హుజూర్ నగర్ హాట్ సీట్

హుజూర్ నగర్ హాట్ సీట్
  • మూడు పార్టీలకు చాలెంజ్​గా మారిన ఉప ఎన్నిక
  • సెగ్మెంట్​కు తరలుతున్న గులాబీ బలగం
  • ఇతర పార్టీల మద్దతు కూడగడుతున్న ఉత్తమ్​
  • బలమైన అభ్యర్థిని దింపేందుకు కమలం రెడీ

హుజూర్​నగర్​ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్రంలోని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జనరల్​ ఎలక్షన్​ తరహాలోనే మూడు ప్రధాన పార్టీలు ఉరుకులు పరుగులు పెడుతుండటం ఉత్కంఠకు దారితీసింది. అధికారంలో ఉన్న టీఆర్​ఎస్​ పార్టీకి ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించటంతో రాష్ట్రంలో డీలా పడ్డ కాంగ్రెస్ తన ఉనికిని చాటుకునేందుకు ఇదే అవకాశంగా భావిస్తోంది. రాష్ట్రంలో నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. ఈ ఎన్నికలో సత్తా చాటాలని చూస్తోంది. బలమైన అభ్యర్థిని రంగంలో దింపడం ద్వారా ఓటు బ్యాంకును పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఎంపీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారాయి. ఈ టైమ్​లో జరుగుతున్న ప్రత్యక్ష ఎన్నిక కావటంతో హుజూర్​నగర్​ ఉప ఎన్నిక బిగ్​ ఫైట్​నే తలపిస్తోంది.

ుజూర్​నగర్​ సెగ్మెంట్​లో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్​ ఒక్కసారీ గెలువలేదు. అందుకే ఈ ఉప ఎన్నికను ఆ పార్టీ సవాల్​గా భావిస్తోంది. ఇటీవల రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల్లో ఎదురైన చేదు ఫలితం టీఆర్ఎస్​ను వెంటాడుతోంది.  ఆ పరిస్థితి  రిపీట్​ కాకుండా ఉండేందుకు గులాబీ లీడర్లు ఈ ఎన్నికపై స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. ఎన్నికల షెడ్యూల్​ వెలువడిన రోజునే టీఆర్​ఎస్​ తన అభ్యర్థిని ప్రకటించి.. భారీ ఎత్తున ప్రచారానికి ప్లాన్ చేసుకుంది. నిరుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తమ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డినే ఈసారి కూడా పోటీకి దింపింది. 2009 నుంచి 2018 వరకు జరిగిన ఎన్నికల్లో టీఆర్​ఎస్ ఇక్కడ అలుపెరగని పోరాటమే చేసింది. తొలిసారిగా 2009 ఎన్నికల్లో టీఆర్​ఎస్​ తరఫున ప్రస్తుత మంత్రి జగదీశ్​రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇదే పార్టీ తరఫున 2014 ఎన్నికల్లో కాసోజు శంకరమ్మ, 2018 ఎ న్నికల్లో శానంపూడి సైదిరెడ్డి కూడా ఇదే స్థానం నుంచి పోటీ చేసి పరాజయం చెందారు. వరుసగా మూడు ఓటములకు తోడు.. నల్గొండ ఎంపీ సీటును టీఆర్​ఎస్​ కోల్పోయింది. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ హుజూర్​నగర్​ సీటును కైవసం చేసుకోవాలని పావులు కదుపుతోంది. ఎన్నికల బాధ్యతలు జిల్లా నాయకుల మీద వదిలేయకుండా హైకమాండ్​ నేరుగా తెలంగాణ భవన్​నుంచి మానిటర్​ చేస్తోంది.పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. వరుస ఓటముల దెబ్బతో ఈసారి మంత్రి జగదీశ్​రెడ్డిని ఇక్కడి ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించి.. పల్లా రాజేశ్వర్​రెడ్డిని ఇన్​చార్జిగా టీఆర్​ఎస్​ నియమించింది. ఏకంగా పొరుగు జిల్లాల నుంచి టీఆర్​ఎస్​ ఎంపీలు, ఇతర నాయకులకు  హుజూర్​నగర్​లో మోహరిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ పథకాలు, నిధులన్నీ అటువైపు ధారపోసేందుకు టీఆర్​ఎస్  ప్రయత్నిస్తోంది.

పీసీసీ చీఫ్​ ఉత్తమ్​కు చాలెంజ్​

హుజూర్​నగర్​ ముందునుంచీ కాంగ్రెస్​కు కంచుకోట. పీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​రెడ్డి ఈ సెగ్మెంట్​ నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నిరుడు డిసెంబర్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్​.. ఆరు నెలల వ్యవధిలో లోక్​సభ ఎన్నికల్లోనూ గెలిచి నల్గొండ ఎంపీ అయ్యారు. ఎంపీగా గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రిజైన్​ చేశారు. ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నిక జరుగుతోంది. సిట్టింగ్​ సీటును మళ్లీ తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్​ పార్టీ పట్టుదలతో ఉంది.  ఉత్తమ్​ సొంత నియోజ కవర్గం కావడం, స్వయంగా తన భార్య, మాజీ ఎమ్మెల్యే పద్మావతిని పోటీకి దింపడంతో ఉప ఎన్నిక అందరినీ ఆకర్షిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్రంలో పార్టీ ప్రతిష్ట పెరగడంతోపాటు, నియోజకవర్గంలో తన ఇమేజ్​కు మరోసారి తిరుగుండదని ఉత్తమ్​ భావిస్తున్నారు. అందుకే వివిధ పార్టీల మద్దతును ఆయన కూడగడుతున్నారు. టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితి నేతలతోపాటు, వివిధ సంఘాల మద్దతును కోరుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు వరుసగా పార్టీ ఫిరాయించారు. దీంతో రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్​ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఈ టైమ్​లో వచ్చిన ఉప ఎన్నిక కావటంతో పార్టీ ముఖ్యులందరూ ఈ సీటును హాట్​ సీటుగా భావిస్తున్నారు. పార్టీ సీనియర్​ నాయకుడు జానారెడ్డి, భువన గిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు రవి.. పీసీసీ చీఫ్​ ఉత్తమ్​తో కలిసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. త్వరలోనే పార్టీ తరఫున ఎన్నికల ఇన్​చార్జ్​లను నియమించనున్నారు.