ఆన్లైన్ లోనే ఆర్జిత సేవలు..ఫేక్ వెబ్ సైట్లు, దళారులను నమ్మొద్దు

 ఆన్లైన్ లోనే  ఆర్జిత సేవలు..ఫేక్ వెబ్ సైట్లు, దళారులను నమ్మొద్దు

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల సేవలన్నీ ఇకపై ఆన్లైన్ లోనే నిర్వహించనున్నట్లు ఈఓ లవన్న తెలిపారు. మే 01వ తేదీ నుండి ఆన్లైన్ సేవలను అందించేందుకు వెబ్ పోర్లల్ ను విడుదల చేశారు. http://www.srisailadevasthanam.org/ వెబ్ పోర్టల్ ను సన్నద్ధం చేసినట్లు లవన్న సూచించారు. దర్శనం మొదలు కొని ఆర్జిత సేవలు, సర్వ దర్శనం, స్పర్శ దర్శనం, వసతి గదులు వంటి అనేక సేవలు అన్నీ ఆన్లైన్ లోనే అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.  ఈ సేవల కోసం భక్తులు వెబ్ సైట్ లో ముందస్తు బుకింగ్ చేసుకోవాలని సూచించారు.

ఆన్లైన్ బుకింగ్

మే 01 వ తేదీ నుండి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులు http://www.srisailadevasthanam.org/ అధికారిక వెబ్ సైట్ లో బుక్ చేసుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు. బుకింగ్ తర్వాత సంబంధిత ఫోటో ఐడి ప్రూఫ్, బుకింగ్ టికెట్ ప్రింట్ తో ఆలయానికి రావాలని సూచించారు. ఇక నుంచి ఆర్జిత సేవ, స్పర్శ దర్శనం టికెట్ బుకింగ్ ను ఆలయం వద్ద నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై కరెంట్ బుకింగ్ కౌంటర్ల వద్ద ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం (150/- రూ.), అతి శీఘ్ర దర్శనం (300/- రూ.) టికెట్ లు మాత్రమే అందుబాటులో ఉంటాయని అన్నారు. 

దర్శన సమయం

మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు దర్శన సమయాలను దృషిలో ఉంచుకొని స్వామివారి దర్శనానికి రావాలని ఆలయ అధికారలు తెలిపారు. స్వామివారి ఉచిత, స్పర్శ దర్శనం ప్రతి మంగళవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు మాత్రమే కొనసాగుతుందని తెలిపారు. 

ముందస్తు సమాచారం ఇయ్యాలే

శ్రీశైలం దర్శనానికి వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, కలెక్టర్లు, దేవాలయ అధికారులు వంటి వీఐపీలు  ముందస్తు సమాచారం అందిస్తేనే దర్శనానికి అనుమతి ఉంటుందన్నారు. దర్శనానికి వచ్చే ముందు సంబంధిత వీవీఐపిల అధికారిక లెటర్ పై రెండు రోజుల ముందే దరఖాస్తు చేసుకుని దేవాలయ ప్రోటోకాల్ ఈమెయిల్ protocol@srisailadevasthanam.org కు గానీ లేదా 9160016215 నెంబర్ కు వాట్సప్ ద్వారా కానీ రెండు రోజుల ముందే పంపి దేవాలయ అనుమతులు పొందాలని ఈఓ లవన్న సూచించారు.

ఫేక్ వెబ్ సైట్లు, దళారులను నమ్మొద్దు

శ్రీశైలం దైవ దర్శనానికి వచ్చే భక్తులు నకిలీ వెబ్ సైట్ లను, దళారులను నమ్మి మోసపోవద్దని ఈవో లవన్న హెచ్చరించారు. దేవస్థానం అధికారిక వెబ్ సైట్ http://www.srisailadevasthanam.org/ లో మాత్రమే ఆన్లైన్ సేవలను పొందాలని ఆయన పేర్కొన్నారు.