రెఫ్యూజీలందరికీ సిటిజన్​షిప్ అందేదాకా సీఏఏ ఉంటది

రెఫ్యూజీలందరికీ సిటిజన్​షిప్ అందేదాకా సీఏఏ ఉంటది

ఐదేళ్లు చాన్స్ ఇవ్వండి.. ‘బంగారు బంగ్లా’లా మారుస్తం
ఈ విషయంలో కేంద్రాన్ని బెంగాల్ సీఎం మమత అడ్డుకోలేరు

కోల్కతారెఫ్యూజీలందరికీ సిటిజన్​షిప్ అందే వరకు సీఏఏ(సిటిజన్​షిప్ అమెండ్​మెంట్ యాక్ట్)ను ఆపోబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ‘సిటిజన్’ చట్టాన్ని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ అడ్డుకోలేరని, రెఫ్యూజీలకు సిటిజన్​షిప్ ఇచ్చి తీరుతామని అన్నారు. సీఏఏ గురించి తప్పుడు ప్రచారం చేస్తూ రెఫ్యూజీలను ప్రతిపక్ష పార్టీలు భయపెడుతున్నాయని, చట్టాన్ని వ్యతిరేకిస్తూ మమత తన రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం కోల్​కతా షాహిద్ మినార్ గ్రౌండ్స్​లో జరిగి న సభలో ఆయన మాట్లాడారు. ‘‘సీఏఏను ప్రధాని మోడీ తీసుకొచ్చారు. బెంగాల్​లో ఉన్న లక్షలాది మందికి సిటిజన్​షిప్ ఇచ్చేందుకు అది ఉపయోగపడుతుంది. కానీ మమత వ్యతిరేకిస్తున్నారు. బెంగాల్​లో అల్లర్లు చెలరేగాయి. ట్రైన్లు, రైల్వే స్టేషన్లు కాలిపోయాయి”అని చెప్పారు. రాజారత్​లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్​జీ) కొత్త బిల్డింగ్​ను షా ప్రారంభించారు. తర్వాత జేపీ నడ్డాతో కలిసి బెంగాల్ బీజేపీ లీడర్లతో భేటీ అయ్యారు. ఆయన రాక సందర్భంగా ‘అభినందన్’ ర్యాలీ నిర్వహించేందుకు బెంగాల్​లోని అన్ని జిల్లాల నుంచి బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. కోల్​కతా వచ్చిన అమిత్ షాకు ఎయిర్​పోర్టు వద్ద నిరసన సెగ తగిలింది. ‘గో బ్యాక్’ అంటూ ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు నినాదాలు చేశారు.

ఆర్ నోయి అన్నాయ్

‘ఆర్ నోయి అన్నాయ్(ఇకపై అన్యాయాన్ని సహించం)’ క్యాంపెయిన్​ను షా ప్రారంభించారు. ‘‘మమత ప్రతి ఊరికి వెళ్లి అక్కడ ‘దీదీ కే బోలో’ అని అడుగుతారు. కానీ ప్రజలకు ఏం చెప్పాలో అర్థంకాదు. ఇకపై మీరు సైలెంట్​గా ఉండిపోకండి. దీదీ కే బోలో అని అడిగితే.. ఆర్ నోయి అన్నాయ్ అని సమాధానమివ్వండి’’ అని పిలుపునిచ్చారు.

టెర్రర్​ను సహించం

టెర్రరిజం విషయంలో సహనం చూపబోమని, ప్రధాని మోడీ నాయకత్వంలో ప్రో యాక్టివ్ డిఫెన్స్​పాలసీని అభివృద్ధి చేశామని అమిత్ షా అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌ జరపడం ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాల సరసన మన దేశం నిలిచిందన్నారు. జవాన్లు ఏడాదిలో కనీసం 100 రోజులు తమ కుటుంబాలతో కలిసి ఉండేందుకు వీలుగా ‘హౌజింగ్ సాటిసిఫాక్షన్ రేషియో’ను మెరుగుపరిచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని చెప్పారు.

కాంగ్రెస్, సీపీఎం నిరసన ర్యాలీలు

అమిత్ షా పర్యటన సందర్భంగా బెంగాల్​లో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, సీపీఎం.. కోల్​కతాలోని పలు ప్రాంతాల్లో నిరసనలు, ర్యాలీలు చేపట్టాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్టు దగ్గరికి భారీగా చేరుకున్న కాంగ్రెస్, లెఫ్ట్‌ కార్యకర్తలు.. ‘గో బ్యాక్’ నినాదాలు చేశారు. నల్ల జెండాలు, యాంటీ సీఏఏ పోస్టర్లు చేతబట్టుకుని నిరసనలు తెలిపారు. షాహిద్ మినార్ గ్రౌండ్​లోకి వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించడంతో కొద్ది సేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

‘గోలీ మారో’ స్లోగన్లు

షా పర్యటన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ‘గోలీ మారో’ నినాదాలు చేశారు. కాషాయ జెండా పట్టిన కొందరు పార్టీ వర్కర్లు స్లోగన్లు ఇచ్చుకుంటూ షాహిద్ మినార్ గ్రౌండ్ దగ్గరికి చేరుకున్నారు. దీనిపై స్పందించేందుకు సీనియర్ పోలీసు అధికారులు నిరాకరించారు.

కాళీమాతకు పూజలు

కోల్​కతాలోని ప్రఖ్యాత కాళీఘాట్ ఆలయంలో అమిత్ షా పూజలు చేశారు. సభ పూర్తి కాగానే.. గుడికి వెళ్లారు. సుమారు 15 నిమిషాలు అక్కడ ఉన్నారు. ఆయన అక్కడికి రావడంతో సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. కాళీఘాట్ గుడికి కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇల్లు కూడా ఉంది. సభ నుంచి గుడికి వెళ్లే దారిలో చాలాచోట్ల ‘గో బ్యాక్ అమిత్ షా’ అంటూ స్లోగన్లు రాశారు.