21 న ప్రతిపక్షాల ఆల్ పార్టీ మీటింగ్.?

21 న ప్రతిపక్షాల ఆల్ పార్టీ మీటింగ్.?

లోక్​సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి బీజేపీని ఎదుర్కోవాలని భావించాయి. అయితే సీట్ల లెక్కలు, వివిధ కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా.. కొన్ని చోట్ల ఒకటి రెండు పార్టీలు కలసి పోటీ చేశాయి. గత అనుభవాలు, భవిష్యత్​ వ్యూహరచనలో భాగంగా ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందే మళ్లీ ప్రతిపక్షాలన్నీ ఒక్కటి కావాలనే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ సంక్లిష్టమైతే ఏం చేయాలనే దానిపై చర్చించేందుకు ఈ నెల 21న సమావేశమై ఓ వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అవసరమైతే ఇదే సమావేశంలో ప్రధాని అభ్యర్థిని సైతం ఖరారు చేయాలని భావిస్తున్నాయి.

ఫలితాలు రాగానే రాష్ట్రపతి వద్దకు..

బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్​ చీఫ్​ రాహుల్​గాంధీతో ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్​సభ ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందు అన్ని ప్రతిపక్షాల సమావేశం ఏర్పాటు చేయాలని, అప్పుడు ప్రతిపక్ష నేతలందరూ ఒకే తాటిపైకి వస్తారని రాహుల్,​ చంద్రబాబు భావిస్తున్నట్టు తెలిసింది. లోక్​సభ ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఉమ్మడి ప్రతిపక్షం రాష్ట్రపతి వద్దకు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు తొలి ప్రాధాన్యం తమకే ఇవ్వాలని కోరాలని భావిస్తున్నట్టు సమాచారం. సీట్ల లెక్కలు, మెజారిటీ మార్కుకు వారు ఎంత దూరంలో ఉన్నారనే విషయాలను పట్టించుకోకుండా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేయాలని యోచిస్తున్నారు. బీజేపీ సింగిల్​ లార్జెస్ట్​ పార్టీగా అవతరిస్తుందని అనేక ఒపీనియన్​ పోల్స్​ చెపుతున్నా.. ఒకవేళ హంగ్​ అసెంబ్లీ వస్తే ఆ పార్టీని మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు తొలుత ఆహ్వానించవద్దని, రాష్ట్రపతి తన విచక్షణాధికారాలను ఉపయోగించి ప్రభుత్వ ఏర్పాటుకు తమనే ఇన్వైట్​చేయాలని విజ్ఞప్తి చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఓటర్​ స్లిప్పులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన 21 ప్రతిపక్షాలు.. ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రపతికి ఓ లేఖ రాయాలని భావిస్తున్నాయి. అందులో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతుగా లేఖలు ఇస్తామని చెప్పనున్నాయి.

విచక్షణాధికారాలపై వివాదాలెన్నో

కేంద్రంలో హంగ్​ ఏర్పడితే ఎవరిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలనే దానిపై రాష్ట్రపతికి విచక్షణాధికారాలున్నాయి. రాష్ట్రపతి విచక్షణాధికారాలపై గతంలో అనేక వివాదాలు చెలరేగాయి. 1996లో అప్పటి రాష్ట్రపతి శంకర్​ దయాళ్​ శర్మ.. సింగిల్​ లార్జెస్ట్​ పార్టీగా నిలిచిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అయితే మెజారిటీని నిరూపించుకోలేక అటల్​ బిహారీ వాజ్​పేయి రాజీనామా చేయాల్సి వచ్చింది. గోవా, మణిపూర్​ అసెంబ్లీల్లో గవర్నర్​ సింగిల్​ లార్జెస్ట్​ పార్టీగా నిలిచిన కాంగ్రెస్​ను కాదని, బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంలో ఈ రెండు చోట్లా బీజేపీ విజయం సాధించింది. గతేడాది కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో అతి పెద్ద పార్టీగా నిలిచిన బీజేపీని గవర్నర్​ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం చేసినా బలం నిరూపించుకోలేకపోయారు. కాంగ్రెస్, జేడీఎస్​ చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కర్నాటక ఎపిసోడ్​ నుంచి పాఠాలు నేర్చుకున్న ప్రతిపక్షాలు.. జాతీయ స్థాయిలో లోక్​సభ ఎన్నికలకు ముందే కూటమిని ఏర్పాటు చేయాలని భావించినా సాధ్యం కాలేదు. అయితే ఎన్నికల ఫలితాలకు ముందు ఈ పార్టీలన్నీ ఇప్పుడు తమ స్ట్రాటజీని మార్చుకుని ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.