చెత్త ఊడ్సుడు, ట్రాక్టర్​ నడుపుడు.. అన్ని పనులకూ వాళ్లే​ 

చెత్త ఊడ్సుడు, ట్రాక్టర్​ నడుపుడు.. అన్ని పనులకూ వాళ్లే​ 
  • పంచాయతీల్లో ఫలించని మల్టీపర్పస్ వర్కర్ల ప్రయోగం
  • చెత్త వేరు చేసేటోళ్లు లేక వృథాగా సెగ్రిగేషన్​ షెడ్లు​
  • వర్కర్ల సంఖ్య పెంచాలని డిమాండ్

మంచిర్యాల, వెలుగు: గ్రామపంచాయతీల్లో టీఆర్ఎస్​ సర్కారు తెచ్చిన మల్టీపర్పస్​ వర్కర్ల ప్రయోగం ఫెయిలైంది. 500 జనాభాకు ఒక్క వర్కర్ చొప్పున పెట్టడంతో  ఏ మూలకూ చాల్తలేరు. చాలా గ్రామాల్లో 2వేల జనాభాకు ముగ్గురే ఉన్నరు. రాష్ర్టవ్యాప్తంగా 4వేల తండాలు, గూడాల్లోనైతే కేవలం ఒక్కరితోనే నెట్టుకొస్తున్నరు. చెత్త ఊడ్సుడు, ఎత్తుడు, డ్రైనేజీలు క్లీన్ చేసుడు, లైట్లు వేసుడు, నీళ్లు ఇచ్చుడు, ట్రాక్టర్ నడుపుడు.. ఇట్లా అన్ని పనులూ వాళ్లకే అప్పజెబుతుండడంతో ఏ పనికీ న్యాయం చేస్తలేరు. వర్కర్లు లేకపోవడంతో చెత్తను రీ సైక్లింగ్​చేసేందుకు కట్టిన సెగ్రిగేషన్​ షెడ్లు  నిరుపయోగంగా మారాయి.  దీంతో గ్రామాల్లో సర్కారు ఆశించిన క్లీన్ అండ్ గ్రీన్ లక్ష్యం నెరవేర్తలేదు. 

500 మందికి ఒక్కరు..
పల్లెప్రగతిలో భాగంగా టీఆర్​ఎస్ ​ సర్కారు గ్రామ పంచాయతీల్లో మల్టీపర్పస్​ వర్కర్ల సిస్టం ప్రవేశపెట్టింది. 2011 సెన్సెస్​ ప్రకారం 500 మందికి ఒక వర్కర్​ను కేటాయించింది. ఆపై ప్రతి 500 మందికి అదనంగా మరొకరిని  నియమించుకోవాలని జీఓ నెంబర్​ 51లో సూచించింది. నెల జీతం రూ.8,500గా నిర్ణయించింది. కానీ పదేండ్ల కిందటికి ఇప్పటికి జనాభా భారీగా పెరిగింది. ఉదాహరణకు మంచిర్యాల జిల్లా హాజీపూర్​ మం డలం వేంపల్లి పంచాయతీలో 2011 సెన్సెస్​ ప్రకారం 2,081 మంది ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 3వేలు దాటింది. కానీ ఇక్కడ ఐదుగురే వర్కర్లున్నారు. ఇదే మండలం నగరం పంచాయతీలో 500కు పైగా జనాభాకు ఒక్క వర్కరే​ దిక్కయ్యాడు. పెరిగిన జనాభా లెక్కన మరో ఇద్దరు ముగ్గురు వర్కర్లు అవసరం. రాష్ర్టవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. 

