సిటీ రోడ్లను అద్దం లెక్క చేస్తమని ఆగం జేసిన్రు.. ఎక్కడ చూసినా గుంతలు, బొందలే

సిటీ రోడ్లను అద్దం లెక్క చేస్తమని ఆగం జేసిన్రు.. ఎక్కడ చూసినా గుంతలు, బొందలే
  • రోజూ నరకం అనుభవిస్తున్న వాహనదారులు
  • మెయిం టెనెన్స్ పేరిట కాంట్రాక్టర్ల జేబులకు కోట్లాది రూపాయలు
  • రిపేర్ చేసిన కొద్ది రోజులకే మునుపటి లెక్కనే పరిస్థితి
  • రోడ్ల గురించి అడుగడుగునా లీడర్లను నిలదీస్తున్న జనం

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్‌‌ హైదరాబాద్​లో రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. నెల రోజుల కింద కురిసిన భారీ వర్షాలకు మరింత దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అడుగు, అడుగున్నర లోతైన గుంతలు, బొందలు ఏర్పడ్డాయి. రిపేర్ల పేరిట ఏటా కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్నట్లు ప్రభుత్వం చెప్తున్నా.. రిపేర్ చేసిన కొద్ది రోజులకే మళ్లీ ఎప్పటిలెక్కనే రోడ్లు తయారవుతున్నాయి. సిటీలో 9,013 కిలో మీటర్ల పొడవైన రోడ్లు ఉండగా, అందులో 2,486 కి.మీ. బీటీ, 6,167 కి.మీ.ల సీసీ రోడ్లు ఉన్నాయి. ఏటా ఈ రోడ్ల మెయింటనెన్స్‌‌ కోసం బల్దియా రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్తున్నది. కానీ ఆ పనులను ఆగమాగంగా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

మెయిన్​రోడ్లపై 3,069 గుంతలు గుర్తించిన జీహెచ్​ఎంసీ

ఆరేండ్లుగా గ్రేటర్​లో ఏ రోడ్డును చూసినా గుంతలతోనే కనిపిస్తున్నాయి. రిపేర్లు చేయడం, మళ్లీ ఏదో పైప్​ లైన్​ పని ఉందని చెప్పి రోడ్లను తవ్వడం, మళ్లీ రిపేర్లు చేయడం.. ఇదే తంతు నడుస్తూ ఉంది. గ్రేటర్​లోని అన్ని ప్రధాన రహదారులపై 3,069 గుంతలు పడినట్టుగా జీహెచ్‌‌‌‌ఎంసీ ఇటీవల గుర్తించింది. కాలనీలు, బస్తీల్లోని ఇంటర్నల్‌‌‌‌ రోడ్లపై ఏర్పడ్డ గుంతలు ఇంతకు మూడు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. ఏదైనా ఒక రోడ్డు నిర్మించిన వర్క్‌‌‌‌ ఏజెన్సీ నిర్దిష్టకాలానికి దాని మెయింటనెన్స్‌‌‌‌ బాధ్యతలు కూడా చూడాల్సి ఉంటుంది. కానీ, మెయింటనెన్స్​ను వర్క్​ ఏజెన్సీలు పట్టించుకోవడం లేదు. ఆఫీసర్లు పర్యవేక్షించడం లేదు. కొన్ని రోడ్లను గుంతల కారణంగా పూర్తిగా మూసేసి.. ఆల్టర్నేట్‌‌‌‌ రూట్‌‌‌‌లో వెళ్లాలని సూచిస్తున్నారు. లోటస్‌‌‌‌పాండ్‌‌‌‌ నుంచి టోలీచౌకి వెళ్లే రోడ్డు వారం రోజులుగా క్లోజ్‌‌‌‌ చేసే ఉంది. ఇన్ని రోజులుగా రోడ్డును మూసేసినా దానికి రిపేర్లు మాత్రం చేయడం లేదు. అదే రోడ్డులో ఫిలింనగర్‌‌‌‌ వైపు వెళ్తే మోకాళ్లలోతు గుంతలున్నాయి. ఆ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు రోడ్డు ప్రమాదానికి గురవుతున్నారు. ఇదే పరిస్థితి చాలా చోట్ల ఉంది.

