స్కాములకు పాల్పడి దోచుకున్నారని మంత్రి ఆరోపించారు. గత పదేండ్లు కేటీఆర్ షాడో సీఎంగా పనిచేశారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని, పెట్టుబడులు రావాలని సీఎం విదేశీ పర్యటనకు వెళితే.. సీఎం తమ్ముడిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడానికి సోషల్ మీడియా టీమ్స్‌ను ఏర్పాటు చేసి, పాత వీడియోలు, మార్ఫింగ్ ఆడియో క్లిప్‌లు తయారు చేసి ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా ఆ పార్టీ మారలేదని, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ప్రజలు తీర్పు ఇచ్చారని, అయినా మారడం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ను అథఃపాతాళంలోకి తొక్కే రోజు ఎంతో దూరంలో లేదని కొండా సురేఖ హెచ్చరించారు.