న్యూఢిల్లీ: భారతదేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఆరు నెలల్లో నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్పీఏలు) తగ్గించుకోగలిగాయి. అయితే ప్రైవేట్ రంగంలో 67 శాతం బ్యాంకులు మాత్రమే ఈ కాలంలో అప్పులను తగ్గించుకున్నాయి. గురువారం విడుదల చేసిన ఫిక్కీ-–ఐబీఏ బ్యాంకర్ల సర్వే ఈ విషయాలను తెలిపింది. దీనిని గత జులై నుంచి డిసెంబర్ వరకు నిర్వహించారు. సర్వే ప్రకారం గత ఆరు నెలల్లో 77 శాతం బ్యాంకుల ఎన్పీఏలు తగ్గాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆస్తుల నాణ్యత తమ ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే బాగుంది. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ విదేశీ బ్యాంకులతో సహా మొత్తం 23 బ్యాంకులు ఈ సర్వేలో పాల్గొన్నాయి.
వీటికి బ్యాంకింగ్ పరిశ్రమలో 77 శాతం వాటా ఉంది. సగానికిపైగా బ్యాంకులు వచ్చే ఆరు నెలల్లో స్థూల నిరర్థక ఆస్తులు 3–-3.5 శాతం పరిధిలో ఉంటాయని భావిస్తున్నాయి. విదేశీ బ్యాంకులు ఏవీ కూడా ఎన్పీఏ స్థాయిలు పెరిగినట్లు పేర్కొనలేదు. గత ఆరు నెలల్లో 22 శాతం ప్రైవేట్ బ్యాంకులు వృద్ధి సాధించాయి. ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల నుంచి మొండిబాకీలు ఎక్కువగా ఉన్నాయి. 41 శాతం బ్యాంకులు ఆహారేతర పరిశ్రమ లోన్ల వృద్ధి 12 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేశాయి. పరిశ్రమ క్రెడిట్ వృద్ధి 10–-12 శాతం పరిధిలో ఉంటుంది. ఆహారేతర పరిశ్రమ లోన్ల వృద్ధి 8–-10 శాతం పరిధిలో ఉంటుందని 36 శాతం మంది అభిప్రాయపడ్డారు.
నెట్ఎన్పీఏలు కూడా..
సర్వేలో పాల్గొన్న బ్యాంకులలో సగానికి పైగా స్థూల ఎన్పీఏలు వచ్చే ఆరు నెలల్లో 3–-3.5 శాతం పరిధిలో ఉంటాయని నమ్ముతున్నాయి. 14 శాతం మంది రెస్పాండెంట్లు ఎన్పీఏ స్థాయిలు 2.5–-3 శాతం ఉండొచ్చని తెలిపారు. అయితే టర్మ్ డిపాజిట్లు వేగం పుంజుకున్నాయి. అయితే 70 శాతం మంది రెస్పాండెంట్లు మొత్తం డిపాజిట్లలో ‘కాసా’ డిపాజిట్ల వాటా తగ్గిందని చెప్పారు.
65 శాతం బ్యాంకులు పెద్ద సంస్థలకు క్రెడిట్ ప్రమాణాలు మారలేదని వెల్లడించాయి. ఎస్ఎంఈలకు కూడా ప్రమాణాలలో ఎటువంటి మార్పు లేదని 64 శాతం బ్యాంకులు తెలిపాయి. 27 శాతం బ్యాంకులు మాత్రం క్రెడిట్ ప్రమాణాలను సడలించినట్లు నివేదించాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మెటల్స్, ఐరన్ అండ్ స్టీల్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాలకు దీర్ఘకాలిక క్రెడిట్ డిమాండ్ కొనసాగుతోందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రెడిట్ ఫ్లోలో పెరుగుదల కనిపిస్తోంది. 82 శాతం మంది రెస్పాండెంట్లు దీర్ఘకాలిక రుణాలు పెరుగుతాయని అంటున్నారు.