69 రోడ్లలో 48 పనులు పెండింగ్‌‌‌‌

నగరంలో ట్రాఫిక్‌‌‌‌ రద్దీ సమస్యే తలెత్తకుండా ఫ్లైఓవర్లు, స్కైవేలు, ఎలివేటెడ్‌‌‌‌ కారిడార్లు, ప్రధాన రోడ్లు, గ్రేడ్‌‌‌‌ సెపరేటర్లు, కొత్త రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి ఐదేండ్లు గడిచినా ఇప్పటికీ వాటిలో ఏ ఒక్కటీ ఆచరణకు నోచుకోలేదు. మూసీ నదిపై రూ. 500 కోట్లతో నిర్మిస్తామన్న నాలుగు లేన్ల రోడ్డుకు పునాది పడలేదు. బీటీతో పోల్చితే వైట్‌‌‌‌ టాప్‌‌‌‌ రోడ్ల లైఫ్‌‌‌‌ ఎక్కువగా వస్తుంది కాబట్టి సిటీ మొత్తం ఆ పనులే చేస్తామని చెప్పినా ఆ హామీ అమలుకు నోచుకోలేదు. ఎస్‌‌‌‌ఆర్డీపీలో భాగంగా రూ.7,089.17 కోట్ల లోన్‌‌‌‌తో చేపట్టిన 69 రోడ్డు పనుల్లో 48 పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. రూ. 3,325.90 కోట్లతో మొదలు పెట్టిన ఎల్బీ నగర్‌‌‌‌, మైండ్‌‌‌‌ స్పేస్‌‌‌‌ బయోడైవర్సిటీ కారిడార్లలోని 17 పనులు, దుర్గం చెరువు కేబుల్‌‌‌‌ బ్రిడ్జి, పెద్దమ్మతల్లి ఫ్లై ఓవర్‌‌‌‌, షేక్‌‌‌‌పేట్‌‌‌‌ ఎలివేటెడ్‌‌‌‌ కారిడార్‌‌‌‌, కొత్తగూడ, బాలానగర్‌‌‌‌, ఓవైసీ చౌరస్తా, బహదూర్‌‌‌‌పురా జంక్షన్‌‌‌‌, అంబర్‌‌‌‌పేట్‌‌‌‌, శిల్పా లే ఔట్‌‌‌‌- గచ్చిబౌలి, పంజాగుట్ట స్టీల్‌‌‌‌ బ్రిడ్జి, తుకారాంగేట్‌‌‌‌, హైటెక్‌‌‌‌సిటీ ఆర్‌‌‌‌యూబీలు, కైత్‌‌‌‌లాపూర్‌‌‌‌ ఆర్వోబీ, ఉప్పల్‌‌‌‌ ఎలివేటెడ్‌‌‌‌ కారిడార్‌‌‌‌ పనులు నిర్మాణ దశలోనే ఉన్నాయి. రూ. 2,577.27 కోట్లతో ఇందిరాపార్కు​, సైబర్‌‌‌‌ టవర్స్‌‌‌‌, నల్గొండ ఎక్స్‌‌‌‌రోడ్డు నుంచి ఒవైసీ హాస్పిటల్, జూపార్కు నుంచి ఆరాంఘర్​ కారిడార్లు, రేతిభౌలి, చాంద్రయాణగుట్ట, శాస్త్రీపురం ఫ్లై ఓవర్లతో పాటు కేబీఆర్​పార్కు చుట్టూ ఫ్లై ఓవర్, ఫలక్‌‌‌‌నుమా ఆర్వోబీలు నిర్మించేందుకు టెండర్లు పిలువడానికి సిద్ధమవుతున్నారు. రూ.1,186 కోట్లతో చేపట్టాల్సిన కాజాగూడ ఎలివేటెడ్​ కారిడార్‌‌‌‌, ఉప్పల్‌‌‌‌ ఎక్స్‌‌‌‌రోడ్ ఫ్లై ఓవర్‌‌‌‌ పనుల్లో మొదటి దానికి అడ్మినిస్ట్రేషన్‌‌‌‌ శాంక్షన్‌‌‌‌, రెండో దానిని సర్కారు క్లియరెన్స్‌‌‌‌ రావాల్సి ఉంది. ఓయూ కాలనీ, కొత్తగూడ, హైటెక్​ సిటీ ఆర్​యుబీ, కైత్లాపూర్ ఆర్‌‌‌‌వోబీ, ఓవైసీ ఫ్లైఓవర్, బహదూర్‌‌‌‌పురా, చాంద్రయాణగుట్ట ఫ్లై ఓవర్లు, నల్లొండ ఎక్స్‌‌‌‌రోడ్డు  స్టీల్​ బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి.

