పైసలన్నీ కాళేశ్వరానికే.. మిగతావాటికి సున్నా..

పైసలన్నీ కాళేశ్వరానికే.. మిగతావాటికి సున్నా..
  • ఆన్​గోయింగ్​ ప్రాజెక్టులకు అతీగతీ లేదు
  • ఇంచు కూడా కదలని ఎస్‌‌ఎల్బీసీ టన్నెల్‌‌
  • ప్రోగ్రెస్‌‌ లేని పాలమూరు– రంగారెడ్డి

హైదరాబాద్‌‌, వెలుగు:  సొంత రాష్ట్రం సాధించుకున్నా ఆన్‌‌ గోయింగ్‌‌ ప్రాజెక్టుల గతి మారలేదు. పైసలన్నీ కాళేశ్వరం ప్రాజెక్టుకే సర్కారు  ఖర్చు చేస్తోంది. దీంతో పెండింగ్‌‌ ప్రాజెక్టులన్నీ ఎక్కడివక్కడే ఆగిపోయాయి.

కృష్ణా నీళ్లపై అంతులేని నిర్లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నీళ్ల వాడకంలో ఎంతటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందో చెప్పడానికి ఎస్‌‌ఎల్బీసీ టన్నెల్‌‌ ప్రాజెక్టు సజీవ సాక్ష్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో ప్రారంభమైన ఈ టన్నెల్‌‌ పనులు తెలంగాణ ఏర్పడిన తర్వాత పూర్తిగా ఆగిపోయాయి. ఏడేండ్లలో జంట సొరంగం పనుల్లో కొత్తగా ఇంచు కూడా తవ్వలేదు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌‌ కేటాయింపుల మాటే మరిచింది.

పేరుకే ఫస్ట్‌‌ ప్రాజెక్టు
తెలంగాణలో మొదట పునాది రాయి వేసిన ప్రాజెక్టు పాలమూరు– రంగారెడ్డి ఇప్పటివరకు 30 శాతం పనులకే పరిమితమైంది. దీని తర్వాత శంకుస్థాపన చేసిన డిండి లిఫ్ట్‌‌ స్కీం పనులు పది శాతం లోపే అయ్యాయి. ఈ వానాకాలం సీజన్‌‌లోనే పాలమూరు నుంచి నీళ్లు ఎత్తిపోస్తామంటూ సీఎం ప్రకటించినా, అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. 

దేవాదుల ఎప్పటికి పూర్తయ్యేనో?
దేవాదుల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి 18ఏండ్లు గడిచినా ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియడం లేదు. థర్డ్‌‌ ఫేజ్‌‌ పనులు నిదానంగా సాగుతున్నాయి. కీలకమైన టన్నెల్‌‌ దాదాపు పూర్తయిందని, ప్యాకేజీ మూడు నుంచి ఎనిమిది వరకు పనులకు అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయని ఇంజనీర్లు చెప్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ. 6,121 కోట్ల నుంచి రూ. 13,452 కోట్లకు 
చేరింది.

అడ్రస్‌‌ లేకుండా పోయిన ప్రాణహిత
గోదావరి నీళ్లను సద్వినియోగం చేసుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్‌‌ సర్కారు అడ్రస్‌‌ లేకుండా చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టును రీ డిజైన్‌‌ చేసిన తర్వాత తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ నిర్మించి మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్‌‌, సిర్పూర్‌‌ నియోజకవర్గాల్లోని 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు తుమ్మిడిహెట్టిని పూర్తిగా పక్కన పెట్టి నియోజకవర్గాల వారీగా చిన్న లిఫ్టులు మంజూరు చేస్తామని ప్రకటించారు. తద్వారా ప్రాణహిత కోసం ఖర్చు చేసిన రూ. 2 వేల కోట్లకు పైగా ప్రజాధనం వృథా చేశారు. తుమ్మిళ్ల లిఫ్ట్‌‌ స్కీంను అసంపూర్తిగానే వదిలేశారు. గట్టు లిఫ్ట్‌‌ స్కీంను ఇంకా మొదలు పెట్టలేదు. నాగార్జునసాగర్‌‌ ఎడమ కాల్వ ఆయకట్టు స్థిరీకరించేందుకు ఏడేండ్ల తర్వాత ఇప్పుడు 15 ఎత్తిపోతల పథకాలకు ఎస్టిమేట్స్‌‌ సిద్ధం చేస్తున్నారు. లెండి ఇంటర్‌‌ స్టేట్‌‌ ప్రాజెక్టు, లోయర్‌‌ పెన్‌‌గంగా, చనకా – కొరాట బ్యారేజీ, సదర్మాట్‌‌ బ్యారేజీ, కుప్టి, ఎల్లంపల్లి ప్రాజెక్టు రెండో స్టేజీ పనులు నిదానంగా సాగుతున్నాయి. 

60 శాతం నిధులు కాళేశ్వరానికే
రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఇరిగేషన్‌‌ ప్రాజెక్టులపై రూ. 90 వేల కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇందులో 60 శాతానికి పైగా ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే ఉపయోగించారు. పాలమూరు ప్రాజెక్టుపై ఓ మోస్తరుగా ఖర్చు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తలపెట్టిన ప్రాజెక్టులతో పాటు తెలంగాణ వచ్చిన తర్వాత నిర్మిస్తామని చెప్పిన అనేక ప్రాజెక్టులను గాలికొదిలేశారు. ఈ ఏడేండ్లలో కొత్తగా 17 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టుగా ప్రభుత్వం చెప్తున్నా అందులో ఒక్క ఎకరం కూడా కొత్త ప్రాజెక్టుల కింద లేదు.