సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బురిడీ కొట్టించిన సైబర్ చీటర్స్ .. అకౌంట్ నుంచి రూ. 2 లక్షల 18 వేలు ఖాళీ..

సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బురిడీ కొట్టించిన సైబర్ చీటర్స్ .. అకౌంట్ నుంచి రూ. 2 లక్షల 18 వేలు ఖాళీ..

సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. పోలీసులు ప్రజల్లో అవగాహన పెంచుతూ అప్రమత్తం చేస్తున్నప్పటికీ సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుతున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తిరుపతిలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల వలలో పడి భారీగా సొమ్ము పోగొట్టుకున్నాడు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. తిరుపతి రురల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వర్క్ ఫ్రమ్ హోమ్ లో భాగంగా ఇంటి నుంచే పని చేస్తున్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి రూ. 2 లక్షల 18 వేలు పోగొట్టుకున్నాడు.

మొదట పార్ట్ టైం జాబ్ అంటూ బాధితుడికి వాట్సాప్ లో మెసేజ్ చేశారు కేటుగాళ్లు. కొన్ని లింకులు పంపి వాటికి రేటింగ్ ఇస్తే డబ్బులు ఇస్తామంటూ నమ్మించారు.అలా కొంత డబ్బులు ఇచ్చి తర్వాత పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయంటూ ఆశ చూపారు కేటుగాళ్ళు. సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మిన బాధితుడు అకౌంట్లో ఉన్న రూ. 2 లక్షల 18 వెలను పంపాడు.

ఆ తర్వాత ఎంతసేపటికి తన సొమ్ము తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం, పార్ట్ టైం జాబ్స్ అంటూ వచ్చే మెసేజ్ లను నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు పోలీసులు.