‘సర్’ తక్షణమే నిలిపేయాలి..సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే : అఖిల పక్షాలు

‘సర్’ తక్షణమే నిలిపేయాలి..సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే : అఖిల పక్షాలు
  •     కేంద్రంపై అఖిల పక్షాల ఫైర్
  •     తొలగించిన ఓట్లను చేర్చాలని జాయింట్ సీఈవోకు వినతి

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌‌ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని అఖిల పక్షాలు డిమాండ్ చేశాయి. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ, బీజేపీ ఏజెంట్‌‌లా పనిచేస్తున్న ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకొని, అరెస్టు చేయాలని  వామపక్షాలు, బీఆర్ఎస్, టీజేఎస్ పార్టీలు కోరాయి. ఓట్ల తొలగింపునకు కారణమవుతున్న సర్  ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, అక్రమంగా తొలగించిన అర్హులైన ఓట్లన్నింటినీ తిరిగి జాబితాలో చేర్చాలని రిక్వెస్ట్​చేశాయి. బుధవారం బీఆర్కే భవన్‌‌లో జాయింట్ సీఈవో వెంకట్రావును అఖిలపక్ష నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. 

ఈ బృందంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ నేత, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యతో పాటు పలువురు నేతలు ఉన్నారు. అంతకుముందు ట్యాంక్‌‌బండ్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి అఖిలపక్ష నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు బీఆర్కే భవన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి నేతలను, కార్యకర్తలను అడ్డుకున్నారు. ఆందోళనకారులు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత  నెలకొంది.జాన్ వెస్లీ, కోదండరాం, ఎల్.రమణ విజ్ఞప్తి చేయడంతో పోలీసులు బారికేడ్లను తొలగించి, వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతించారు.

మోదీకి ఈసీ ఊడిగం: జాన్ వెస్లీ 

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయకపోతే ఈ పోరాటం కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపే ఉద్యమంగా మారుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హెచ్చరించారు. సీఈసీ నిష్పక్షపాతంగా ఉండాల్సింది పోయి, ప్రధాని మోదీకి, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. టీజేఎస్ చీఫ్, ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన ఈసీ నిబంధనలను తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు.