విభజన హామీలపై ఒక రోజు చర్చించాలె

విభజన హామీలపై ఒక రోజు చర్చించాలె

న్యూఢిల్లీ, వెలుగు: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీల అమలుపై చర్చకు పార్లమెంట్ బడ్జెట్ సెషన్ లో ఒక రోజు కేటాయించాలని ఆల్ పార్టీ మీటింగ్ లో టీఆర్ఎస్ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. గురువారం పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో జరిగిన అఖిల పక్ష సమావేశానికి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వర్ రావు హాజరయ్యారు. సమావేశం తర్వాత మీడియాతో కేకే మాట్లాడారు. విభజన హామీల అమలుపై బడ్జెట్ సమావేశాల్లో గట్టిగా అడుగుతామన్నారు. ఆరేండ్లు గడుస్తోన్నా హామీలను కేంద్రం అమలు చేయలేదని, దీనిపై ఒక రోజు మొత్తం చర్చించాలన్నారు. సీఏఏ ఆందోళనలపై కూడా పార్లమెంట్ లో చర్చ జరగాలన్నారు. దీనిపై ప్రజలు ఎందుకు రోడ్లపైకి వస్తున్నారో కేంద్రం ఆలోచించాలని సూచించారు. సీఏఏ బిల్లును మొదటి నుంచి టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందన్నారు. సీఏఏ (సిటిజన్​షిప్ అమెండ్ మెంట్ యాక్ట్)కు మొదటి అడుగు ఎన్పీఆర్ (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్) అని కేంద్ర హోంశాఖ వార్షిక రిపోర్టే చెప్తోందన్నారు. అందువల్లే ఎన్పీఆర్ పై గందరగోళం నెలకొందన్నారు. ఈ బిల్లుపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించాలని సూచించినట్లు కేకే చెప్పారు. నామా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. ఏ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా, హామీలతోనే సరిపెడుతున్నారని చెప్పారు. సీఏఏ బిల్లును టీఆర్ఎస్ ఉభయసభల్లో వ్యతిరేకించిందని, ఈ బిల్లు పాస్ అయితే దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతాయని ఆనాడే చెప్పామన్నారు.