సొంత ఆఫీస్​ భవనాలు లేవు... కార్యాలయాలన్నీ కిరాయి బిల్డింగుల్లోనే

సొంత ఆఫీస్​ భవనాలు లేవు... కార్యాలయాలన్నీ కిరాయి బిల్డింగుల్లోనే
  • ఆరేండ్లయినా ఆఫీసులు కట్టలే
  • ఉమ్మడి కరీంనగర్​లో 9 కొత్త మండలాల ఏర్పాటు
  • కార్యాలయాలన్నీ కిరాయి బిల్డింగుల్లోనే..
  • జాగా లేక కొన్ని.. శంకుస్థాపన చేసి వదిలేసినవి ఇంకొన్ని
  • సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు


పెద్దపల్లి, వెలుగు:  ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో కొత్త మండలాలు ఏర్పాటు చేసి ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ సొంత ఆఫీస్​ భవనాలు లేవు. నాలుగు జిల్లాల్లో కలిపి ఇప్పటిదాకా 9 కొత్త మండలాలు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లాలో అంతర్గాం, పాలకుర్తి, రామగిరి, కరీంనగర్​లో గన్నేరువరం, ఇల్లంతకుంట, సిరిసిల్లలో వీర్నపల్లి, జగిత్యాలలో జగిత్యాల రూరల్, బుగ్గారం, భీర్పూర్ మండలాలు ఏర్పడ్డాయి. ఈ మండల కేంద్రాల్లో మండల ఆఫీసులు, పోలీస్​స్టేషన్లు, ఎంపీడీఓ, ఎంఈఓ ఇతర ఆఫీసులు అన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. రామగిరిలో పోలీస్​స్టేషన్ నిర్మాణానికి 2017లో అప్పటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి భూమి పూజ చేశారు. ఇప్పటివరకు దాని నిర్మాణం పూర్తి కాలేదు. ఆ జాగాను ప్రస్తుతం హరితహారం కింద మొక్కలు పెంచడానికి కేటాయించినట్లు సమాచారం.

అరకొర సౌకర్యాల నడుమ..

పాలకుర్తి మండల తహసీల్దార్ ఆఫీసు ను రైస్ మిల్లులో, ఎంపీడీఓ ఆఫీసు జడ్పీ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేశారు. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల తహసీల్దార్ ఆఫీసు సర్కార్ స్కూల్​లో ఆవరణలో నిర్వహిస్తున్నారు. గన్నేరువరం తహసీల్దార్ ఆఫీస్​శిథిలమవడంతో అద్దె భవనంలో కొనసాగుతోంది. రామగిరి మండల పోలీస్​స్టేషన్, తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, ఏఓ ఆఫీసులన్నీ సింగరేణి క్వార్టర్లలో నిర్వహిస్తున్నారు. అద్దె భవనాలలో ఆఫీస్​లు కొనసాగిస్తుండడం, అక్కడ సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

పనుల మీద వచ్చే వారికి కష్టమైతాంది..

భూములు, ఎడ్యుకేషన్​సర్టిఫికెట్లు, ఇతర చాలా రకాల అవసరాలకు ప్రభుత్వం మండలాఫీసులతో ముడిపెట్టడంతో ప్రజలు వాటి చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడ పాత బిల్డింగులు ఉంటే అక్కడ ఆఫీసులు ఏర్పాటు చేయడంతో దూరభారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాలకుర్తి తహసీల్దార్ ఆఫీసు ఊరికి దూరంగా ఓ రైసు మిల్లులో ఏర్పాటు చేశారు. రామగిరి తహసీల్​ఆఫీస్ ఇరుకుగా ఉన్న సింగరేణి క్వార్టర్​లో ఏర్పాటు చేయడంతో పనులపై వచ్చే వారిని అధికారులు బయటే ఉండమంటున్నారు. బయట కనీసం చెట్లు కూడా లేకపోవడంతో ప్రజల అవస్థలు వర్ణణాతీతంగా ఉన్నాయి.

ఆఫీసుల కాడ తిప్పలైతంది

తహసీల్దార్ ఆఫీసు, పోలీస్​స్టేషన్ కాడ పనుండి పోతే చాలా తిప్పలైతాంది. సింగరేణి క్వార్టర్లలో ఆఫీసులు పెట్టిండ్రు. అవి ఇరుకు గదులు. ఆఫీసర్లకే సరిపోతలేవు. పనుల మీద పోయినోళ్లు బయటనే ఉండాలె. నిలబడుదామన్నా నీడలేదు. ముసలోళ్లు చాలా ఇబ్బంది పడుతున్నరు. మంచినీల్లు, టాయిలెట్లు కూడా లేవు.

- ములుమూరి శ్రీనివాస్, కల్వచర్ల, రామగిరి మండలం