బాన్సువాడ, వెలుగు : మండలంలోని బోర్లం గురుకుల పాఠశాల విద్యార్థిని సంగీత ఆదివారం ఆటోలో నుంచి పడి మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం బీజేపీ, బీఆర్ఎస్, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాల ఎదుట ధర్నా చేశారు. పోలీసులు అరెస్ట్ చేసి బాన్సువాడ పోలీస్ స్టేషన్‌కు తీసుకురాగా, అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రిన్సిపాల్ సునీత తన ఇంటి పనులకు తీసుకువెళ్లినందున, ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి, కొండని గంగారం, హనుమాన్లు యాదవ్ పాల్గొన్నారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్లీడర్లు అంజిరెడ్డి, మోచి గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
రెండు నిమిషాలు మౌనం పాటించిన ఎమ్మెల్యే , సబ్ కలెక్టర్, డీఎస్పీ
గురుకుల విద్యార్థిని సంగీత మృతిపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఎస్పీ విఠల్‌రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో జెండావిష్కరణ అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. విద్యార్థిని మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే పోచారం పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.
ఇద్దరిపై కేసులు నమోదు చేశాం..
ఇన్చార్జి ప్రిన్సిపాల్ సునీత, ఆటో డ్రైవర్ కాశిరాంపై కేసులు నమోదు చేశామని డీఎస్పీ విఠల్ రెడ్డి చెప్పారు. అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని ఆయన వివరించారు.
