
- గవర్నర్ను కోరిన ఆల్ పార్టీ నేతలు.. సీపీఐ, బీఆర్ఎస్ నేతలు అటెండ్.. బీజేపీ గైర్హాజర్
హైదరాబాద్, వెలుగు: రిజర్వేషన్లపై సీలింగ్ ఎత్తివేస్తూ అసెంబ్లీ, శాసనమండలి పంపిన పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులను ఆమోదించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రులు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఆల్ పార్టీ నేతలు కోరారు. గతంలో ఆర్డినెన్స్ ను పంపామని, తాజాగా బిల్లులను ఆమోదించి పంపామని గవర్నర్కు వివరించారు. సోమవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ, పలు బీసీ సంఘాల నేతలు రాజ్ భవన్లో గవర్నర్ను కలిసి బిల్లులను ఆమోదించాలని కోరారు.
మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, విప్ లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జాతీయ నేత నారాయణ, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు. గవర్నర్ ను కలిసేందుకు రావాలని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు, ఎమ్మెల్యేలను ఆదివారం మంత్రి పొన్నం విజ్ఞప్తి చేసినా వారు హాజరు కాలేదు. అనంతరం రాజ్ భవన్ దగ్గర పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన వాగ్దానం మేరకు అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసి గవర్నర్ కు పంపామన్నారు. “కులగణన సర్వే ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీ, కౌన్సిల్ లో బిల్ పాస్ చేశాం. కులగణన ప్రకారం రాష్ట్రంలో 56.33 శాతం బీసీల జనాభా ఉంది. కులగణన సర్వే నివేదికను దృష్టిలో పెట్టుకొని అఖిలపక్ష నేతలం గవర్నర్ ను కలసి ఆమోదించాలని కోరాం” అని తెలిపారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.
బీజేపీ ఉన్నత వర్గాల పార్టీ కాబట్టే రాజ్ భవన్ కు రాలేదన్నారు. కాళేశ్వరంపై ఇచ్చిన రిపోర్ట్ ను బీఆర్ ఎస్ నేతలు చెత్త బుట్టలో పడేయటం కరెక్ట్ కాదన్నారు. గత పదేండ్ల ఎన్నో తప్పులు చేశారు కాబట్టే కేసీఆర్ అసెంబ్లీకి రావటం లేదన్నారు. వీటన్నింటికి నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ రాజీనామా చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ.. రిజర్వేషన్ల పెంపుకు ఈ ప్రయత్నం సరిపోదని, పార్లమెంట్ లో బిల్ పాస్ కావాలన్నారు.
ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపాలని ఆయన కోరారు. రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వం ఏం చేసినా బీఆర్ ఎస్ మద్దతు ఉంటుందని ఆయన వెల్లడించారు.