అన్ని పనులకూ వాళ్లే... 
పల్లెల్లో రోడ్లు ఊడ్సుడు, డ్రైనేజీలు క్లీన్​ చేసుడు, ఇంటింటికి పోయి చెత్త జమ చేసుడు, దాన్ని డంపింగ్​ యార్డ్​కు తీస్కపోవుడు, తడి పొడి చెత్త వేరు చేసుడు, వర్మికంపోస్టు తయారు చేసుడు..  మల్టీ పర్పస్​ వర్కర్లకే అప్పగించారు.  నల్లా నీళ్లు ఇచ్చుడు, పైపులైన్ల రిపేర్లు, ఊర్లలో లైట్లు వేసుడు, బుగ్గలు పెట్టుడు, బ్లీచింగ్​, క్లోరినేషన్​, కెమికల్​ స్ర్పేయింగ్​, ట్రాక్టర్​ తోలుడు, హరితహారం మొక్కలకు నీళ్లు పోసుడుతో పాటు బిల్లుల వసూళ్లు కూడా వాళ్లే చేయాలి. గ్రామాల్లో ఏదైనా మీటింగ్​ జరిగినా, ఆఫీసర్లు వచ్చినా టెంట్లు వేసుడు, కుర్చీలు సర్దుడు,  పోలియో, కొవిడ్​ వాక్సినేషన్ ఇతర పనులన్నీ వాళ్లు చేయాల్సిందే. ఇలా ఊరూరా మల్టీ పర్పస్​ వర్కర్లు  పొద్దటి నుంచి సాయంత్రం దాకా ఇరాం లేకుండా పనిచేస్తూ పరేషాన్​ అవుతున్నారు. వయసు పైబడ్డ వాళ్లు, మహిళలు కరెంట్​, వాటర్​ సప్లై పనులు, ట్రాక్టర్​ డ్రైవింగ్​ చేయలేక ఇబ్బందులు పడుతున్నారు.అయినా సర్కరు పట్టించుకోవట్లేదు.  

వారానికోసారే చెత్త సేకరణ..
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాలను క్లీన్​అండ్​ గ్రీన్​ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్టేట్ వైడ్​12,769 గ్రామపంచాయతీల్లో సెగ్రిగేషన్​ షెడ్లను నిర్మించింది. ఇందుకు  రూ.2.50లక్షల చొప్పున రూ.320 కోట్ల వరకు ఖర్చు చేసింది. కానీ వర్కర్లు లేక తీరా ఇప్పుడు అవన్నీ నిరుపయోగంగా మారాయి. జనాభాకు తగినంత మంది వర్కర్లను కేటాయించకపోవడంతో ఏ పని కూడా కొస ఎల్తలేదు. కొన్ని గ్రామాల్లో వారానికి రెండుసార్లు రోడ్లు ఊడ్సుడు, మోరీలు తీసుడు చేస్తున్నరు. వారానికోసారి ఇల్లిల్లూ తిరిగి చెత్త జమ చేస్తున్నారు. డంపింగ్​ యార్డులకు తీసుకెళ్లి ఓ పక్కన కాలపెడుతున్నరు. తడి పొడి చెత్తను, ప్లాస్టిక్​ను వేరు చేయడానికి, వర్మీకంపోస్టు తయారు చేయడానికి టైం ఉండట్లేదంటున్నరు. ఒకరిద్దరు వర్కర్లు ఉన్న చోట పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. దీంతో గ్రామాల్లో ఎప్పటిలాగే చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. డ్రైనేజీలు కంపుకొడుతున్నాయి. కొంతమంది సర్పంచులు, సెక్రెటరీలు చొరవ తీసుకుని డెయిలీ వేజ్​పై వర్కర్లను నియమించుకుంటున్నరు. వాళ్లకు జీపీ జనరల్​ ఫండ్​ నుంచి కూలి ఇస్తున్నరు. 

