
- 8 ఏండ్ల నుంచి భర్తీ కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు
- 11 వర్సిటీల్లో 968 మందే వర్కింగ్ ..1,869 టీచింగ్ పోస్టులు ఖాళీ
హైదరాబాద్, వెలుగు:ఉద్యమ కేంద్రాలుగా ఉన్న యూనివర్సిటీలు.. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. నిధుల్లేక, నియామకాలు జరగక అవస్థలు పడుతున్నాయి. దాదాపు 8 ఏండ్ల నుంచి వర్సిటీల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్లేకపోవడంతో టీచింగ్ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి.
శాంక్షన్డ్ పోస్టులు 2,837
రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల పరిధిలో మొత్తం 2,837 శాంక్షన్డ్ పోస్టులుండగా, వాటిలో 968 మంది మాత్రమే పని చేస్తున్నారు. మరో 1,869 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. నాలుగేండ్ల కింద 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చినా.. వివిధ కారణాలతో అవి భర్తీకి నోచుకోలేదు. దీంతో అన్ని యూనివర్సిటీల్లోని మెజార్టీ డిపార్ట్మెంట్లలో ప్రొఫెసర్లే లేని దుస్థితి నెలకొన్నది. ఆరు వర్సిటీల్లో డైరెక్ట్ గా ఒక్క ప్రొఫెసర్‌నూ భర్తీ చేయలేదు. మూడు వర్సిటీల్లో అసోసియేట్ ప్రొఫెసర్లూ లేరు. ప్రమోషన్ల ద్వారా కొందరున్నా.. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి.
239 ప్రొఫెసర్లు ఖాళీ..
మొత్తం 395 ప్రొఫెసర్ పోస్టులు శాంక్షన్ అయితే, వాటిలో 238 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, ఆర్జీయూకేటీ, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీల్లో ఒక్క డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రొఫెసర్ లేడు. కేయూలో కేవలం ఒకే ఒక్కరున్నారు. ఓయూలో 38 ఖాళీగా ఉన్నాయి. 781 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శాతవాహన, ఆర్జీయూకేటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. స్టేట్లోని 11 వర్సిటీల పరిధిలో 1,061 పోస్టుల భర్తీకి 2017లోనే ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ వివిధ కారణాలతో వాటిని భర్తీ చేయలేదు.
వర్సిటీల్లో పోస్టులు ఇలా..
వర్సిటీ మంజూరు ఖాళీ
ఉస్మానియా 1,267 845
జేఎన్‌టీయూ 410 232
కాకతీయ 409 298
ఆర్‌జీయూకేటీ 147 128
తెలంగాణ 152 73
శాతవాహన 64 45
మహాత్మాగాంధీ 70 35
పాలమూరు 95 73
అంబేద్కర్ 86 48
తెలుగు 82 61
జేఎన్‌ఏఎఫ్‌ఏయూ 55 31