అన్ని రంగాల్లో పెట్టుబడులకు ప్రైవేటుకు సై

అన్ని రంగాల్లో పెట్టుబడులకు ప్రైవేటుకు సై

న్యూఢిల్లీబొగ్గు, ఏవియేషన్, స్పేస్, డిఫెన్స్ రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులు ఆహ్వానిస్తామని ఇప్పటికే ప్రకటించిన కేంద్రం.. తాజాగా పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటైజ్ చేస్తామని తెలిపింది. అన్ని రంగాల్లో ప్రైవేటుకు అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. 2020–21కి సంబంధించి రాష్ర్టాలకు ఎఫ్ఆర్ బీఎం పరిమితిని పెంచింది. కరోనా చెప్పిన పాఠాలతో 100 వర్సిటీల్లో ఆన్ లైన్ కోర్సులు ప్రారంభిస్తామని చెప్పింది. ప్రధాని మోడీ ప్రకటించిన రూ.20 లక్షల ఎకనామిక్ ప్యాకేజీ వివరాలను 4 రోజులుగా వెల్లడిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆదివారం ఐదో, చివరి విడత కేటాయింపుల గురించి వివరించారు. ఉపాధి హామీ, హెల్త్‌‌ కేర్ అండ్ ఎడ్యుకేషన్, వ్యాపారాలు, కంపెనీల చట్టం డీ-క్రిమినలైజేషన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వనరులపై దృష్టి పెట్టారు.

‘ఉపాధి’కి మరింత సాయం

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అదనంగా మరో రూ.40 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మల తెలిపారు. వలస కూలీలు సొంత రాష్ర్టాలకు వెళ్తుండటంతో.. మరింత పని కల్పించేందుకు ఈ నిధులు ఇస్తున్నట్లు చెప్పారు. గతంలో కేటాయించిన రూ.61 వేల కోట్లకు ఇది అదనమని చెప్పారు. వలస కార్మికులు పెద్ద సంఖ్యలో సొంతూళ్లకు చేరుకుంటున్నారని, దీంతో అందరికీ పని దొరికేలా ఈ నిధులు తోడ్పడతాయని వివరించారు. ఈ నిధులతో జల సంరక్షణ పనులు చేపడతారని వివరించారు. సుమారు 300 కోట్ల పని దినాలు కల్పిస్తామని చెప్పారు. లాక్ డౌన్ పీరియడ్ లో 8.19 కోట్ల మంది రైతులకు రూ.2000 చొప్పున రూ.16,394 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు.

దివాలా.. రూ. కోటికి పెంపు

చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రత్యేక దివాలా ప్రక్రియకు సంబంధించిన కార్యాచరణ పథకాన్ని ప్రకటిస్తామని నిర్మల చెప్పారు. దివాలా ప్రక్రియ ప్రారంభానికి ఉన్న పరిమితిని రూ.లక్ష నుంచి రూ. కోటికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇన్సాల్వెన్సీ, బ్యాంక్ రప్ట్​సీ కోడ్ లోని సెక్షన్ 240ఏ కింద ఎంఎస్ఎంఈల కోసం త్వరలోనే స్పెషల్ ఇన్సాల్వెన్సీ రెసొల్యూషన్ ఫ్రేమ్ వర్క్ తీసుకొస్తామన్నారు. పరిస్థితిని బట్టి దివాలా ప్రక్రియను ఒక ఏడాది పాటు నిలిపేస్తామని చెప్పారు. మైనర్ టెక్నికల్ డీఫాల్ట్స్, ప్రొసీజురల్ డీఫాల్ట్స్ కు కంపెనీల చట్టం ఉల్లంఘనల నేరాల నుంచి మినహాయింపు ఇస్తామని నిర్మల చెప్పారు. కాంపౌండబుల్ అఫెన్సెస్‌‌లో చాలా సెక్షన్లను అంతర్గత న్యాయనిర్ణయ వ్యవస్థలోకి (ఐఏఎం) మారుస్తామన్నారు. ఇప్పటిదాకా 18 సెక్షన్లు ఐఏఎం పరిధిలో ఉండగా 58 సెక్షన్లకు పెంచుతామని తెలిపారు. ఇందుకోసం ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నారు. అనుమతించదగ్గ విదేశీ చట్టపరిధుల్లో ఉన్న భారతీయ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకు సెక్యూరిటీస్‌‌లో డైరెక్ట్ లిస్టింగ్ చేస్తామన్నారు. స్టాక్ ఎక్స్ చేంజ్ లలో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు లిస్ట్ చేసే ప్రైవేట్ కంపెనీలను లిస్టెడ్ కంపెనీలుగా పరిగణించబోమని చెప్పారు.

3,360 కోట్లు విత్ డ్రా

లాక్ డౌన్ టైమ్​లో 12 లక్షల మంది ఈపీఎఫ్ వో సభ్యులు రూ.3,360 కోట్లను విత్ డ్రా చేసుకున్నారని నిర్మల తెలిపారు. 2.2 కోట్ల మంది భవన, నిర్మాణ కార్మికులకు పీఎంజీకేవై కింద రూ.3,950 కోట్లు ఇచ్చామన్నారు.