చాలీచాలని జీతం..
ప్రభుత్వం మల్టీపర్పస్​ వర్కర్లకు నెలకు రూ. 8,500 జీతం ఫిక్స్​చేసింది. వాళ్లకు పీఎఫ్​, ఈ ఎస్​ఐ, ప్రమాదబీమా వంటి ఫెసిలిటీస్​ లేవు. ఊరంతా క్లీన్​గా ఉంచుతున్నా ఉద్యోగ భద్రత  కూడా లేదు. ట్రాక్టర్​ నడుపుతూ, కరెంట్​ పోళ్లు ఎక్కుతూ ప్రమాదాల బారినపడితే కనీసం ట్రీట్​మెంట్​ కూడా అందని దైన్యం. అందరిలాగే వర్క్​ అవర్స్​ నిర్ణయించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీసం వేతనం రూ.19వేలు ఇవ్వాలని, డిపెండెంట్​ ఎంప్లాయ్​మెంట్​, పీఎఫ్​, ఈఎస్​ఐ, యాక్సిడెంటల్​ ఇన్సూరెన్స్​ కల్పించాలని వర్కర్లు కోరుతున్నా సర్కారు స్పందించడం లేదు. 
 
ఒక్కలతోని ఎట్లయితది?
మా గ్రామపంచాయతీ కొత్తగా ఏర్పాటైంది. జనాభా 500 పైనే ఉంటది. ఒక్క వర్కరే ఉన్నడు. నల్లా నీళ్లు ఇడుసుడు, మోరీలు తీసుడు, చెత్త ఎత్తుకపోవుడు, ట్రాక్టర్ నడిపిచ్చుడు అన్నీ ఒక్కడే చేయాలంటే ఎట్లయితది? చెత్త సరిగ్గా ఊడుస్త లేరు, మోరీలు తీయిస్తలేరని పబ్లిక్ మమ్మల్ని తిడుతున్నరు. వర్కర్లు లేనిది మేమేం జేస్తం. ఇంకో ఇద్దరు వర్కర్లను ఇస్తే  అన్ని పనులు చేపియ్యచ్చు. 
 -రంగీలా, సర్పంచ్, రెడ్యాతండా, మెదక్​

 కారోబార్లను కొనసాగించాలె..
నేను 20 ఏండ్ల నుంచి కారోబార్​గా పనిచేస్తున్న. ప్రభుత్వం మల్టీపర్పస్​ వర్కర్ల సిస్టం పెట్టి కారోబార్లను తొలగించింది. ఇప్పుడు అన్ని పనులూ చేయాల్సి వస్తోంది. వయసు పైబడడంతోటి పోళ్లు ఎక్కుడు, లైట్లు పెట్టుడు, ట్రాక్టర్​ డ్రైవింగ్​ వంటివి చాతకావట్లే. మాకు పనిభారం ఎక్కువైంది. సండే కూడా లీవ్​ లేదు. వర్క్​ అవర్స్​ అమలు చేయాలె. ఉద్యోగ భద్రత కల్పించాలె. కనీసం వేతనం రూ.19 వేలు చెల్లించాలె. డిపెండెంట్​ ఎంప్లాయ్​మెంట్​ ఇయ్యాలె. 
-మురళీధర్​, మల్టీపర్పస్​ వర్కర్​, పెద్దంపేట 

 జీతం కూడా సక్కగ వస్తలేదు.. 
 నేను 20 ఏండ్లుగా పంచాయతీ కార్మికునిగా పనిచేస్తున్న. ఎలక్ట్రిషియన్​గా చేరిన మొదట్లో నాకు రూ. 150 జీతం వస్తుండె. ఇప్పుడు 8,500 చేసిన్రు. అది కూడా ఓ నెలది ఓ నెల అన్నట్లు సరిగ్గా వస్తలేదు.  ఎలక్ట్రిషియన్​ అయిన నాతో అన్ని పనులు చేయిస్తున్నరు. చెత్త ఎత్తించడం, కాల్వలు క్లీన్​ చేయడం, గడ్డి పీకడంలాంటివి. ఏ పనికీ న్యాయం చేయలేకపోతున్నం. వెంటనే జీఓ 51 రద్దు చేసి జీపీల్లో కార్మికుల సంఖ్య పెంచాలె.  

-ఎస్ రాజయ్య, కూనారం, కాల్వ శ్రీరాంపూర్ మండలం, పెద్దపల్లి జిల్లా