దుబ్బాకలో TRS ను ఓడిస్తేనే అన్ని పథకాలు అమలవుతాయి

దుబ్బాకలో TRS ను ఓడిస్తేనే అన్ని పథకాలు అమలవుతాయి

దుబ్బాకలో టీఆర్ఎస్‌ను ఒడిస్తే కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ మొక్కజొన్నలు మద్దతు ధరలకు కొంటామని, ఉద్యోగులకు డీఏ ఇస్తామని ప్రకటించడం దుబ్బాక ప్రజల నైతిక విజయమన్నారు. మొన్నటి వరకు కుక్క తోక అంటూ ఉద్యోగులను అవహేళనగా మాట్లాడిన కేసీఆర్  ఇప్పుడు డీఏ ప్రకటించారు. మొక్కజొన్న పంటలే వేయవద్దని 1200 రూపాయలకు క్వింటాలు  దేశమంతా దొరుకుతున్నయని మాట్లాడిన కేసీఆర్… నేడు గ్రామాలలో మీ దగ్గరే వచ్చి మొక్కజొన్నలు 1850 మద్దతు ధరకు కొంటామని అంటున్నారు. కేసీఆర్ దుబ్బాకలో ఓట్ల కోసమే రైతులకు, ఉద్యోగులకు మంచి చేస్తున్నట్లు నటిస్తున్నారని ఆరోపించారు ఉత్తమ్.

దుబ్బాకలో టీఆర్ఎస్ ను గెలిపిస్తే మళ్ళీ లెక్కలు ఓట్లు అయ్యాక మోసం చేస్తారన్నారు. అదే ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రజల కోపాన్ని చూసి అన్ని చేస్తారన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ గెలుపు రాష్ట్ర రాజకీయాలకు మలుపు అవుతుందని చెప్పారు. ఉద్యోగులకు ఇంకా రెండు డీఏలు ఇవ్వలేదు… పీఆర్‌సీ ఇవ్వలేదు. రైతులకు రుణ మాఫీ ఇవ్వలేదు. పంటలు పాడైతే నష్ట పరిహారం ఇవ్వలేదు. కౌలు రైతులకు రైతు బంధు రావాలి. అన్ని పంటలను గిట్టుబాటు ధరలకు కొనాలి. ఇవన్నీ అమలు కావాలంటే దుబ్బాకలో కార్‌ను ఓడించాలని పిలుపు నిచ్చారు ఉత్తమ్. కాంగ్రెస్‌ను గెలిపిస్తే తెలంగాణ అంతటా ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.