రాష్ర్టాలకు ఎఫ్​ఆర్​బీఎం 5 శాతానికి పెంపు

2020–21 సంవత్సరానికి సంబంధించి రాష్ట్రాల రుణపరిమితిని జీఎస్ డీపీలో 3 శాతం నుంచి 5 శాతానికి పెంచుతున్నట్లు నిర్మల తెలిపారు. 3 శాతం లెక్కన ప్రస్తుతం రూ.6.41 లక్షల కోట్లు తీసుకునేందుకు అవకాశం ఉండగా.. ఇప్పుడు అదనంగా మరో రూ.4.28 లక్షల కోట్ల వరకు రుణం తెచ్చుకునే అవకాశం రాష్ర్టాలకు ఉంటుంది. ఇలా పెరిగిన రుణ పరిమితి… ఒక-దేశం–ఒక -రేషన్ కార్డ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, విద్యుత్ పంపిణీ, పట్టణ స్థానిక సంస్థ ఆదాయాలు వంటి స్పెసిఫిక్ రీఫార్మ్స్ తో ముడిపడి ఉంటుంది. ప్రస్తుత రుణ పరిమితిలో రాష్ట్రాలు ఇప్పటిదాకా 14  శాతం మాత్రమే రుణాలు తీసుకున్నాయి. ఇంకా 86 శాతం తీసుకోలేదు.

హెల్త్ పై ఫోకస్

కరోనా టెస్టింగ్ ల్యాబ్స్, కిట్లు, ఇతర అత్యవసర పరికరాల కోసం రాష్ట్రాలకు రూ.15,000 కోట్లు ఇచ్చామని నిర్మల తెలిపారు. టెలీ కన్సల్టేషనన్ సర్వీసెస్, ఆరోగ్య సేతు యాప్ ప్రారంభించామన్నారు. హెల్త్ కేర్ వర్కర్స్‌‌కు రూ.50 లక్షల చొప్పున బీమా ప్రకటించామని వివరించారు. రాష్ట్రాలకు రూ.4,113 కోట్లకు పైగా నిధులు విడుదల చేశామన్నారు. ఆరోగ్యంపై ప్రభుత్వం చేసే ఖర్చు పెరుగుతోందని, పట్టణాలు, గ్రామాల్లో ఆరోగ్య రంగంలో పెట్టుబడులను పెంచుతామని వెల్లడించారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ఏర్పాటు చేస్తామని వివరించారు.

మొత్తం 21 లక్షల కోట్లు

ఆత్మనిర్భర్ భారత్‌‌ అభియాన్ ప్యాకేజీ రూ.20 లక్షల కోట్లని ప్రధాని మోడీ ప్రకటించినా.. ప్యాకేజీ విలువ రూ.20,97,053 కోట్లు. తొలి విడత ప్యాకేజీ రూ. 5,94,550 కోట్లు, రెండో విడత రూ.3,10,000 కోట్లు, మూడో విడత రూ.1,50,000 కోట్లు, నాలుగు, ఐదు విడతల మొత్తం రూ.48,100 కోట్లు.. అంతా కలిపితే రూ.11,02,650 కోట్లు. ఇక ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ప్యాకేజీలో రూ.1,92,800 కోట్లు, ఆర్బీఐ తీసుకున్న చర్యల విలువ రూ.8,01,603 కోట్లు కలిపితే మరో రూ.9,94,403 కోట్లు అవుతుంది. కాబట్టి మొత్తం ప్యాకేజీ రూ.20,97,053 కోట్లు.

విలీనం.. ప్రైవేటైజ్..

అన్ని రంగాల్లో ప్రైవేటుకు అవకాశం కల్పిస్తామని నిర్మల తెలిపారు. వ్యూహాత్మక రంగాల్లో కనీసం ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఉంటుందని, ప్రైవేటుకూ అనుమతులు ఇస్తామని చెప్పారు. మిగతా నాన్ స్ర్టాటజిక్ సెక్టార్ లోని ప్రభుత్వ రంగ సంస్థలను దశలవారీగా ప్రైవేటైజ్ చేస్తామని తెలిపారు. కొత్త ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్ఈ) విధానాన్ని ప్రకటించిన నిర్మల.. పీఎస్​యూల ఉనికి అవసరమయ్యే వ్యూహాత్మక రంగాల జాబితాను తెలియజేస్తామన్నారు.

సాయం ఇలా..

  • ఏప్రిల్‌‌లో రూ.46,038 కోట్లు పన్నుల ఆదాయం రాష్ర్టాలకు బదిలీ.
  • ఏప్రిల్, మేలో రాష్ట్రాలకు రెవెన్యూ లోటు గ్రాంట్ల కింద రూ.12,390 కోట్లు అందజేత.
  • ఎస్డీఆర్ఎఫ్ నిధుల కోసం ఏప్రిల్ తొలి వారంలో రూ.11,092 కోట్ల అడ్వాన్స్ చెల్లింపు.
  • కరోనా నివారణ చర్యల కోసం కేంద్రం నుంచి రూ.4,114 కోట్లు విడుదల.
  • రాష్ట్రాల ‘వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్’ పరిమితిని ఆర్బీఐ 60 శాతానికి పెంచింది

వానాకాలం నాటికి కొండపోచమ్మకు నీళ్లు