రూ. 1,800 కోట్లు ఖర్చు చేశామన్న కేటీఆర్

గ్రేటర్‌‌‌‌లో రోడ్ల అభివృద్ధి కోసం రూ. 1,800 కోట్లు ఖర్చు చేశామని ఇటీవల మీట్​ ది ప్రెస్​లో మంత్రి కేటీఆర్​ ప్రకటించారు. అయినా రోడ్లన్నీ అస్తవ్యస్తంగానే ఉన్నాయి. ఈ యేడాది కాంప్రహెన్సివ్‌‌‌‌ రోడ్‌‌‌‌ మేయింటనెన్స్‌‌‌‌ ప్రోగ్రాంలో భాగంగా రోడ్ల నిర్మాణాన్ని జీహెచ్​ఎంసీ చేపట్టింది. 709  కి.మీ.ల పొడవైన రోడ్లు నిర్మించేందుకు వర్క్‌‌‌‌ ఏజెన్సీలతో అగ్రిమెంట్‌‌‌‌ చేసుకుంది. మొదటి యేడాది 50 శాతం, తర్వాతి రెండేండ్లు 25 శాతం చొప్పున రోడ్లు వేసి, ఆ తర్వాతి రెండేండ్లు వాటి మెయింటనెన్స్‌‌‌‌ చూడాల్సి ఉంటుంది. మొదటి యేడాది సగం రోడ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉండగా.. కనీసం పనులు మొదలు కాలేదు.

బ్యాక్‌‌‌‌ పెయిన్‌‌‌‌ వస్తున్నది

సిటీల రోడ్లపై బొందలతో డ్రైవింగ్‌‌‌‌ చేయాలంటే భయమైతున్నది. ఈ గుంతలతో బండ్లు డ్యామేజీ అవుడే కాదు.. డ్రైవర్లకు బ్యాక్‌‌‌‌ పెయిన్‌‌‌‌ వస్తున్నది.  పొద్దంతా ట్యాక్సీ నడిపి సంపాయించే దాంట్లో సగం పైసలు దవాఖాన్లనే  పెట్టాల్సి వస్తున్నది.

షేక్​ సలావుద్దీన్, అధ్యక్షుడు,ఫోర్‌‌‌‌ వీలర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌

ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత

హైదరాబాద్‌‌‌‌లో గుంత లేని రోడ్డు లేదు. రోజూ ఈ రోడ్లపై వెళ్లే టూవీలరిస్టులు కింద పడుతూనే ఉన్నరు. కొందరికి తీవ్రంగా గాయాలవుతున్నయ్. ప్రాణాలు కూడా పోతున్నయ్. ఎవరు దీనికి బాధ్యులు. పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉన్నా జీహెచ్‌‌‌‌ఎంసీగానీ, ప్రభుత్వంగానీ పట్టించుకోవడం లేదు.

‑ ప్రవీణ్​సాగర్, ప్రైవేట్‌‌‌‌ ఎంప్లాయ్​

అద్దాల్లాంటి రోడ్లు ఏడున్నయ్?

సీఎం కేసీఆర్‌‌ ఐదేండ్ల కింద వట్టి మాటలు చెప్పిండు. అద్దాల్లాంటి రోడ్లు వేయిస్తామన్నడు. నూనె పోసి ఎత్తుకోవచ్చన్నడు. ఇప్పుడు అలాంటి రోడ్డు ఒక్కటైనా చూపిస్తారా? ప్రజలు గుంతల రోడ్లతో రోజూ నరకం అనుభవిస్తున్నరు.

– జెన్నా సుధాకర్, లంగర్​హౌస్​